గన్నవరం వైసీపీలో ముసలం ముదిరి పాకాన పడింది. నియోజకవర్గంలో తానే రాజు తానే మంత్రి అని ఎమ్మెల్యే వంశీ అంటుంటే.. వంశీని పార్టీలో ఒంటరిని చేయడమే లక్ష్యంగా దుట్టా వర్గం పావులు కదుపుతోంది. ఇంతకాలం దూరంపెట్టిన యార్లగడ్డ వర్గాన్ని దగ్గర చేసుకుంటుండటంతో రాజకీయ చిత్రం రసవత్తరంగా మారింది.
***దుట్టా రామచంద్రరావుతో తనకు విభేదాలు లేవని, తానే ఎమ్మెల్యే, పార్టీ ఇన్‌చార్జినని శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీమోహన్ చేసిన వ్యాఖ్యలు గన్నవరంలో కలకలం రేపాయి. వీటిపై వైసీపీ సీనియర్ నాయకుడు దుట్టా రామచంద్రరావు వర్గం మండిపడుతోంది. వంశీ కారణంగా అసలైన వైసీపీ కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొద్దిరోజుల క్రితం వంశీ.. దుట్టా వద్దకు వెళ్లి తాను నిర్వహిస్తున్న గ్రామసభలకు హాజరుకావాలని ఆహ్వానించారు. ఆ ఆహ్వానాన్ని తిరస్కరించిన దుట్టా.. తాను సీఎం జగన్ వద్ద తేల్చుకున్నాకే మాట్లాడతానన్నారు. మరోవైపు.. ఇప్పటివరకు యార్లగడ్డ వర్గాన్ని దూరంపెట్టిన దుట్టా వర్గీయులు ఇప్పుడు దగ్గర చేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. రెండు వర్గాలు ఏకమైతే వంశీని ఒంటరిని చేయవచ్చన్నది దుట్టా వ్యూహంగా ఉంది.
*ఒకే వీధిలో దుట్టా.. వంశీ..!
దుట్టా, వంశీ వర్గాల ఆధిపత్య పోరు నేపథ్యంలో శుక్రవారం ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. పశుసంవర్ధక శాఖ మంత్రి అప్పలరాజు శుక్రవారం దుట్టా రామచంద్ర రావును ఆయన ఇంట్లో కలిశారు. దుట్టా నివాసం ఉండే వీధిలోనే వైసీపీ నాయకులు దయాల విజయనాయుడు ఇంటి వద్ద వంశీ కార్యకర్తలను కలుసుకునే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ రెండూ ఒకే సమయంలో జరిగాయి. దుట్టా ఇంటికి అనుచరులు అతి కొద్దిమందే హాజరయ్యారు. విజయ నాయుడు ఇంటి వద్ద వంశీ కోసం వందల సంఖ్యలో కార్యకర్తలు వేచి ఉన్నారు. నిన్నటివరకు దుట్టాను అంటి పెట్టుకున్న వారూ విజయ నాయుడు ఇంటి వద్ద వంశీ కోసం ఎదురు చూడడం గమనార్హం. దుట్టా ఇంటి నుంచి మంత్రి వెళ్తున్న సమయంలో వంశీ కారుకు అడ్డుపడ్డారు. వంశీ కారు దిగి మంత్రికి అభి వాదం చేశారు. మంత్రి కూడా వంశీని పలక రించారు. ఈ పరిణామం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.
*అల్లుడికి అందలమే టార్గెట్
గన్నవరం వైసీపీలో తన అల్లుడు శివభరత్‌రెడ్డిని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దాలన్నది దుట్టా ఆలోచన. ఇది జరగాలంటే వంశీ బలహీనమవ్వాలి. దీనికి అనుగుణంగా దుట్టా వర్గం పావులు కదుపుతోంది. అందులో భాగంగానే వైసీపీ పెద్దలను దుట్టా, ఆయన అల్లుడు శివభరత్‌రెడ్డి తరచూ కలుస్తున్నారు. మరోవైపు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో వంశీ వర్గానికి సమాంతరంగా తమదైన మరో వర్గాన్ని పెంచుతున్నారు.
గన్నవరం వైకాపాలో ముసలం
Related tags :