ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం తయారుచేస్తున్న కరోనా వ్యాక్సిన్ రెండు, మూడో దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ)కు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) అనుమతిచ్చింది. కొవిడ్-19పై అధ్యయనం చేస్తున్న నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు ట్రయల్స్‌కు అంగీరిస్తూ డీసీజీఐ వి.జి.సొమానీ ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎస్ఐఐ వెల్లడించింది. ఆక్స్ఫర్డ్ జరిపిన తొలి, రెండో దశ ఫలితాలను విశ్లేషించిన అనంతరం భారత్‌లో దీన్ని పరీక్షించేందుకు అనుమతించాలని ‘సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్’(సీడీఎస్‌సీవో)లోని నిపుణుల కమిటీ డీసీజీఐకి సిఫార్సు చేసింది. దీంతో ‘కొవిషీల్డ్’ పేరిట తయారు చేస్తున్న ఈ వ్యాక్సిన్‌ను భారత్‌లో ప్రయోగించేందుకు అనుమతి లభించింది. దేశవ్యాప్తంగా మొత్తం 17 ప్రాంతాల్లో ఈ ప్రయోగాలు జరగనున్నట్లు సీఐఐ వర్గాలు తెలిపాయి. వీటిలో విశాఖలోని ఆంధ్ర మెడికల్ కాలేజ్ కూడా ఉంది. 18 ఏళ్ల వయసు పైబడిన 1600 మందికి ఈ వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు సమాచారం.
ఇండియాలో ఆక్స్‌ఫోర్డ్ టీకా ప్రయోగాలు
Related tags :