Business

మహీంద్ర నుండి నూతన థార్-వాణిజ్యం

మహీంద్ర నుండి నూతన థార్-వాణిజ్యం

* మహీంద్ర అండ్ మహీంద్ర ఎట్టకేలకు సరికొత్త థార్‌ను ఆవిష్కరించింది. 74వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తన ప్రతిష్టాత్మ ఎస్‌యూవీ “థార్” ను దేశీయంగా తీసుకొచ్చింది. రెండు, మూడు సంవత్సరాల సుదీర్ఘ పరీక్షల అనంతరం ఐకానిక్ డిజైన్, కొత్త భద్రతా ఫీచర్లతో శనివారం పరిచయం చేసింది. ఫ్రీడమ్ డ్రైవ్‌లో భాగంగా ఈ వాహనాన్ని తీసుకొస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది.బీఎస్ -6 నిబంధనలకు అనుగుణంగా పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో వినియోగదారులకు అందుబాటులోఉండనుందని తెలిపింది. ఫస్ట్-జెన్ మోడల్ కంటే పెద్ద వాహనంగా తీసుకొస్తున్న ఈ కొత్త థార్ 2020 అక్టోబర్ 2న లాంచ్ చేయనుంది. ధర, ప్రీ బుకింగ్ వివరాలు కూడా అక్టోబర్ 2 న ప్రకటిస్తామని ఎంఅండ్ఎం వెల్లడించింది.

* ఎన్‌సీఎల్‌ ఇండస్ట్రీస్‌ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.261.36 కోట్ల ఆదాయాన్ని, రూ.31.95 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. త్రైమాసిక ఈపీఎస్‌ రూ.7.06 ఉంది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదేకాలంలో ఆదాయం రూ.287.89 కోట్లు, నికరలాభం రూ.29 కోట్లు, ఈపీఎస్‌ రూ.6.41 ఉన్నాయి. దీంతో పోల్చితే ఆదాయం తగ్గినప్పటికీ, నికరలాభం స్వల్పంగా పెరిగినట్లు స్పష్టమవుతోంది. ప్రస్తుత మొదటి త్రైమాసికంలో సిమెంటు విభాగంలో ఆదాయాలు స్ధిరంగా ఉండగా, బోర్డ్స్‌ డివిజన్‌ ఆదాయాలు మాత్రం తగ్గాయి. రెడీ మిక్స్‌ కాంక్రీట్‌ ఆదాయాల్లోనూ క్షీణత ఉంది.

* ప్రముఖ వీడియో యాప్‌ టిక్‌టాక్‌కు ట్రంప్‌ కొంత ఊరటనిచ్చారు. అమెరికాలో ఆ కంపెనీ కార్యకలాపాల్ని నిలిపివేయడమో లేదా తమ దేశకంపెనీకి విక్రయించడమో చేసేందుకు ఇచ్చిన గడువును తాజాగా పొడిగించారు. గతంలో ఈ గడువు 45 రోజులు కాగా.. దాన్ని మరో 45 రోజులు పొడిగించారు. ఈ మేరకు మరో కార్యనిర్వాహక ఉత్తర్వులపై ట్రంప్‌ సంతకం చేశారు. దీంతో టిక్‌టాక్‌కు నవంబర్‌ 12 వరకు గడవు లభించింది.

* స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జియో ఆఫర్‌ ప్రకటించింది. జియోఫై 4జీ వైర్‌లెస్‌ హాట్‌స్పాట్‌ కొనుగోలుపై ఐదు నెలల వరకు ఉచిత డేటా, జియో నుంచి జియో కాల్స్‌ ఉచితంగా అందించనున్నట్లు ప్రకటించింది. ఈ ఆఫర్‌ పొందాలంటే రూ.1,999తో జియో ఫైను కొనుగోలు చేయడంతో పాటు ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్లాన్లను కూడా రీఛార్జి చేసుకోవాల్సి ఉంటుందని జియో ఓ ప్రకటనలో పేర్కొంది.

* మనదేశ విదేశీ మారకపు నిల్వలు మరో కొత్త గరిష్ఠానికి చేరాయి. ఆగస్టు 7తో ముగిసిన వారంలో 362.30 కోట్ల డాలర్లు పెరిగి 53819.10 కోట్ల డాలర్లకు చేరాయని ఆర్‌బీఐ వెల్లడించాయి. జులై 31తో ముగిసిన వారంలోనూ మారకపు నిల్వలు 1193.80 కోట్ల డాలర్లు అధికమై 53456.80 కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి. ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం.. ఆగస్టు 7తో ముగిసిన వారంలో మారకపు నిల్వల్లో కీలకమైన విదేశీ కరెన్సీ ఆస్తులు 146.40 కోట్ల డాలర్లు పెరిగి 49229.30 కోట్ల డాలర్లకు చేరాయి. పసిడి నిల్వలు కూడా 216 కోట్ల డాలర్లు అధికమై 3978.50 కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) వద్ద స్పెషల్‌ డ్రాయింగ్‌ రైట్స్‌ 60 లక్షల డాలర్లు పెరిగి 148.10 కోట్ల డాలర్లకు చేరగా.. ఐఎంఎఫ్‌ వద్ద నిల్వల స్థితి 70 లక్షల డాలర్లు తగ్గి 463.20 కోట్ల డాలర్లుగా పరిమితమైంది.

* దేశంలో ద్రవ్యలభ్యతను పెంచేందు కోసం బ్యాంకింగేతర రుణ సంస్థలకు మరిన్ని రుణాలివ్వాలని అందరూ చెబుతూనే ఉన్నాయి. అయితే ఇప్పటికే ఎన్‌బీఎఫ్‌సీలకు బ్యాంకుల నుంచి రుణాలు పెరగడం విశేషం. సెప్టెంబరు 2018 నుంచి జూన్‌ 2020 వరకు గణాంకాలను చూస్తే 190 బేసిస్‌ పాయింట్ల మేర పెరిగి 8.8 శాతానికి ఆ రుణాలు చేరాయని కేర్‌ రేటింగ్‌ ఒక నివేదికలో చెబుతోంది.