Devotional

23 నుండి మంచి ముహూర్తాలు

23 నుండి మంచి ముహూర్తాలు

శ్రావణ మాసం శుభకార్యాలకు స్వాగతం పలుకుతుంది. పండుగలు, పబ్బాలకు నెలవవుతుంది. జ్యేష్ఠం, ఆషాఢం రెండు నెలల శూన్యకాలం తర్వాత పెండిళ్లు, గృహప్రవేశాలు, శుభకార్యాలకు గొప్ప ముహూర్తాలను తీసుకువస్తుంది. ఎప్పట్లాగే ఈ సారి మంచి రోజులు వచ్చినా, కరోనా నేపథ్యంలో శ్రావణ శోభ తగ్గింది. ఊరూవాడా తెలిసేలా అంగరంగ వైభవంగా జరుపుకోవాల్సిన శుభకార్యాలను నిరాడంబరంగా చేసుకోవాల్సిన దుస్థితి వచ్చింది. ఎండకాలం జరగాల్సిన కార్యక్రమాలను వాయిదా వేసుకొని శ్రావణం కోసం ఎదురుచూసినా, వైరస్‌ ఉధృతి తగ్గకపోవడంతో మొక్కుబడిగా జరుపుకోవాల్సి వస్తున్నది. వివాహాలకు ప్రభుత్వ అనుమతులు తప్పనిసరి కావడంతో కొద్ది మంది అతిథుల సమక్షంలోనే పెళ్లితంతును నిర్వహించుకోవడం కనిపిస్తున్నది.
****శ్రావణంలో ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక వాతావరణం కనిపిస్తుంది. నెల రోజుల పాటు ప్రతి ఇల్లూ దేవాలయాన్ని తలపిస్తుంది. నోములు, వ్రతాలు, పూజలు, ప్రత్యేక ఆరాధనలతో శోభాయమానంగా వెలుగులీనుతుంది. ఏ గుడిని చూసినా భక్తులతో రద్దీగా కనిపిస్తుంది. ఇంకా పండుగలు, పబ్బాలు, శుభకార్యాలతో ఈ నెలంతా సందడిగా ఉంటుంది. కానీ, ఈ సారి కరోనా నేపథ్యంలో శ్రావణ శోభ తగ్గింది.
**ప్రభుత్వ అనుమతి తప్పనిసరి..
కరోనా కట్టడి దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతున్నది. వివాహాది శుభకార్యాలకు తప్పనిసరిగా తహసీల్దార్‌ అనుమతి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. కోర్టు నుంచి జ్యుడీషియల్‌ స్టాంప్‌ పేపర్‌పై అనుమతి తీసుకోవాలనే నిబంధననూ విధించింది. పెండ్లికి వధువు తరఫున 10 మంది, వరుడి తరఫున 10 మంది మొత్తం 20 మందితోనే వివాహ వేడుకలను చేసుకోవాలనే నిబంధన అమలు చేస్తున్నది. కాగా, వేడుకల్లో పెద్ద సంఖ్యలో పాల్గొంటే చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది.
**వెంటాడుతున్న భయం..
కరోనా విజృంభనతో ప్రతి ఒక్కరిలోనూ భయం కనిపిస్తున్నది. సామాన్యుల నుంచి ధనవంతుల వరకు అందరిలోనూ ఆందోళన కనిపిస్తున్నది. ఇటు శుభకార్యాలకు ఆహ్వానించినా జనం వెళ్లేందుకు పెద్దగా ఇష్టపడడం లేదు. ఎక్కడ వైరస్‌ సోకుతుందేమోనన్న భయం వెంటాడుతున్నది. ఒకవేళ వేడుకలకు పిలువకపోయినా పట్టించుకోవడం లేదు. ఇటు శుభకార్యాలు జరిపేందుకు పురోహితులు కూడా ఒకటి రెండు సార్లు ఆలోచిస్తున్నారు. రాత్రి ఒంటి గంట నుంచి తెల్లవారుజాము 3 గంటల వరకు పెండిళ్లు జరిపేందుకు ఇష్టపడడం లేదు. వివాహం తర్వాత హాజరైన వారిలో ఎవరికైనా పాజిటివ్‌ వస్తే తమను కూడా క్వారంటైన్‌ చేస్తారన్న భయం కూడా ఉన్నది. వివాహాలకు వెళ్తున్న సందర్భాల్లో కచ్చితంగా నిబంధనలు పాటిస్తున్నారు. అదే సమయంలో వేదికపై వధూవరులతోపాటు వారి తల్లిదండ్రులు మాత్రమే ఉండాలని, ప్రభుత్వ నిబంధనలు పాటించాలని స్పష్టం చేస్తున్నారు. వేదికపైకి ఎక్కువ మంది వస్తే తాము వెళ్లిపోతామని స్పష్టం చేస్తున్నారు. ఇటు ఫొటో, వీడియోగ్రాఫర్లు కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పీపీఈ కిట్లు ధరించి మరీ ఫొటోలు, వీడియోలు తీస్తున్నారు. భోజనాల వద్ద వడ్డించేవాళ్లు కూడా వీటినే ధరిస్తున్నారు.
**సాదాసీదాగా పెండిళ్లు..
పెళ్లంటే పందిళ్లు, సందళ్లు, తప్పెట్లు, తాళాలు, తలంబ్రాలు అన్నాడో సినీకవి. అవును జీవితంలో ఒకసారి జరిగే వివాహ వేడుక నిర్వహణకు ఎంత హడావిడి చేసేవాళ్లు. అప్పు చేసైనా ఘనంగా నిర్వహించేవాళ్లు. మార్చి ముందు ఇలానే ఉండేది. కానీ, కరోనా రాకతో పరిస్థితి అంతా మారిపోయింది. శ్రావణంలో మంచి ముహూర్తాలు ఉన్నా పెద్దగా ఆసక్తి చూపడం లేదు. వైరస్‌, ప్రభుత్వ నిబంధనల నేపథ్యంలో కేవలం 20 మంది సమక్షంలోనే వివాహాలు జరిపిస్తున్నారు. ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా సాదాసీదాగా వివాహాలు చేసుకుంటున్నారు. చాలా వరకు ఇండ్ల వద్దనో, ఆలయాల్లోనో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వేదికల వద్ద కరోనా నివారణ జాగ్రత్తలు కూడా పాటిస్తున్నారు. శానిటైజర్లను వినియోగిస్తున్నారు.
**నిరాడంబరంగా కార్యక్రమాలు..
ప్రభుత్వ నిబంధనల నేపథ్యంలో వివాహాది ఖర్చు చాలా వరకు తగ్గింది. ఫంక్షన్‌ హాళ్లు, కల్యాణ మండపాలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతివ్వకపోడంతో వేడుకలకు దేవాలయాలే వేదికలవుతున్నాయి. వెడ్డింగ్‌ కార్డులు ప్రింట్‌ చేయించి, ఇంటింటికీ పంచే పరిస్థితి లేదు. స్మార్ట్‌ఫోన్‌లోనే ఆహ్వాన పత్రికలు అందుతున్నాయి. గతంలో వందలాది మంది సమక్షంలో పెళ్లి జరిపించి, భోజనాలు పెట్టించేవాళ్లు. ఇప్పుడు గృహ ప్రవేశం, వివాహాది శుభకార్యాలకు బంధుమిత్రులను ప్రత్యేకంగా పిలువకున్నా పట్టించుకునే వారు లేరు. ఇప్పుడు కేవలం కొద్ది మంది సమక్షంలోనే పెళ్లి చేసి, భోజనాలు పెట్టించాల్సిన పరిస్థితి. అలాగే డీజే పెట్టించి, భరత్‌ తీయాల్సిన అవసరం లేదు. పెళ్లి తర్వాత ఏ చప్పుడూ లేకుండా ఇంటికి చేరుకోవడమే. ఇలా అన్నింటినీ కుదించడంతో ఖర్చు సగానికి సగం తగ్గిపోయింది. ఇది పేద, మధ్యతరగతి వర్గాలకు మేలు చేస్తున్నదన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది.