బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తి పరారీలో ఉందని బిహార్ డీజీపీ గుప్తేశ్వర్ పాండే తెలిపారు. కేసు విచారణలో ఆమె ఏ మాత్రం సహకరించకుండా తప్పించుకు తిరుగుతున్నట్లు చెప్పారు. రియా ఎక్కడుందున్న అంశంపై మహారాష్ట పోలీసులకు తెలిసి ఉంటుందన్న దానిపై తమకు ఎలాంటి సమాచారం లేదన్నారు. సుశాంత్ ఆత్మహత్య అనంతరం ఆ మరణానికి రియానే కారణమంటూ సుశాంత్ తండ్రి కేకే సింగ్ పట్నా పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసును పట్నా నుంచి ముంబైకి బదిలీ చేయాలంటూ రియా దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.
సుశాంత్ ఆత్మహత్యకు సంబంధించిన కేసు దర్యాప్తులో భాగంగా ప్రత్యేక పోలీసు బృందం ముంబైకి వెళ్లిందని, అయితే అక్కడి పోలీసులు దీన్ని అడ్డుకున్న తీరును డీజీపీ పాండే ఖండించారు. ఐపీఎస్ అధికారి వినయ్ తివారీని ముంబై పోలీసులు బలవంతంగా క్వారంటైన్లో ఉంచారని, వెంటనే తివారిని విడిపించాల్సిందిగా మహారాష్ర్ట పోలీసులను కోరారు. ఇది మంచి పద్ధతి కాదని, ఒక ఐపీఎస్ అధికారిని అది కూడా కేసు దర్యాప్తు నిమిత్తం వస్తే ఇలా నిర్భంధంలో ఉంచడాన్ని తప్పుబట్టారు. ఇది ముమ్మాటికి అరెస్ట్ లాంటిదే అని పాండే అన్నారు. జూన్ 14న ముంబై బాంద్రాలోని తన అపార్ట్మెంట్లో సుశాంత్ చనిపోయినట్లు గుర్తించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇది ఆత్మహత్య కాదు ముమ్మాటికి హత్యేనంటూ కుటుంబసభ్యులు సహా పలువురు ప్రముఖులు ఆరోపిస్తున్నారు. ఇక ఈ కేసు విచారణలో భాగంగా ఇప్పటివరకు 56 మంది వాంగ్మూలాలను తీసుకున్నామని ముంబై పోలీసులు సుప్రీంకు తెలిపారు. కుటుంబసభ్యులు సహా పలువురు సినీ పరిశ్రమకు చెందిన వారిని సైతం విచారించామని పేర్కొన్నారు.