సమాజంలో మనచుట్టూ ఉన్న మనుషులందరూ మనకు మిత్రులు కాలేరు. మన అభిప్రాయాలతో కలిసి, మనకు చేదోడు వాదోడుగా ఉన్నవారినే మనకు మిత్రులుగా భావిస్తాం. మన అభిప్రాయాలతో సరిపడని వారిని, మనతో విభేదించే వారిని శత్రువులుగా చూస్తాం
శత్రువుల్లో భౌతిక శత్రువులు, అంతశ్శత్రువులని రెండు రకాలు. భౌతిక శత్రువుల్లో అనుకూలురు, అననుకూలురని మళ్ళీ రెండు రకాలు. అనుకూల శత్రువులంటే మన మాటలతోనో, అభిప్రాయాలతోనో విభేదించవచ్ఛు కులం వల్ల, మతం వల్ల, ప్రాంతీయత వల్ల వాళ్ళతో మనం విభేదించవచ్ఛు వీళ్ళతో అభిప్రాయ భేదాలొచ్చినా, కలిసి మెలిసి సర్దుకుపోయే తత్వం ఉంటుంది.
అననుకూల శత్రువులంటే భూ, గృహ, ఆస్తి పంపకాల వల్లగానీ, రాజకీయ, మత వైషమ్యాల వల్లగానీ, ఈర్ష్యాసూయల వల్లగానీ ఒకరి ఉన్నతిని మరొకరు సహించలేకపోవడం వల్ల అవతలివారి అంతాన్ని కూడా చూడాలన్న స్థాయికి ఎదిగిన శత్రుత్వం. వీరుగాక ఆగర్భ శత్రువులు, అకారణ శత్రువులు కూడా ఉంటారు.
దేవదానవులు ఆగర్భశత్రువులు. కౌరవ పాండవులు ఆస్తిమూలక శత్రువులే అయినా ఆగర్భ శత్రువులే! ఇక అకారణ శత్రువులు కొందరు ఉంటారు.
గడ్డి తినే బతికే జింకలకు బోయవాని వల్ల, నీటిలో ప్రశాంతంగా సంచరించే చేపలకు జాలరుల వల్ల, సజ్జనులకు దుర్జనుల వల్ల శత్రుత్వానికి కారణం ఉందా? అకారణం కదా!
ఈ శత్రుత్వాలను మనిషి తలచుకుంటే నివారించుకోగలడు. సహజగుణం పెంపొందించుకున్నప్పుడు పొరుగువారి అభ్యున్నతిని చూసి ఓర్చుకోగలిగినప్పుడు మనిషిలో శాంతగుణం అధికమవుతుంది. శాంతం పెరిగినప్పుడు ప్రేమతత్వం హెచ్చుతుంది. ప్రేరణలోనే దైవత్వం ఉంది. దైవత్వం వల్ల మనిషిలో మంచి గుణాలు పెరిగి శత్రువులు సైతం మిత్రులు కాగలరు. ఈ రకంగా భౌతికంగా శత్రువులను నివారించుకోవచ్ఛు
మిగిలింది, అంతశ్శత్రువులు.
అంటే మనకు తెలియకుండానే మనల్ని చెడు వర్తన వేపు మరల్చేవి. అరిషడ్వర్గాలు- కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. కామం ఎంతటివారినైనా ప్రలోభ పెడుతుంది. కామం అంటే కోరిక. కోరికలు రకరకాలు. ప్రపంచంలో తానే సర్వోన్నతుడిగా గుర్తింపు పొందాలని, తనకే అన్ని సంపదలూ సమకూరాలని, తానే అందరికీ అధిపతిని కావాలనుకునే స్థాయిలోవి కొన్ని. వాటిని తలదన్నేది- లభించినదానితో తృప్తిచెందకపోవడం. ‘తృప్తి చెందని మనుజుడు సప్తద్వీపంబునైన చక్కంబడునే?’ అన్నారందుకే. తృప్తిపడినవాడికి గంజిమెతుకులు లభించినా పరమాన్నంగానే భావిస్తారు.
కామం అంటే స్త్రీలోలత్వం. ఈ కాముకత్వం వల్ల ఎంతోమంది మహానుభావులు దిగజారిపోయారు. క్రోధం అంతకంటే ప్రమాదం. కోపం, ఉబ్బిపోవడం, గర్వం, సహించలేకపోవడం, నిర్వ్యాపారత్వం… వీటిని కాపురుష గుణాలన్నారు. ఈ గుణాలు ఎంత గొప్పవారినైనా కిందకు తొక్కేస్తాయి. వాటి పాలబడకూడదంటే మంచి అలవాట్లను చిన్నప్పటినుంచీ పెంపొందించుకోవాలి. ఆధ్యాత్మిక తత్వాన్ని అలవరచుకుని, భగవచ్ఛింతన కలిగి ఉండాలి. మితాహారం, సాత్వికాహారం తీసుకుంటూ పెందలకడనే లేచి స్నానాదులు ముగించి పుస్తక పఠనం సాగించాలి. సద్గ్రంథ పఠనం వల్ల బుద్ధి వక్రమార్గాన పడదు. మనో నైర్మల్యం కలిగి మంచివాడిగా ఎదుగుతాడు. ఈ రకంగా మనిషి తనలోని శత్రువులను తరిమి అందరినీ మిత్రులుగా చేసుకుని, అందరికీ మిత్రుడు కాగలడు!