DailyDose

ఇండోనేషియాలో మరో భయంకర వైరస్-TNI కరోనా బులెటిన్

ఇండోనేషియాలో మరో భయంకర వైరస్-TNI కరోనా బులెటిన్

* తెలంగాణ రాష్ట్రంలో శనివారం 61,148 నమూనాలు పరీక్షించగా 2,924 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1,23,090కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 10 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 818 కి చేరింది. నిన్న కరోనా బారి నుంచి 1,638 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు డిశ్ఛార్జి అయిన వారి సంఖ్య 90,988కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 31,284 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు తెలంగాణలో 13,27,791 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

* ఆంధ్రప్రదేశ్‌లో మరో ఎమ్మెల్యేకి కరోన సోకింది. తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి కరోనా బారిన పడ్డారు. తాజాగా ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అయితే కరోనా లక్షణాలు పెద్దగా లేకపోవడంతో ప్రస్తుతానికి ఆయన హోం ఐసోలేషన్ లోనే ఉన్నారు. వైద్యుల సలహా మేరకు చికిత్స పొందుతున్నారు. తనకు కరోనా స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జగ్గిరెడ్డి తెలిపారు. నెగెటివ్‌ వచ్చే వరకు తనను ఎవరూ సంప్రదించవద్దని విజ్ఞప్తి చేశారు. ఇక గత వారం రోజులుగా తనతో సన్నిహితంగా ఉన్న నేతలు, కార్యకర్తలు కూడా హోమ్ క్వారంటైన్‌లో ఉండాలని ఎమ్మెల్యే సూచించారు.

* దేశంలో కొవిడ్​ మహమ్మారి పంజా విసురుతోంది. తాజాగా 78,761 మందికి కరోనా సోకినట్లు తేలింది. వైరస్​ కారణంగా మరో 948 మంది ప్రాణాలు కోల్పోయారు.

* అత్యంత ఎక్కువ తీవ్రత కలిగిన పరివర్తనం చెందిన కరోనా వైరస్‌ తాజాగా ఇండోనేషియాలోనూ బయటపడింది. ప్రస్తుతం ఉన్న వైరస్‌తో పోలిస్తే 10రెట్ల తీవ్రత కలిగిన ‘డీ614జీ’ వైరస్‌ ఈ మధ్య మలేసియాలోనూ బయటపడ్డ విషయం తెలిసిందే. ఇప్పుడు దీనిని ఇండోనేషియాలో గుర్తించినట్లు జకర్తాలోని ఐజక్‌మాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ మాలిక్యూలర్‌ బయోలజీ వెల్లడించింది. అయితే, ఈ ప్రాంతంలో గత కొన్నిరోజులుగా కేసుల సంఖ్య పెరగడానికి ఈ వైరస్‌ కారణమా? అని తెలుసుకునేందుకు మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉందని సంస్థ డిప్యూటీ డైరక్టర్‌ హెరవాతీ సుడోయో మీడియాకు వెల్లడించారు.

* ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతూనే ఉంది. వరుసగా ఐదో రోజూ 10వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌ విడుదల చేసింది. ఒక్కరోజు వ్యవధిలో 63,077 నమూనాలను పరీక్షించగా 10,603 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. 24 గంటల వ్యవధిలో 88 మంది మృతిచెందారు. నెల్లూరు జిల్లాలో 14 మంది, చిత్తూరు 12, కడప 9, అనంతపురం 7, పశ్చిమగోదావరి 7, తూర్పుగోదావరి 6, శ్రీకాకుళం 6, కృష్ణా 5, కర్నూలు 5, విజయనగరం 5, గుంటూరు 4, ప్రకాశం 4, విశాఖపట్నం జిల్లాలో నలుగురు మరణించారు. తాజా మరణాలతో మృతిచెందిన వారి సంఖ్య 3,884కి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 36,66,422 నమూనాలను పరీక్షించారు. తాజా కేసులతో రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 4,24,767కి చేరింది. వీటిలో 99,129 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మరోవైపు అత్యధిక కేసులు తూర్పుగోదావరిలోనే నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో ఆ జిల్లాలో 1090 మందికి కరోనా సోకగా.. అత్యల్పంగా కృష్ణా జిల్లాలో 383 మంది వైరస్‌ బారిన పడ్డారు.