* దేశీయ స్టాక్‌మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.40 గంటలకు సెన్సెక్స్ 316 పాయింట్లు లాభపడి 38,498 వద్ద ఉండగా.. నిఫ్టీ 87 పాయింట్ల లాభంతో 11,358 వద్ద కొనసాగుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 74.89గా ఉంది.
* కృత్రిమ మేధ(ఏఐ)తో నైపుణ్యాలను కలగలపడం ద్వారా కంపెనీలు విజయవంతం అవుతున్నాయని మైక్రోసాఫ్ట్ ఇండియా తన పరిశోధనా పత్రంలో తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా పెద్ద కంపెనీలతో కలిసి పనిచేస్తున్న 12,000 మంది నుంచి సమీకరించిన వివరాలతో ఈ నివేదిక రూపొందింది. భారత్‌లోనూ అన్ని పరిశ్రమ విభాగాల్లోని పెద్ద కంపెనీల ఉద్యోగులు, అధిపతులతో ఈ సర్వే నిర్వహించింది.
* విలాసవంతమైన మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ ట్రయాంఫ్ భారత్‌లో సరికొత్త మోడల్‌ను ప్రవేశపెట్టింది. ట్రయాంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ పేరుతో ప్రవేశపెట్టిన ఈ బైకు ధర రూ.8.84 లక్షలు(దిల్లీ ఎక్స్‌షోరూం) గా నిర్ణయించారు. దీని ధర ట్రిపుల్ ఆర్ఎస్ రూ. 11.33లక్షలతో పోలిస్తే తక్కువగా ఉంది. ప్రస్తుతం రూ.లక్ష అడ్వాన్స్‌తో బుకింగ్స్‌ను మొదలుపెట్టింది. ప్రస్తుతం ఉన్న స్ట్రీట్ ట్రిపుల్ ఎస్ స్థానాన్ని కొత్తగా వచ్చిన ట్రిపుల్ ఆర్ బైకు భర్తీ చేయనుంది. ట్రిపుల్ ఆర్‌లో 765 సీసీ మూడు సిలిండర్ల ఇంజిన్‌ను అమర్చారు. ఈ బైకు 12,000 ఆర్పీఎం వద్ద 112 బీహెచ్పీ శక్తిని విడుదల చేస్తుంది. ఇక 11,750 ఆర్పీఎం వద్ద అత్యధికంగా 121 బీహెచ్పీ శక్తిని విడుదల చేస్తుంది. ఆర్ఎస్ మోడల్‌తో పోలిస్తే దీనిలో ఫీచర్లు తగ్గాయి. టీఎఫ్టీ ఇన్స్ట్రూమెంట్ కన్సోల్ లేదు. సరికొత్త ఆర్ గ్రాఫిక్స్‌ను దీనికి ఇచ్చారు.
* సిలికాన్ వ్యాలీ కేంద్రంగా పనిచేసే సాంకేతిక దిగ్గజం యాపిల్ అధినేత టిమ్ కుక్ మరో ఘనతను స్వంతం చేసుకున్నారు. టిమ్ వ్యక్తిగత సంపద ఒక బిలియన్ డాలర్లను మించటంతో… ఈ ఘనత సాధించిన జుకర్‌బర్గ్ తదితర సీఈఓల సరసన నిలిచారు. యాపిల్‌లో 8,47,969 షేర్లు టిమ్ కుక్ స్వంతమని తెలిసిందే. గత వారం యాపిల్ షేర్ల విలువ ఐదు శాతం వరకూ పెరగటంతో.. సంస్థ మార్కెట్ విలువ సుమారు రెండు ట్రిలియన్ డాలర్లకు చేరుకున్నట్టు బ్లూమ్‌బర్గ్ అంచనా వేసింది. దీనితో కుక్ వ్యక్తిగత సంపద ఒక బిలియన్ డాలర్లను మించిందని బ్లూమ్‌బర్గ్ వివరించింది. అంతేకాకుండా ఈ యాపిల్ సీఈఓకు గత సంవత్సరం వేతన ప్యాకేజీలో భాగంగా 125 మిలియన్ డాలర్లకు పైగా లభించింది.
* ఎంపిక చేసిన స్మార్ట్ఫోన్లలో గోప్యత యాప్ ‘ఆల్ట్జ్లైఫ్’ను ప్రవేశపెట్టినట్లు శామ్సంగ్ ప్రకటించింది. భారత్ పరిశోధనా, అభివృద్ధి కేంద్రంలో దీన్ని అభివృద్ధి చేసింది. గెలాక్సీ ఏ71, గెలాక్సీ ఏ51 స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు పవర్ బటన్ రెండుసార్లు క్లిక్ చేయడం ద్వారా సాధారణ మోడ్ నుంచి ప్రైవసీ మోడ్‌కు మారిపోవచ్చని తెలిపింది. వినియోగ ప్యాటర్న్ ఆధారంగా ప్రైవేట్ ఫోల్డర్ల్లో దృశ్యాలు, వీడియోలు ఆటోమేటిక్‌గా సేవ్ అవుతాయని వెల్లడించింది.
* రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) నిబంధనల ప్రకారం.. ప్రైవేటు రంగ కోటక్ మహీంద్రా బ్యాంకు తన ప్రమోటర్ల వాటాను తగ్గించుకుంది. ‘జనవరి 29, 2020, ఫిబ్రవరి 18, 2020, ఆగస్టు 10,200 తేదీల్లో రిజర్వు బ్యాంకు జారీ చేసిన లేఖల ప్రకారం.. గడువులోగా ప్రమోటర్ల వాటా తగ్గించాలనే నిబంధనను బ్యాంకు పాటించింద‘ని ఎక్స్ఛేంజీలకు బ్యాంకు సమాచారం ఇచ్చింది. ఆర్బీఐ, కోటక్ మహీంద్రా బ్యాంకుల మధ్య జరిగిన కోర్టు బయటి ఒప్పందం ప్రకారం.. బ్యాంకు ప్రమోటర్ల ఓటింగ్ హక్కులు మార్చి 31, 2020 వరకు 20 శాతానికి పరిమితం అవుతాయి. ఏప్రిల్ 1, 2020 నుంచి అవి 15 శాతానికే పరిమితం కావాల్సి ఉంటుంది. ఆర్బీఐ తుది ఆమోదం పొందినప్పటి నుంచి 6 నెలల్లోగా ప్రమోటర్ల వాటా 26 శాతానికి తగ్గించాలి. కాగా, జూన్ 30, 2020 నాటికి బ్యాంకులో ఉదయ్ కోటక్ వాటా 25.82 శాతంగా ఉంది.