Business

వడ్డీరేట్లు తగ్గించేది లేదు-వాణిజ్యం

Business News Roundup - RBI Confirms No Change Of Interest Rates

* కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్ని కుదేలయ్యాయి.ఈ క్రమంలో కీలక వడ్డీ రేట్లలో మార్పు లేదని ఆర్బీఐ ప్రకటించింది. ఇవాళ జరిగిన ద్రవ్య పరపతి విధాన సమీక్ష సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ఈ మేరకు ప్రకటించారు.రెపో రేటు 4 శాతం, రివ‌ర్స్ రెపో రేటును 3.3 శాతంగానే ఉంచుతున్నట్టు ఆయన పేర్కొన్నారు.బ్యాంకులకు ఇచ్చే రుణాల నుంచి ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటును రెపోరేటు అని.. బ్యాంకులకు ఆర్బీఐ చెల్లించే వడ్డీ రేటును రివర్స్ రెపోరేటు అని అంటారు. మరోవైపు….రెపోరేటు తగ్గిస్తే వచ్చే లాభాలను తమ వినియోగదారులకు బదలాయించవచ్చునని బ్యాంకులు ఆశిస్తాయి.తద్వారా గృహ, వాహన రుణాలు సహా ఇతర రుణాలపై వడ్డీ భారం తగ్గి ఈఎంఐల భారం తగ్గుతుంది. ఈ సారి వడ్డీరేట్లను ఆర్బీఐ కనీసం 25 బేస్ పాయింట్లు తగ్గిస్తుందని వ్యాపార వర్గాలు ఆశించాయి.నేషనల్ హౌసింగ్ బ్యాంకు (ఎన్‌హెచ్‌బీ), నాబార్డ్‌ల (జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు) ద్వారా అదనంగా మరో రూ.10 వేల కోట్ల మేర నగదు లభ్యతను అందుబాటులోకి తెస్తున్నట్టు ఆర్బీఐ గవర్నర్ పేర్కొన్నారు.కరోనా కల్లోలంతో కుంటుపడిన ఆర్థిక రంగానికి ఊతమిచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది.

* దివాలా ప్రక్రియ నిమిత్తం అమెరికా కోర్టులో దిగ్గజ విమానయాన సంస్థ వర్జిన్‌ అట్లాంటిక్‌ దరఖాస్తు పెట్టుకుంది. కరోనా వైరస్‌ పరిణామాల నేపథ్యంలో విమానయాన పరిశ్రమ సంక్షోభంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ సంక్షోభాన్ని తట్టుకునే ప్రయత్నాల్లో భాగంగా వర్జిన్‌ అట్లాంటిక్‌ దివాలా ప్రక్రియకు వెళ్లేందుకు నిర్ణయం తీసుకుంది. న్యూయార్క్‌లోని యూఎస్‌ ఫెడరల్‌ బ్యాంక్రప్టసీ కోర్టులో చాఫ్టర్‌ 15 కింద ఈ దరఖాస్తును సమర్పించింది. గత నెలలో ప్రకటించిన పునర్‌వ్యవస్థీకరణ ప్రణాళికను ముందుకు తీసుకెళ్లేందుకు దివాలా ప్రక్రియకు దరఖాస్తు అనేది యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో కోర్టు ప్రక్రియలో భాగమని వర్జిన్‌ అట్లాంటిక్‌కు చెందిన ఓ అధికార ప్రతినిధి తెలిపారు. వర్జిన్‌ అట్లాంటిక్‌ వ్యవస్థాపకుడు బ్రిటన్‌కు చెందిన వ్యాపారవేత్త రిచర్డ్‌ బ్రాన్‌సన్‌ కావడం గమనార్హం. ఈ దివాలా ప్రక్రియకు తమకు రుణాలిచ్చిన సంస్థల్లో చాలా వరకు అంగీకారం తెలిపాయని పేర్కొన్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణలో భాగంగా విధించిన ఆంక్షలతో ఏప్రిల్‌లో వర్జిన్‌ అట్లాంటిక్‌ కార్యకలాపాలు నిలిపివేసింది. జులైలో తిరిగి విమాన సేవలను పునరుద్ధరించింది. అయితే సుమారు 3,500 మంది ఉద్యోగులను కూడా ఈ సంస్థ తొలగించింది.

* వేర్వేరు సాంకేతిక బృందాల కోసం హైదరాబాద్‌, బెంగళూరులలో 140 మంది ఇంజినీర్ల నియామకం చేపట్టినట్లు క్యాబ్‌ బుకింగ్‌ సంస్థ ఉబర్‌ ప్రకటించింది. ప్రయాణికులు, డ్రైవర్ల వృద్ధి నమోదు, డెలివరీ, వినియోగదారుల సేవలకు సంబంధించి నూతన ఉత్పత్తులను ఈ బృందాలు తయారు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం హైదరాబాద్‌, బెంగళూరులలో ఈ సంస్థకు 600 మంది ఉద్యోగులున్నారు. కొవిడ్‌ సంక్షోభం నేపథ్యంలో, 600 మంది సిబ్బందిని భారత్‌లో తొలగిస్తున్నట్లు గత మే నెలలో ఉబర్‌ ప్రకటించిన సంగతి విదితమే.

* దేశీయ స్టాక్‌మార్కెట్లు గురువారం లాభాల్లో ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి. ఉదయం 9.18 సమయంలో సెన్సెక్స్‌ 165 పాయింట్లు లాభపడి 37,828 వద్ద, నిఫ్టీ 53 పాయింట్లు లాభపడి 11,154 వద్ద ట్రేడవుతున్నాయి. యస్‌ బ్యాంక్‌, హాత్‌వే కేబుల్స్‌, ప్రిస్మ్‌, ఇంటెలెక్ట్‌ డిజైన్‌, డిష్‌టీవీ షేర్ల విలువ పెరగ్గా.. వీఐపీ, ఓమెక్స్‌, అదానీ గ్యాస్‌, టీటీకే ప్రస్టీజ్‌, కేఈఐ ఇండస్ట్రీస్‌లు నష్టపోయాయి.

* రుణ వాయిదాల వసూలుపై మారటోరియంను మరింత పొడిగించినా, రుణాలను ఒకసారి పునర్‌ వ్యవస్థీకరించినా ఆర్థిక సంస్థలకు కష్టాలు తప్పవని, ఆర్థిక స్థిరత్వంపైనా ప్రభావం పడుతుందని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా పేర్కొంది. రుణ గ్రహీతలకు కల్పించిన 6 నెలల మారటోరియం ఆగస్టు 31తో ముగియనుండటం, ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలు ఈనెల 6న వెలువడనున్న నేపథ్యంలో, బుధవారం ఇక్రా తన నివేదిక విడుదల చేసింది.

* దేశీయ స్టాక్‌మార్కెట్లు గురువారం భారీ లాభాల్లో ముగిశాయి. భారతీయ రిజర్వు బ్యాంకు రెపోరేట్‌ను యథాతథంగా 4 శాతం వద్దే ఉంచడంతో మార్కెట్లలో సానుకూల సెంటిమెంట్‌ ఏర్పడింది. దీంతో మదుపర్లు భారీగా కొనుగోళ్లు చేపట్టారు. బీఎస్‌ఈ సెనెక్స్‌ 362.12 పాయింట్లు, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 98.50 పాయింట్లు లాభపడ్డాయి.