Business

ఒక కొబ్బరిచెట్టు వలన ఎన్ని ప్రయోజనాలో!

Here are the endless list of things that a coconut tree gives us coconut benefits coconut tree products world coconut day coconut for health coconut food benefits

కొట్టూ‌.. కొట్టూ.. కొబ్బ‌రిబొండాం
అంబుకు చెంబు, చెంబులో చారెడు నీళ్లు ఏమిటది…? అదేనండి కొబ్బరికాయ..! ప్రకృతిలో సహజంగా లభించే శీతల పానీయం కొబ్బరినీళ్ల తియ్యదనమే వేరు. లే.. లేతకొబ్బరి కమ్మనైన రుచి మరింత తినాలనిపిస్తుంటుంది. కొబ్బరి కూర, కొబ్బరి చెట్నీ, కొబ్బరి స్వీటు, కొబ్బరి బూరెలు, కొబ్బరి రైస్‌, కొబ్బరి చాక్లెట్‌… ఇలా ఒకటేంటండి. అనేక రకాల కొబ్బరి రుచులను ప్రతి రోజూ ఆస్వాదిస్తూనే ఉంటాం. ఇంకా మరెన్నో ప్రయోజనాలు, కొబ్బరి చెట్టులో కాదేది అనర్హం అన్నట్లుగా ప్రతి భాగమూ ఆకులు, పూలు, కాయలు, పీచు, చిప్పలు, కాండం ఇలా అన్నీ వాడుకలో ఉన్నవే. అందుకే దీనిని కల్పవృక్షం అంటారు. కోట్లాదిమంది జనం కొబ్బరిపంటనే జీవనాధారంగా చేసుకుని బతుకుతున్నారు. ఆ సంగతులు తెలుసుకుందామా..?
***కోకోనట్‌ అనే పదం 16వ శతాబ్దంలో పోర్చుగీస్‌, స్పెయిన్‌ పదమైన ‘కోకో’ అనే పదం నుంచి వచ్చింది. దీనికి తల, పుర్రె అని అర్థం వస్తుంది. మొదట ఇవి ఆగేయాసిలోని ఇండోనేషియా దీవులల్లో, భారత దేశ దక్షిణ భాగాన ఉద్భవించాయి. అరబ్బులు, పర్షియన్‌ వ్యాపారులు వీటిని తూర్పు ఆఫ్రికాలోని మడగాస్కర్‌కు తీసుకెళ్లారు. పోర్చుగీస్‌ వారు అట్లాంటిక్‌ మహాసముద్రంలో ప్రయాణం చేస్తూ వీటిని పశ్చిమ ఆఫ్రికా, దక్షిణ అమెరికా తూర్పు తీరంలోని బ్రెజిల్‌కు వ్యాపింపజేశారు. ఇలా కొబ్బరి ప్రపంచమంతా వ్యాపించగా ప్రస్తుతం 90 దేశాల్లో దీనిని పెంచుతున్నారు. కొబ్బరికాయ సాంకేతిక నామం ‘కోకోస్‌ న్యుసిఫేరా’ అంటారు. అంటే.. పొత్తుతో కూడుకున్నదని అర్థం. ప్రపంచంలో మూడో వంతు జనాభా వాళ్ల ఆహారంలో కొబ్బరిని వాడుతున్నారు. వీటి పెంపకానికి ఉష్ణమండల ప్రాంతాలు అనువైనవి. అంతర్జాతీయంగా కొబ్బరికాయల ఉత్పత్తిలో 72 శాతం ఇండోనేషియా, భారత్‌ దేశాలు పండిస్తున్నాయి.
**కొబ్బరిచెట్లు 30 మీటర్ల (98 అడుగులు) ఎత్తు పెరుగుతాయి. వీటి ఆకులు 4-6 మీటర్లు పొడవు ఉంటాయి. ఈ చెట్లకు కాయలు కాయడానికి ఆరు నుంచి 10 సంవత్సరాల కాలం పడుతుంది. 15 నుంచి 20 సంవత్సరాల మధ్య అత్యధిక దిగుబడిని అందుకుంటుంది. ఇవి సుమారు 100 సంవత్సరాలపాటు జీవించి వుంటాయి. సారవంతం కాని నేలలో కూడా ఇవి పెరుగుతాయి. మనదేశంలో కేరళ, తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌, గోవా, మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌, గుజరాత్‌, లక్షద్వీప్‌, అండమాన్‌, నికోబార్‌ వంటి ప్రదేశాల్లో ఎక్కువగా పండిస్తున్నారు.
**ఎన్నో పోషక విలువలు
ప్రపంచవ్యాప్తంగా ఏటా 59 లక్షల టన్నులు కొబ్బరి కాయలను ఉత్పత్తి చేస్తున్నారు. 2,50,000 టన్నుల కొబ్బరి పీచును ఉత్పత్తి చేస్తున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలు ఈ పరిశ్రమ ద్వారా లబ్ధి పొందుతున్నాయి. అంతర్జాతీయంగా కొబ్బరిపీచు ఉత్పత్తిలో 90 శాతం శ్రీలంక, భారత్‌ చేస్తున్నాయి. కేరళ రాష్ట్రం అధికంగా ఉత్పత్తి చేస్తోంది.
కొబ్బరికాయలో 49 శాతం లారిక్‌ యాసిడ్‌ ఉంటుంది. కొబ్బరినూనెలో వుండే ఫ్యాటీ యాసిడ్స్‌, వైరల్‌, ఫంగల్‌, బ్యాక్టీరియల్‌ వంటి రుగ్మతల తగ్గుదలకు సహాయపడతాయి. కొబ్బరి పోషకాలతో కూడిన ఆహారాన్ని, పానీయాన్ని అందించటంలో పాటు ఆరోగ్యాన్ని కలిగిస్తుంది.
**పాలూ రుచికరమే..
పచ్చికొబ్బరిలో పోషక విలువలు అధికంగా ఉంటాయి. కొబ్బరి నీళ్లు, పాలు మంచి ఔషధాలుగా పనిచేస్తాయి. దీనిలో విటమిన్‌ ఎ, బి, సి, రైబోఫ్లెవిన్‌, ఐరన్‌, కాల్షియం, ఫాస్పరస్‌, పిండిపదార్థాలు, కొవ్వు, ప్రోటీన్లు సమృద్ధిగా లభిస్తాయి. గొంతు మంట, నొప్పిగా ఉన్నప్పుడు కొబ్బరిపాలు తాగితే ఉపశమనం లభిస్తుంది. కొబ్బరి పాలతో తయారు చేసిన పదార్ధాలను పిల్లలకు ఇవ్వడం ద్వారా మంచి పోషకాలున్న ఆహారాన్ని వారికి ఇచ్చిన సంతృప్తి లభిస్తుంది.
**జ్యూసూ మంచిదే…
వేసవిలో ఎండతాపం నుంచి విడుదల కలిగించే పానీయం కొబ్బరినీళ్లు. కొబ్బరికాయలోని ద్రవపదార్ధాన్ని కొబ్బరికాయ జ్యూస్‌ అంటారు. శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. డీహైడ్రేషన్‌ బారిన పడకుండా చేస్తుంది. దీనిలోని కార్బొహైడ్రేట్‌లు చురుకుదనాన్ని కలిగిస్తుంది. అందుకనే ఆటలు ఆడేవారికి ఇదీ సత్వర శక్తి అందిస్తుంది. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లులు ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఒక కప్పు కొబ్బరి నీటిలో 45 కేలరీలు ఉంటాయి. దీనిలోని ఎలక్ట్రోలైట్స్‌ అయిన సోడియం, పొటాషియం వంటి ఖనిజాలు అధికంగా ఉంటాయి.
**పర్యావరణహిత పీచు..
సహజసిద్ధంగా ప్రకృతిలో లభించే ముడిపదార్థం కొబ్బరిపీచు. పచ్చికొబ్బరికాయలోని పీచు తెల్లని రంగులో, పండిన కాయలోని పీచును గోధుమ రంగులో ఉంటుంది. కొబ్బరి పీచుతో అనేక రకాల ఉపయోగాలున్నాయి. దీనితో తాళ్లను, చేపలు పట్టే వలలు, డోర్‌-ఫ్లోర్‌ మ్యాట్‌లు, బ్రష్‌లు, పరుపులు, బుట్టలు, చెప్పులు, బొమ్మలు, ప్లైవుడ్‌ తదితర వస్తువులను తయారు చేస్తారు. కొబ్బరి పీచుతో తయారు చేసిన తాళ్లను పూర్వం పడవల్లో నావికులు కేబుల్స్‌గా వినియోగించేవారు. పల్లెటూళ్లలోని మంచాలకు నవ్వారుగా ఉపయోగించే నులకతాడును కొబ్బరి పీచుతోనే వినియోగిస్తారు.కొబ్బరి ఆకులతో చీపురులు, బుట్టలు, బొమ్మలు, చాపలు, డెకరేషన్‌ ఐటమ్స్‌ తదితర వస్తువులను తయారుచేస్తారు. పెళ్లిళ్లలో అధిక ఖర్చు చేసి మండపాలను తయారు చేసే కంటే కొబ్బరి ఆకులతో రకరకాల డెకరేటివ్‌ ఐటమ్స్‌ అందంగా తయారు చేసుకోవచ్చు. కేరళలో ఎక్కువగా వీటినే వాడతారు. ఇళ్ల పైకప్పుకు కూడా వీటిని వాడతారు. ఇంటిముందు పందిరి వేసి దానిలో సేదతీరుతారు. కాండాన్ని ఇళ్లు కట్టుకునేందుకు వినియోగిస్తారు. కొబ్బరి పువ్వులలో అనేక రకాల ఔషధ గుణాలున్నాయి. కొబ్బరి కాయ ముదిరిపోయాక లోపల పువ్వు వస్తుంది. వీటిని బాలింతలకు కూడా పెడతారు.
**వంటలకూ కొబ్బరి నూనె…
కేశాల సంరక్షణకు కొబ్బరి నూనెనే వాడతారు. దీనిని తలకు రాసుకోవడం వల్ల ఒత్తిడిని తగ్గిస్తుంది. మెదడు చురుకుగా పనిచేసేందుకు తోడ్పడుతుంది. కేశాల పెరుగుదలకు తోడ్పడుతుంది. కేరళలో వంటల తయారీకి కొబ్బరి నూనెనే వాడతారు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేయడంతో పాటు చర్మకాంతిని పెంచుతుంది.
**కోకోనట్‌ డే…
మీకు తెలుసా ? కొబ్బరికాయకు కూడా ఒక రోజు ఉందని. అదే అంతర్జాతీయ కొబ్బరికాయ దినోత్సవం (కోకోనట్‌ డే) ప్రతీ సంవత్సరం సెప్టెంబరు 2న నిర్వహిస్తారు. 2009 నుంచి దీన్ని జరుపుతున్నారు. కొబ్బరికాయలను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు అనేక వ్యాధులను తగ్గించుకోవచ్చని ప్రజల్లో అవగాహన కలిగించేందుకు ఈ ప్రత్యేక రోజును నిర్వహిస్తున్నారు. ఇండోనేషియా జకార్తలోని ఆసియా పసిఫిక్‌ కొబ్బరికాయ కమ్యునిటీ (ఎపిసిసి) భారత్‌ ప్రోత్సాహంతో దీనిని మొదలు పెట్టింది. ఎపిసిసిలో 18 దేశాలు సభ్యత్వం కలిగి ఉండగా భారత్‌ కూడా ఒక సభ్య దేశంగా కొనసాగుతోంది. ఆసియా పసిఫిక్‌ ప్రాంతాల్లో కొబ్బరిచెట్ల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు వివిధ కార్యక్రమాలను నిర్వహించేందుకు ఈ దేశాలు కృషిచేస్తాయి. కోకోనట్‌ డే సందర్భంగా వివిధ రకాల పోటీలను నిర్వహిస్తారు. కొబ్బరికాయలను పగలగొట్టడం, కొత్త కొత్త వంటకాలు, కొబ్బరిబోండాన్ని దూరంగా విసరడం వంటి పోటీలను నిర్వహిస్తారు. 2018లో ‘కొబ్బరి సంపద ఆరోగ్యానికి మంచిది’ అనే ధీమ్‌తో దీనిని నిర్వహించారు.
**మాల్దీవుల జాతీయ ఫలం
భారత్‌కు దక్షిణాన హిందూ మహాసముద్రంలో ఉన్న మాల్దీవుల జాతీయ ఫలం కొబ్బరికాయ. ఈ దేశ జాతీయ చిహ్నంలో కూడా కొబ్బరిచెట్లు ఉంటాయి. ఇక్కడి వారు అనేక రకాలుగా వీటిని వాడతారు. ఇళ ్లపైకప్పుకు ఈ కొబ్బరి ఆకులను ఉపయోగిస్తారు.కొబ్బరి చెట్లు కేరళ రాష్ట్రంలో మన రాష్ట్రంలోని కోనసీమలో అధికంగా పెరుగుతాయి. భారతదేశపు సాంస్కృతిక జీవనంలో కల్పవృక్షానికి ఒక ముఖ్యమైన స్థానం ఉంది. ఇది మనకు కావలసిన ఆహారాన్నీ, పానీయాన్నీ, తలదాచుకునే చోటునీ, ఇతర నిత్యావసర వస్తువులనూ ప్రసాదిస్తోంది. ఇంత ఉపయోగపడే ఈ చెట్లను గురించి ముందు తరాల వారికి తెలియజేసి వాటిని రక్షణకై మనవంతు కృషి చేద్దాం.