WorldWonders

భూమి వేగాన్ని తగ్గించిన చైనా డ్యామ్

భూమి వేగాన్ని తగ్గించిన చైనా డ్యామ్

త్రీగోర్జెస్‌ డ్యామ్.. చైనాకు కలికితురాయి.. మానవులు సృష్టించిన అతిపెద్ద నీటి నిల్వ.. ఇక్కడ యాంగ్జీ నదిలో నీటి నిల్వ దెబ్బకు భూ పరిభ్రమణ వేగం 0.06 మైక్రో సెకన్లు తగ్గిపోయింది. అంతరిక్షం నుంచి సాధారణ కంటికి కనిపించే అతితక్కువ కట్టడాల్లో ఇది కూడా ఒకటి. ఈ డ్యామ్‌లో ఉత్పత్తి అయ్యే జల విద్యుత్తు 22,500 మెగావాట్లు.. అంటే ప్రపంచంలోనే అతిపెద్దవైన మూడు అణువిద్యుత్తు కేంద్రాల ఉత్పత్తికి దాదాపు సమానం. ఇదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే.. మరో వైపు చూస్తే వణుకు పుట్టక మానదు. ఈ డ్యామ్‌ నీటి నిల్వ కారణంగా భూమి అడుగున ఒత్తిడి పెరిగి భూకంపాలు వస్తున్నాయి. ఇక్కడ వరద పెరిగిన సమయంలో దిగువకు విడుదల చేసే నీటి దెబ్బకు లక్షల మంది నిరాశ్రయులవుతున్నారు. భారీగా పంటలు మునిగిపోతున్నాయి. ఒక సారి డ్యామ్‌ బద్దలై లక్షల మంది మరణించిన చరిత్ర చైనాకు ఉంది.. ఈ సారి అదే పునరావృతం అవుతుందేమోనని ఆందోళన పడుతోంది.