DailyDose

రాజీనామాలు చేయాలి-తాజావార్తలు

రాజీనామాలు చేయాలి-తాజావార్తలు

* హిందూస్థాన్‌ షిప్‌యార్డు ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.50లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ మంత్రి అవంతి శ్రీనివాస్‌ వెల్లడించారు. పరిహారంపై అధికారులు, కార్మికులతో మంత్రి చర్చలు జరిపారు. ఒప్పంద కార్మికుల కుటుంబాల్లో ఒకరికి కాంట్రాక్టు సంస్థల్లో నిరంతర ఉపాధి కల్పిస్తామని అవంతి తెలిపారు. శాశ్వత ఉద్యోగుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంతోపాటు హెచ్‌ఎస్ఎల్‌ ద్వారా వచ్చే ప్రయోజనాలు అదనంగా ఇప్పిస్తామని పేర్కొన్నారు.

* దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. రాజకీయ నాయకుల నుంచి సెలబ్రిటీల వరకు ఎంతో మంది ఈ వైరస్‌ బారినపడ్డారు. తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు కరోనా సోకింది. దీంతో ఆయన ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్వీట్ చేశారు. ‘‘నాలో స్వల్పంగా కరోనా లక్షణాలు బయటపడటంతో, పరీక్షలు నిర్వహించారు. ఫలితాల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వైద్యుల సలహా మేరకు నేను ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నాను. కొద్ది రోజులుగా నన్ను కలిసిన వారందరూ పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నాను’’ అని ట్వీట్‌ చేశారు.

* ఏపీ రాజధాని వికేంద్రీకరణకు పూర్తిస్థాయి ప్రజామోదం కనిపించట్లేదని జనసేన పార్టీ అభిప్రాయపడింది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, రాజధానుల విషయంపై జనసేన టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించింది. విశాఖ హెచ్‌ఎస్‌ఎల్‌ ప్రమాదంలో మృతి చెందిన వారికి సంతాపం తెలిపింది. రాజధాని వికేంద్రీకరణపై న్యాయపోరాటం చేయాల్సిన సమయం వచ్చిందని జనసేన పేర్కొంది. ప్రజలు ఉద్యమించకుండా కొవిడ్‌ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయని చెప్పింది.

గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన టిమ్స్‌ని పూర్తిస్థాయిలో కొవిడ్‌ ఆసుపత్రిగా అందుబాటులోకి తెచ్చామని తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. టిమ్స్‌ను సందర్శించిన అనంతరం విలేకర్లతో ఈటల మాట్లాడుతూ.. రాష్ట్రంలో కొవిడ్‌ రోగుల కోసం గాంధీ ఆసుపత్రి ప్రత్యేకంగా పని చేస్తోందన్నారు. టిమ్స్‌లో 1,350 బెడ్ల సౌకర్యం ఉందని, ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్లు, వెంటిలేటర్లతో కూడిన సదుపాయాలు ఉన్నాయని పేర్కొన్నారు. కరోనా చికిత్స ఖరీదైనది కాదని, ఆక్సిజన్‌, మందులన్నీ కలిపితే కూడా రూ.పదివేలకు మించి కాదని మంత్రి ఈటల స్పష్టం చేశారు.

* ఎస్సీల పట్ల తెలంగాణ ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం హితవు పలికారు. వర్గల్‌ మండలం వేలూరులో ఆత్మహత్య చేసుకున్న రైతు నర్సింహులు కుటుంబాన్ని కోదండరాం పరామర్శించారు. అనంతరం కోదండరాం మాట్లాడుతూ.. ఎస్సీలకు భూమి ఇవ్వకపోగా ఉన్నది తీసుకోవడం బాధాకరమని పేర్కొన్నారు. భూమి లాక్కున్నారనే నర్సింహులు ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. ఈ ఆరేళ్లలో ప్రభుత్వం సుమారు రెండు లక్షల ఎకరాలు సేకరించిందని తెలిపారు. ఎస్సీలకు మాత్రం ప్రభుత్వం 15వేల ఎకరాలే పంపిణీ చేసిందని కోదండరాం విమర్శించారు.

* కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ దిల్లీలోని సర్‌గంగారాం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. రెండ్రోజుల క్రితం ఆమె ఆస్పత్రిలో చేరారు. సోనియాకు సాధారణ వైద్య పరీక్షలు చేసినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. గతంలో అనారోగ్యానికి గురైన సోనియా గాంధీ విదేశాలకు వెళ్లి వైద్యం చేయించుకున్న విషయం తెలిసిందే.

* భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-2 మిషన్‌పై మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. చంద్రుడి ఉపరితలంపై దిగే క్రమంలో ల్యాండర్‌ విక్రమ్‌ భూకేంద్రంతో సంబంధాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే, చంద్రుడిపై చక్కర్లు కొట్టి పరిశోధనలు జరిపేలా రూపొందించిన రోవర్‌ ప్రజ్ఞాన్‌ మాత్రం చెక్కుచెదరకపోయి ఉండొచ్చని చెన్నైకి చెందిన అంతరిక్ష ఔత్సాహికుడు, టెకీ షణ్ముగ సుబ్రమణియన్‌ తెలిపారు.

* ప్రపంచంలో అమ్మ ప్రేమ తర్వాత అంత గొప్ప ప్రేమ కేవలం స్నేహితుల్లోనే ఉంటుంది. కుటుంబ సభ్యుల తర్వాత మన శ్రేయస్సు కోరేవారే నిజమైన స్నేహితులు. అలాంటి స్నేహితులకు క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ ఫ్రెండ్‌షిప్‌ డే శుభాకాంక్షలు చెప్పాడు. ‘స్నేహబంధాలు అనేవి ఫ్లడ్‌లైట్ల లాంటివి. మన విజయాల్ని ఓ మూల నుంచే ఆస్వాదిస్తాయి. అలాగే, మనమీద నుంచి సూర్యుడు పోతున్నాడని తెలిస్తే వాటంతట అవే వెలిగిపోతాయి. మన చుట్టూ వెలుగునిస్తూ ఉపయోగంగా ఉంటాయి. నాకైతే ప్రతీ రోజు స్నేహితుల దినోత్సవమే’ అని సచిన్‌ పేర్కొన్నాడు.

* భాజపా తెలంగాణ నూతన కార్యవర్గాన్ని పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రకటించారు. పాత, కొత్త కలయికతో రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేశారు. 8 మంది ఉపాధ్యక్షులు, నలుగురు ప్రధాన కార్యదర్శులు, ఎనిమిది మంది కార్యదర్శులను నియమించారు. రాష్ట్ర కమిటీతోపాటు పార్టీ అనుబంధ మోర్చాలకు అధ్యక్షులను ప్రకటించారు.

* మహారాష్ట్రను కరోనా వైరస్‌ మహమ్మారి అతలాకుతలం చేస్తోంది. దేశంలోనే అత్యధిక కరోనా కేసులు, మరణాలు మహారాష్ట్రలో చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. వైరస్‌ను ఎదుర్కోవడంలో ముందుండి విధులు నిర్వర్తిస్తోన్న పోలీసులూ ఈ మహమ్మారి బారినపడుతున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 9566 పోలీసు సిబ్బంది ఈ వైరస్‌ బారినపడినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో 103 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు.

* ఉత్తర బంగాళాఖాతంలో ఈ నెల 4న అల్పపీడనం ఏర్పడే అవకాశముందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఇవాళ, రేపు అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఎల్లుండి చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. రాగల మూడ్రోజులు ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముంది.