Kids

ఆదర్శ వైద్యుడు…డా.నోరి దత్తాత్రేయుడు

ఆదర్శ వైద్యుడు…డా.నోరి దత్తాత్రేయుడు

డాక్టర్‌ నోరీ దత్తాత్రేయుడు… ఎన్నో క్లిష్టమైన క్యాన్సర్‌లను నయం చేసిన చేయి ఆయనది. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ప్రముఖులను క్యాన్సర్‌ బారి నుంచి కాపాడిన తెలుగుతేజం ఆయన. అమెరికాలో ఉంటూ క్యాన్సర్‌ చికిత్స విధానాన్ని కొత్త పుంతలు తొక్కించిన డాక్టర్‌ నోరీ చిన్ననాటి జ్ఞాపకాలు… వైద్య వృత్తిలో అనుభవాలు… కుటుంబ విషయాలు.. ఆయన మాటల్లోనే..

మా స్వస్థలం కృష్ణా జిల్లా, తోట్లవల్లూరు. పుట్టింది మంటాడలో. అమ్మ కనకదుర్గ. గృహిణి. నాన్న సత్యనారాయణ. ఉపాధ్యాయుడు. మా ఊరి పక్కనే ఉన్న కురుమద్దాలి ఆశ్రమంలో ప్రవచనాలు చెప్పేవారాయన. ప్రవచనాలు చెబితే వచ్చే డబ్బును ఆయన ఆశ్రమానికే ఇచ్చేసేవారు. మాకున్న అర ఎకరా పొలాన్ని ఆయన ఆశ్రమానికే రాసిచ్చేశారు. కుటుంబానికేదైనా ఆపదొస్తే ఆ దేవుడే గట్టెక్కిస్తాడని నమ్మే మనస్తత్వం ఆయనది. శ్రీరామనవమి రోజున పామర్రు దగ్గర కాలువలో స్నానానికెళితే… చెప్పా పెట్టకుండా కాలువ లాకులెత్తేయడంతో వరదలో కొట్టుకుపోయారాయన.

నాన్న దూరమయ్యేప్పటికి నాకు నాలుగేళ్లు. అప్పటికి ఆర్థికంగా చితికిపోయిన కుటుంబం మాది. మేం మొత్తం పదకొండు మంది సంతానం. అయిదుగురు అన్నలు, అయిదుగురు అక్కలు. నేనే ఆఖరివాణ్ని. నాన్న పోయాక, మాకన్నీ మా అమ్మే అయ్యింది. మా చదువుల కోసం ఆవిడ పడని కష్టం లేదు. చివరికి పరీక్ష ఫీజుకని తన చేతికున్న ఒక్క గాజునూ అమ్మేసింది. నేను చిన్నవాణ్ని కావడం వల్ల ఎక్కువకాలం ఆమె పడ్డ కష్టాల్ని దగ్గర్నుండి చూశాను. మేం బాగుపడాలని తన సర్వస్వాన్నీ త్యాగం చేసింది. అప్పుడే అనుకున్నాను, నేను వృద్ధిలోకి వచ్చాక అమ్మ కోల్పోయినవన్నీ తిరిగి సమకూర్చాలని.

నేను అమెరికా వెళ్లాక వచ్చిన తొలి జీతంతో ఇండియా వచ్చి అమ్మ కోల్పోయినవన్నీ కొనిపెట్టాను. ఆ సమయంలో ఆమె ఆనందానికి అవధుల్లేవు. అమ్మ త్యాగానికి తిరిగి ఎంతో కొంత ప్రతిఫలం చెల్లించుకోవడం కంటే జీవితానికి కావలసిందేముంటుంది.

బసవతారకం… ఓ మేలి మలుపు
నందమూరి తారక రామారావు సతీమణి బసవతారకం క్యాన్సర్‌ చికిత్స కోసం అమెరికాలో నా దగ్గరకు వచ్చారు. ఆవిడకు చికిత్స పూర్తయ్యాక… ‘‘తెలుగు నాట క్యాన్సర్‌ ఆస్పత్రి ప్రారంభించవచ్చు కదా’’ అని అడిగారు. ‘కచ్చితంగా ప్రారంభిస్తాను’’ అని వాగ్దానం చేశాను. ఆ తర్వాత ఎన్టీఆర్‌ భూమి కేటాయించారు. 1988 జూన్‌లో శంకుస్థాపన చేశాం. ఇక్కడ ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ ఆస్పత్రి స్థాపించడం వెనుక రెండు ఉద్దేశాలున్నాయి. ఒకటి బసవతారకం గారి కోరిక తీర్చడం. రెండోది… అప్పటికి ఇండియాలో మరీ ప్రాథమిక దశలో కునారిల్లుతున్న క్యాన్సర్‌ చికిత్సలను విప్లవాత్మకంగా మార్చివేయడం. కార్పొరేట్‌ ఆసుపత్రులకు దీటుగా ఉండాలని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆ హాస్పిటల్‌ పెట్టాం. పదేళ్లలో బసవతారకం ఆసుపత్రి ఇండియాలోని పది ఉత్తమ క్యాన్సర్‌ ఆసుపత్రుల్లో ఒకటిగా నిలిచింది. అతి తక్కువ సమయంలో టాటా మెమోరియల్‌, అడయార్‌ ఆసుపత్రుల స్థాయిని అందుకుంది. ప్రస్తుతం బసవతారకం ఆస్పత్రి ఇండియాలో టాప్‌ టెన్‌లో ఉంది.

అమరావతిలో మరో క్యాన్సర్‌ ఆసుపత్రికి శంకుస్థాపన చేశాం. ఆరేళ్లలో దాన్ని ఉత్తమంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చాను.

అది నా జీవితాన్ని మలుపు తిప్పింది
1974లో ఉస్మానియాలో ఎండీ చేస్తున్న రోజులవి. ఆ సమయంలో అమెరికా నుండి ఓ వైద్యుల బృందం వచ్చింది. అప్పటికి రేడియేషన్‌ ఆంకాలజీలో నేను చేస్తున్న పరిశోధన చూసి వాళ్లు ఆశ్చర్యపోయారు. ఆ బృందంలోని ఓ వ్యక్తి నాకో విజిటింగ్‌ కార్డు ఇచ్చారు. ఎప్పుడైనా అమెరికా వస్తే కలవమన్నారు. ఆ కార్డు ఇచ్చిన వ్యక్తి ఎవరంటే… ప్రపంచంలోనే అతి పెద్ద క్యాన్సర్‌ హాస్పిటల్‌గా పేరొందిన ‘‘స్లోన్‌ కేటరింగ్‌ మెమోరియల్‌ క్యాన్సర్‌ సెంటర్‌’’ ఛైర్మన్‌. నా పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ అయ్యాక అమెరికా వెళ్లాను.

రకరకాల ఆసుపత్రులు తిరిగాను. ఎవరూ ఉద్యోగమివ్వలేదు. చివరికి విజిటింగ్‌ కార్డు పట్టుకుని స్లోన్‌ కేటరింగ్‌ మెమోరియల్‌ క్యాన్సర్‌ సెంటర్‌కి కెళ్లాను. నేను వెళ్లేసరికి ఫెలోషిప్స్‌కు ఎంపికలు అయిపోయాయి. ఎవరైనా చేరకపోతే నాకు అవకాశమిస్తామని చెప్పారు. అదృష్టవశాత్తు ఒకరు చేరకపోవడంతో నేను ఆ ప్రతిష్ఠాత్మక ఆస్పత్రిలో ప్రవేశించాను. అక్కడి నుంచి వెనుదిరిగి చూసింది లేదు. పదేళ్లలో ఫెలోషిప్‌ దగ్గర మొదలుపెట్టి అదే ఆస్పత్రిలో ఛైర్మన్‌ హోదా దాకా చకచకా అన్ని మెట్లూ ఎక్కేశాను.

ఆ తర్వాత న్యూయార్క్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మక ‘‘కార్నెల్‌ యూనివర్సిటీ’’ ఛైర్మన్‌గా పదోన్నతిపై వెళ్లాను. అక్కడ 300 మంది ప్రముఖ డాక్టర్లకు శిక్షణనిచ్చే కార్యక్రమం చేపట్టాను. లెక్కలేనన్ని పరిశోధనలు చేశాను. ప్రపంచానికి నేనేంటో నిరూపించాను. అమెరికాలో వివక్ష ఉండదు. నైపుణ్యం ఉంటే ఏ స్థాయికైనా వెళ్లొచ్చు.

అలా యంత్ర రూపకల్పన
హైదరాబాద్‌ ఉస్మానియాలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ అయ్యాక హౌస్‌ సర్జన్‌గా ఎం.ఎన్‌.జె క్యాన్సర్‌ ఆసుపత్రికి వెళ్లాను. అక్కడ రేడియేషన్‌ చికిత్స చేసే విధానం అత్యంత విచిత్రంగా, భయంకరంగా ఉండేది. ఒకేసారి ఒకే గదిలో పదిమందికి చికిత్స చేస్తుండేవారు. ముప్పై అడుగుల దూరం దాకా రేడియేషన్‌ ప్రభావం ఉంటుంది. నిత్యం దీనికి గురైతే కొన్నాళ్లకే మరణించడం ఖాయం. రేడియేషన్‌ చికిత్స బాధ్యత నాకు అప్పగిస్తే చేయను అని తెగేసి చెప్పేశా. ఆ రోజే నిర్ణయించుకున్నా. అలాంటి ఆటవిక రేడియేషన్‌ చికిత్సా విధానానికి తెరదించాలని. నిజానికి ప్రపంచ వ్యాప్తంగా రేడియేషన్‌ చికిత్సా పద్ధతి అలాగే ఉండేది. పేషెంటుకు, నర్సుకు, డాక్టరుకు రేడియేషన్‌ రేడియో ధార్మిక కిరణాల ప్రభావం ఉండకుండా… స్లోన్‌ మెమోరియల్‌ హాస్పిటల్‌లో పరిశోధన చేసి 1979లో ఒక కంప్యూటరైజ్డ్‌ మెషిన్‌ కనిపెట్టాను. దీని వాడకానికి సంబంధించి నియమ నిబంధనలన్నీ నేనే రాశా. ఆ తర్వాత అమెరికాలోని ప్రతి హాస్పిటల్లోనూ ఈ పద్ధతి వచ్చింది. ప్రపంచానికంతా విస్తరించింది. వందశాతం సురక్షితం. క్యాన్సర్‌ నయమయ్యే శాతమూ గణనీయంగా పెరిగింది. అన్ని క్యాన్సర్ల చికిత్సలోనూ ఈ మెషిన్‌ వాడుతున్నారిప్పుడు.

సంక్లిష్ట క్యాన్సర్‌ కేసుల్ని నయం చేస్తుంటా
ప్రపంచంలో విఖ్యాత వైద్యులందరూ మా వల్ల కాదని చేతులెత్తేసిన అతి క్లిష్టమైన క్యాన్సర్లను నయం చేయడంలోనే నాకు మజా ఉంటుంది. ఇజ్రాయెల్‌ నుండి ఓ మహిళా నేత దేశవిదేశాలు తిరిగి చాలా ముదిరిపోయిన క్యాన్సర్‌తో నా దగ్గరకొస్తే, ఆవిడకు నయం చేశాను. ఇప్పటికీ భేషుగ్గా జీవించి ఉన్నారామె. ఆ ఇజ్రాయెల్‌ మహిళది అతి పెద్ద కుటుంబం. వాళ్లింట్లో ఏ ఫంక్షన్‌ జరిగినా, ఓ వందమంది దాకా కుటుంబ సభ్యులంతా హాజరవుతారు. నన్ను అదే పనిగా ఇజ్రాయెల్‌ పిలిపించి, ఓ సింహాసనం వేసి, దానిపై కూర్చోపెట్టి…‘‘డాక్టర్‌ నోరీ వల్లే నేను బతికున్నా.’’ అని గర్వంగా చెబుతారామె. నాకు విజిటింగ్‌ కార్డు ఇచ్చి, నన్ను అమెరికాలో అత్యున్నత డాక్టర్లలో ఒకరిగా తీర్చిదిద్దిన స్లోన్‌ మెమోరియల్‌ క్యాన్సర్‌ సెంటర్‌ వ్యవస్థాపకుడికి చర్మ క్యాన్సర్‌ వచ్చింది. నన్ను వృద్ధిలోకి తెచ్చిన మనిషికే చికిత్స చేసి నయం చేయగలిగే అవకాశం లభించింది. ఇలాంటి సంఘటనలు గర్వంగా ఉంటాయి. నేనెప్పుడూ డబ్బు కోసం ప్రాక్టీస్‌ చేయలేదు. చేసుంటే బోల్డంత సంపాదించుండేవాణ్ణి.

క్యాన్సర్‌ బాధితుల కోసం కొత్త చికిత్సలు ఆవిష్కరించాలన్న కుతూహలం ఒక్కటే తప్ప, డబ్బు పట్ల ఎప్పుడూ పెద్దగా ఆసక్తి లేదు. వైద్యుడిగా ఓ అద్భుతం చేసి రోగిని బతికిస్తే వచ్చినప్పుడు లభించే సంతృప్తి అనేది అన్నింటికంటే అత్యున్నతమైనది. అలాంటి సంతృప్తి డబ్బు వల్ల రాదు.

వీఐపీలు అందరూ నా దగ్గరికే వస్తారు
క్యాన్సర్‌ చికిత్స కోసం టాలీవుడ్‌, బాలీవుడ్‌ నటులు, రాజకీయనేతలు, అధికారులు ఇలా అందరు వీఐపీలు నా దగ్గరకే వస్తారు. 1978లో అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డికి ఊపిరితిత్తుల క్యాన్సర్‌ వస్తే, కొత్త విధానంతో చికిత్స చేశా. అనంతరం ఆయన 18 ఏళ్లు హాయిగా జీవించారు. ఆ తర్వాత నేను ఇండియా వచ్చినప్పుడల్లా నన్ను బెంగళూరులో తన ఇంటికి పిలిపించుకుని చాలా గౌరవంగా చూసుకునేవారు. యశ్‌ చోప్రా భార్యకు మెదడు క్యాన్సర్‌ మూలంగా పక్షవాతం వచ్చింది. లండన్‌లో లాభం లేదని నా దగ్గరకొచ్చారు. చికిత్స చేశాను. మూడు వారాల్లో పక్షవాతం నుండి తేరుకుని, చక్రాల కుర్చీలో వచ్చినావిడ నడుచుకుంటూ వెళ్లిపోయారు. అప్పుడు యశ్‌ చోప్రా డాలర్ల కట్టలు నా టేబుల్‌ మీద ఉంచి ఎంతైనా తీసుకోమన్నారు. మాది సేవా ఆసుపత్రి అని చెప్పాన్నేను.

నటి శ్రీదేవి అమ్మగారికి పొరపాటు ఆపరేషన్‌ జరిగి, నా దగ్గరకు తీసుకొస్తే చికిత్స చేశాను. ఆ తర్వాత ముంబయి వచ్చినప్పడల్లా శ్రీదేవి ఇంట్లోనే భోజనం చేసేదాకా వదిలేవాళ్లు కాదు. అక్కినేని నాగేశ్వరరావు క్యాన్సర్‌ ముదిరాక నా దగ్గరికొచ్చారు. నేనే చికిత్స చేశా. ఇలాంటి ఉదంతాలకు లెక్కే లేదు.
పరిశోధనలో ఉన్నా
నా భార్య సుభద్ర డాక్టరే. మా అబ్బాయి సతీష్‌.. లా చేసి పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ అయ్యాడు. అమ్మాయి ప్రియ, ఇన్‌ఫెక్టివ్‌ డిసీజ్‌లో డాక్టర్‌. కుటుంబ సభ్యులందరూ సేవా మార్గంలోనే ఉన్నారు. అదొక సంతృప్తి.

ప్రస్తుతం నేను క్యాన్సర్‌ పరిశోధనల్లోనే ఉన్నాను. క్యాన్సర్లో ప్రధానం ముందస్తు పరీక్షలు(స్క్రీనింగ్‌). మొబైల్‌ స్క్రీనింగ్‌ విధానాన్ని పరిపుష్టం చేయడానికి కృషి చేస్తున్నాను. క్యాన్సర్‌ రాకుండా ఏం చేయొచ్చు- అనే విషయమై తెలుగువాళ్లకోసం ఓ బుక్‌ రాస్తున్నా. ఇన్నేళ్ల నా క్యాన్సర్‌ వైద్య ప్రస్థానంలో నేను చూడని ఫెలోషిప్పులు, అవార్డులు, రివార్డులు, గౌరవాలు లేవు.
అమెరికాలో రెండు పెద్ద దేవాలయాలు కట్టాను
ఈ విశ్వాన్ని ఏదో శక్తి నడుపుతుందని నమ్ముతాన్నేను. షిర్డీ సాయిబాబా భక్తుణ్ని. అందుకే అమెరికా వెళ్లి వృద్ధిలోకి వచ్చాక న్యూయార్కులో ఒకటి, న్యూజెర్సీలో ఒకటి.. షిర్డీ సాయిబాబా గుళ్లు కట్టించాను. చాలా పెద్ద దేవాలయాలవి. ఎందరెందరో ఏవేవో కష్టాల్లో ఉన్నప్పుడు కనీసం భగవంతుడి దగ్గరకు వెళ్లి చెప్పుకొనే వెసులుబాటు కల్పించాననే తృప్తి లభించింది. అదొక ఆధ్యాత్మిక సంతృప్తి !!!!!!