Food

ఎండు అరటిపండు వచ్చేసింది

ఎండు అరటిపండు వచ్చేసింది

పసిపాపకు తొలిసారి తినిపించే అమృతఫలం… వయసుతో పనిలేకుండా, పేదా గొప్పా తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ సునాయాసంగా తీసుకోగలిగే అద్భుత ఫలం అరటిపండు. ఎన్నో పోషకవిలువలతో కూడి… చౌకగా లభించే ఈ పండు బియ్యం, గోధుమ, మొక్కజొన్న తరవాత స్థానంలో ఉన్న ప్రధాన ఆహార పంట. ఇలాంటి ప్రత్యేకతలెన్నో ఉన్న ఈ కదళీఫలం కూడా ఇప్పుడు డ్రైఫ్రూట్స్‌ జాబితాలో చేరిపోయింది. మరి ఎండిన ఆ అరటి రుచేంటో మనమూ చూసేద్దామా…!
***(ఏ కాలంలోనైనా మార్కెట్‌లోనూ, వీధి చివర బండి మీదా… ఇలా ఎక్కడ పడితే అక్కడ చౌకగా దొరికేది ఒక్క అరటి పండే. వీటిని ఇలా కొని తీసుకొచ్చామో లేదో అలా పండిపోతాయి. పిల్లలే కాదు చాలామంది పెద్దవాళ్లు కూడా కాస్త మగ్గిపోయినా, పండిన వాసన వచ్చినా వాటిని తినడానికి ఇష్టపడరు. దాంతో వాటిని వృథాగా పడేయలేక కళ్లు మూసుకుని తినేయడమో, లేదా జ్యూస్‌రూపంలోకి మార్చేసి తీసుకోవడమో చేస్తుంటారు ఆడవాళ్లు. అలానే అరటి పండ్లని ప్రయాణాల్లో తీసుకెళ్లడం కూడా కుదరదు. ఇవి ఆరోగ్యానికి మేలు చేసేవే అయినా వీటితో చాలానే సమస్యలున్నాయి. అదే ఎండిన అరటి పండ్లను తెచ్చేసుకుంటే ఎప్పుడైనా ఎక్కడైనా తినేయొచ్చు. ఎన్నిరోజులున్నా పాడైపోతాయనే బాధ కూడా ఉండదు. ప్రయాణాల్లోనూ బయట ఆహారానికి బదులు ఈ డ్రైఫ్రూట్స్‌ ఆకలిని తీర్చుతాయి.
***ఎండబెడతారు…
ఎండలో యంత్రాల సాయంతో వీటిని ఆరబెట్టి డ్రైఫ్రూట్స్‌గా మార్చేస్తారు. అలా చేయడం వల్ల వీటిలోని పోషక విలువ లేమీపోవు. ఎండిన పండు రుచి కూడా తాజా అరటి మాదిరే ఉంటుంది. మన దగ్గర ఆప్రికాట్‌, అంజీరా, కివీ, కిస్మిస్‌, ఎండుఖర్జూరాలను ఎక్కువగా తీసుకుంటాం తప్ప అరటిపండును డ్రైఫ్రూట్‌గా తీసుకోవడం ఇంకా మొదలు కాలేదు. కానీ ఆఫ్రికా, జమైకా, థాయ్‌లాండ్‌, తైవాన్‌, బ్రెజిల్‌ వంటి చోట్ల ఇదే ప్రధాన పంట, ఇష్టంగా తినే డ్రైఫూట్‌ కూడా. జమైకా, ఆఫ్రికా దేశాల్లో ఎండిన అరటి నుంచి తయారు చేసే పొడిని గోధుమ పిండికి ప్రత్యామ్నాయంగా వాడతారు. బలమని పిల్లలకు ఈ పిండితో చేసిన తినుబండారాలను ఎక్కువగా తినిపిస్తారు. సెలెబ్రిటీ న్యూట్రిషనిస్ట్‌ రుజుతా దివేకర్‌ కూడా సిక్స్‌ప్యాక్‌ కోసం కష్టపడే చాలామందికి ఈ పిండిని సూచిస్తోంది. ఇక మరికొన్ని దేశాల్లో ఎండిన ఫలాలతో బార్లూ, కుకీస్‌, జెల్లీలూ, క్యాండీలూ విరివిగా తయారు చేస్తున్నారు.
*కరోనా వల్ల ఇప్పుడు మన దగ్గర కూడా ఎండబెట్టిన అరటి పండ్లకు గిరాకీ వచ్చింది. లాక్‌డౌన్‌ సమయంలో పంటను సరైన సమయానికి అమ్ముకోలేక మగ్గిపోయిన పండ్లను రోడ్డు పక్కన పడేశారు ఎంతో మంది అరటి రైతులు. కర్ణాటకలోని బళ్లారికి చెందిన గంగాధర్‌ అనే రైతు మాత్రం పంట చేతికి రాగానే మార్కెట్‌కి తీసుకెళ్లకుండా తొక్క తీసి ఎండబెట్టి డ్రైఫ్రూట్స్‌గా మార్చి అమ్మడం మొదలుపెట్టాడు. పైగా విదేశాల్లోనూ వీటికి గిరాకీ ఉన్న విషయం తెలుసుకుని ఎగుమతి చేయడానికి ఆర్డర్లు తీసుకున్నాడు. అలా కష్టకాలంలో గంగాధర్‌ చాలామందికి దారిచూపాడు. ఆ స్ఫూర్తితోనే గోదావరి, రాయలసీమ, ఉత్తరాంధ్రలోని కొందరు రైతులు ఇప్పుడు అరటిపండ్లని ఎండుఫలాలుగా మార్చేసి లాభసాటి మార్గంలో ప్రయాణిస్తున్నారు. ఓసారి రుచి చూద్దామా మరి!