DailyDose

ఏపీ-తెలంగాణా మధ్య బస్సు సర్వీసులు-తాజావార్తలు

ఏపీ-తెలంగాణా మధ్య బస్సు సర్వీసులు-తాజావార్తలు

* కరోనా కారణంగా నిలిచిపోయిన మెట్రో రైలు సేవలు త్వరలో ప్రారంభయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అన్‌లాక్‌ 4.0 ప్రక్రియలో భాగంగా వీటిని ప్రారంభించేందుకు కేంద్రం సుముఖంగా ఉన్నట్లు హోంశాఖ వర్గాలు తెలిపాయి. ఆగస్టు 31తో అన్‌లాక్‌ 3.0 గడువు ముగియనున్న నేపథ్యంలో 4.0కు సంబంధించి కొత్త నియమ నిబంధనలపై ఇప్పటికే ఆ శాఖ కసరత్తు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా సెప్టెంబర్‌ 1 నుంచి మెట్రో సేవలను అనుమతించాలన్న యోచనలో ఉన్నట్లు సమాచారం. మరోవైపు వీటితో పాటు మరికొన్ని ప్రజా రవాణా, ఇతర సేవలకు అనుమతించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

* కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వ మార్పుపై పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌ సోమవారం లేఖ రాశారు. పార్టీ అధ్యక్షురాలిగా సోనియాగాంధీనే ఉండాలని లేఖలో కోరారు. ఎన్నో క్లిష్ట పరిస్థితుల నుంచి పార్టీ గట్టెక్కడానికి సోనియా చేసిన కృషి మరువలేమన్నారు. సవాళ్లను ఎదుర్కొని నిలిచిన వ్యక్తిత్వం గాంధీ కుటుంబానిదని చరిత్ర చెబుతోందని అన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడి ఎన్నో సందర్భాల్లో దేశ ప్రతిష్ఠను పెంచిన ఠీవి సోనియా గాంధీదని ఆయన కొనియాడారు.

* పార్టీ‌ అధ్యక్ష పదవిపై జరుగుతున్న కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ మీటింగ్‌లో వాడీవేడీ చర్చ జరుగుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్‌ పార్టీని ప్రక్షాళన చేయాలని కోరుతూ 23మంది సీనియర్లు సోనియాగాంధీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. లేఖను ప్రస్తావిస్తూ రాహుల్‌ గాంధీ సీనియర్లపై మండిపడ్డారు. ‘భాజపాతో కుమ్మక్కై సోనియాకు లేఖ రాశారా?’ అని ఒక దశలో రాహుల్‌ గాంధీ సీనియర్లను నిలదీశారు. దీనిపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాంనబీ అజాద్ స్పందించారు. భాజపాతో జతకలిపి సోనియాకు లేఖ రాశామని నిరూపిస్తే తాను పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన ప్రకటించారు.

* కేంద్రం నుంచి తెలంగాణ పురపాలక శాఖకు రావాల్సిన బకాయిలు రూ.2,537.82 కోట్లు విడుదల చేయాలని కేంద్ర పట్టణాభివృద్ధి, విమానయాన శాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌ పూరీని మంత్రి కేటీఆర్‌ కోరారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌తో కలిసి దిల్లీలో కేంద్రమంత్రితో కేటీఆర్‌ సమావేశమయ్యారు. వరంగల్‌ మామునూరు ఎయిర్‌పోర్టును ఉడాన్‌ పథకంలో చేర్చాలని కోరినట్లు కేటీఆర్‌ తెలిపారు. 10 రోజుల్లో సర్వే కోసం కేంద్ర బృందాన్ని పంపుతామని కేంద్రమంత్రి తెలిపారని.. త్వరలోనే వరంగల్‌ ప్రజలకు విమాన సేవలు అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నామన్నారు.

* లద్దాఖ్‌ ప్రాంతంలో చైనా ఆర్మీ దురాక్రమణను తిప్పికొట్టడానికి సైనిక చర్యకు కూడా సిద్ధంగా ఉన్నామని త్రివిధ దళాధిపతి బిపిన్‌ రావత్‌ స్పష్టం చేశారు. సరిహద్దు సమస్యను పరిష్కరించడానికి భారత్‌, చైనా మధ్య చర్చలు విఫలమైనప్పుడు మాత్రమే ఈ అవకాశాన్ని పరిశీలిస్తామన్నారు. ఆదివారం ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ రావత్ ఈ వ్యాఖ్యలు చేశారు.

* ఇరాన్‌ అణుకేంద్రంలో మరో కుట్రకు తెరలేచింది. జులై మొదట్లో ఇరాన్‌లోని నాన్తెజ్‌ యురేనియం శుద్ధి కేంద్రంలో భారీ పేలుడు జరిగి సెంట్రిఫ్యూజిలు దెబ్బతిన్నాయి. అనంతరం రక్షణ శాఖకు చెందిన కీలక భవనాల్లో కూడా పేలుళ్లు చోటు చేసుకొన్నాయి. అప్పట్లో ఈ పేలుళ్లు ఎలా చోటు చేసుకొన్నాయో కూడా ఇరాన్‌కు అంతుచిక్కలేదు. ఒక దశలో ఇజ్రాయిల్‌కు చెందిన ఎఫ్‌35 యుద్ధవిమానాలు దాడులు చేశాయని అనుమానించింది. ఈ పేలుళ్లపై దర్యాప్తు చేసిన ఇరాన్‌ అటామిక్‌ ఎనర్జీ ఆర్గనైజేషన్‌ చివరికి ఇది వెన్నుపోటుగా తేల్చాయి.

* ఉత్తర కొరియా నియంత కిమ్‌ జోంగ్‌ ఉన్ అపస్మారక స్థితిలో ఉండటంతో.. ఆయన సోదరి కిమ్‌ యో జోంగ్‌ వాస్తవ పాలకురాలిగా పగ్గాలు చేపట్టినట్టు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత నేత కిమ్‌ ఆరోగ్యం నానాటికీ దిగజారుతుందడంతో.. జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాల్లో నిర్ణయాధికారం ఆయన సోదరి చేతికొచ్చినట్లు సమాచారం.

* తెలంగాణ -ఆంధ్రప్రదేశ్ మధ్య ఆర్టీసీ బస్సుల పునరుద్ధరణకు అధికారులు చర్యలు చేపట్టారు. బస్సులు నడపడంపై ఇరు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు హైదరాబాద్‌లోని బస్‌భవన్‌లో చర్చలు జరుపుతున్నారు. విజయవాడ నుంచి ఏపీఎస్ఆర్టీసీ ఉన్నతాధికారులు బస్‌భవన్‌కు చేరుకుని తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎండీ సహా ఉన్నతాధికారులతో చర్చలు జరపుతున్నారు. అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు నడిపేందుకు పరస్పరం ఒప్పందం చేసుకునేందుకు ఇప్పటికే ఇరు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు అంగీకరించారు.

* తాజాగా చేసిన పరీక్షల్లో ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి నెగటివ్‌ వచ్చిందంటూ పలు సామాజిక మాధ్యమాల్లో వార్తలు రావడంపై ఆయన తనయుడు ఎస్పీ చరణ్ స్పందించారు. ‘‘నాన్నగారికి కొవిడ్‌ నెగటివ్‌ వచ్చినట్లు ఉదయం నుంచి వార్తలు వస్తున్నాయి. అయితే, అందరూ ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. కరోనా నెగటివా? పాజిటివా? అన్న విషయం పక్కన పెడితే, ఆయన ఆరోగ్యం విషయంలో ఎలాంటి మార్పూ లేదు. దయచేసి అసత్య ప్రచారాలను ఆపండి. వైద్యులతో చర్చించిన తర్వాత ఈ రోజు సాయంత్రం నేనే అప్‌డేట్‌ ఇస్తా’’ అని పేర్కొన్నారు.

* నాయకత్వం అంశంపై కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశంలో వాడీవేడిగా చర్చ జరుగుతోంది. వర్చువల్ ద్వారా నిర్వహించిన సమావేశంలో పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలి బాధ్యతల నుంచి తప్పుకొనే అవకాశం తనకు కల్పించాలని సీడబ్ల్యూసీని సోనియాగాంధీ కోరినట్టు తెలుస్తోంది. అలాగే, కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని నేతల ముందు ప్రతిపాదన ఉంచగా.. ఆ పదవిలో సోనియానే కొనసాగాలని నేతలు కోరారు. అయితే, అందుకు ఆమె తిరస్కరించినట్టు తెలుస్తోంది. దీంతో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకొనే వరకైనా కొనసాగాలని మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, పార్టీ సీనియర్‌ నేత ఏకే ఆంటోనీ సోనియాను కోరినట్టు సమాచారం.