* ఉత్తర ప్రదేశ్ లోని షామ్లి జిల్లా కండ్ల పట్టణంలోని ఓ జూనియర్ కళాశాలలో ఓ వివాహిత పనిచేస్తున్నది. అదే కళాశాలలో పనిచేసే ఓ ఇద్దరు ఉద్యోగులు ఆమె పై కన్నేశారు. ఓరోజు వర్క్ ఎక్కువగా ఉండటంతో రాత్రి వరకు ఆఫీస్ లోనే ఉండి పని చేసుకుంటుండగా, ఇద్దరు సహోద్యోగులు ఆమెపై అత్యాచారం చేశారు. ఆ తతంగాన్ని వీడియో తీశారు. తరువాత బ్లాక్ మెయిల్ చేస్తూ లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఆ వేధింపులు తట్టుకోలేక సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇద్దరు ఉద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.
* తెనాలి మండలం సంగం జాగర్లమూడిలో విషాదం చోటుచేసుకుంది. ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు చెలరేగి ఐదు పూరిళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం జరిగింది. పండగ పూట కట్టుబట్టలతో ఐదు కుటుంబాలు రోడ్డునపడ్డాయి. రోడ్డుపై భారీగా బురద ఉండడంతో సకాలంలో ఫైర్ సిబ్బంది రాలేకపోయింది. అందుబాటులో ఉన్న నీటితో స్థానికులు, ఫైర్ సిబ్బంది మంటలార్పారు.
* ఎల్బీ స్టేడియంలో ట్రోఫీలను చోరీచేసిన దొంగను సైఫాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. అదనపు ఇన్స్పెక్టర్(డీఐ) రాజు నాయక్ తెలిపిన వివరాల ప్రకారం కర్ణాటకలోని బెల్గాం జిల్లాకు చెందిన శివ సంజీవ షిండే(30) నిలోఫర్ ఆస్పత్రి సమీపంలో పాదబాటపై ఉంటాడు. ఇటీవల ఎల్బీ స్టేడియంలోని ఫుట్‌బాల్ అసోసియేషన్ కార్యాలయం తలుపులు నెట్టి అందులో ఉన్న పలు ట్రోఫీలను చోరీచేశాడు. వాటిని మాంగార్ బస్తీలో తనకు తెలిసిన ఓ వృద్ధుడి ఇంట్లో ఉంచాడు. అసోసియేషన్ ప్రతినిధుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎట్టకేలకు దొంగను పట్టుకున్నారు. చోరీకి గురైన వాటిలో వెండి ట్రోఫీతో పాటు ఇత్తడి ట్రోఫీలు 15 ఉన్నట్లు ప్రతినిధులు పేర్కొన్నారు. అయితే అక్కడ తెలుపు రంగులో ఉన్నవేవీ దొంగిలించలేదని తేలింది. అతని వద్ద ఉన్న 11 ట్రోఫీలు స్వాధీనం చేసుకున్నారు.
* విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి పంతంగి టోల్ ప్లాజా వద్ద డీఆర్ఐ అధికారులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా నుంచి ఉత్తర్‌ప్రదేశ్ తరలిస్తుండగా పంతంగి వద్ద డీఆర్ఐ అధికారులు వాహనాన్ని తనిఖీ చేశారు. ఈ క్రమంలో అందులో పెద్ద ఎత్తున గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈ సోదాల్లో 3.56 కోట్ల విలువైన 1,427 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఒకరిని అరెస్ట్ చేశారు.
* దేశ రాజధాని దిల్లీలో భారీ పేలుళ్ల కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఐసిస్ ఉగ్రవాది అబూ యూసఫ్‌ను గత రెండురోజుల క్రితం దిల్లీలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఉత్తర్‌ప్రదేశ్ బలరాంపూర్‌లోని అతని ఇంట్లో భారీగా పేలుడు పదార్థాలు ఉండొచ్చిని పోలీసులు అనుమానించారు. దీంతో దిల్లీ పోలీసుల ప్రత్యేక బృందం ఉత్తర్‌ప్రదేశ్‌లోని అతని గ్రామాన్ని చుట్టుముట్టీ భారీ స్థాయిలో సోదాలు నిర్వహించింది. ఆ సమయంలో యూసఫ్ ఇంట్లోనే భారీ పేలుడు పదార్థాలు ఉన్నట్లు గుర్తించారు. మానవ బాంబులకు ఉపయోగించే బెల్టుతోపాటు ప్రెషర్ కుక్కర్, 15కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా ఓ తుపాకీ, ఐఎస్ఐఎస్ జెండా, ఉగ్రవాద సంస్థలతో సంబంధాలకు సంబంధించిన డాకుమెంట్లు కూడా లభ్యమైనట్లు పోలీసులు వెల్లడించారు.