ప్రతిఏటా వర్షాలు సకాలంలో, సమృద్ధిగా పడాలని రైతులు పూజలు, ప్రార్థనలూ చేయడం సర్వసాధారణంగా జరిగేదే! ఇక వర్షాలు ఏ మేరకు పడతాయో తెలుసుకోవడానికి వాతావరణశాఖ సూచనల మీద ఆధారపడుతూ ఉంటారు. కానీ ఉత్తర ప్రదేశ్‌లోని ఒక గ్రామం వారికి ఆ అవసరం లేదు. ఆ ఊరిలో కొలువైన జగన్నాథుడే ‘వర్షసూచన’ ఇస్తాడని వారు భావిస్తారు. ఆ జగన్నాథుడి పురాతన ఆలయం కాన్పూర్ సమీపంలోని బిత్రగావ్ బెహతా గ్రామంలో ఉంది. దాన్ని ‘వర్షాకాలం గుడి’, ‘వాన గుడి’ అని పిలుస్తారు. వర్షాకాలం రావడానికి సుమారు పది రోజుల ముందు ఆలయం పైకప్పు నుంచి నీటి చుక్కలు పడడం మొదవుతుంది. ఆ నీటి చుక్కలు పెద్దవిగా ఉంటే వర్షాలు పుష్కలంగా పడతాయనీ, చిన్నవైతే వర్షపాతం తక్కువగా ఉంటుందనీ, దుర్భిక్ష పరిస్థితులు నెలకొంటాయనీ స్థానికుల విశ్వాసం. వర్షాలు ప్రారంభమయ్యాక పైకప్పు నుంచి నీటి చుక్కలు రాలడం ఆగిపోవడం మరో విశేషం. ఇది ‘జగన్నాథుడు చెప్పే జోస్యం’ అని చుట్టుపక్కల గ్రామాల వారు నమ్ముతారు. ఈ ‘సూచనల’ ప్రకారం వ్యవసాయ కార్యకలాపాలపై ప్రణాళిక వేసుకుంటారు.బౌద్ధ స్థూపంలా ఉండే ఈ ఆలయ నిర్మాణ శైలే దీనికి కారణం కావచ్చని శాస్త్రవేత్తలు కొందరు అభిప్రాయపడుతున్నా అసలు కారణం ఏమిటన్నది అంతుపట్టని రహస్యమే! క్రీస్తుశకం 11-13 శతాబ్దాల మధ్య ఈ ఆలయ నిర్మాణం జరిగిందన్నది చరిత్రకారుల అంచనా. బలరాముడు, సుభద్రలతో కలిసి ఉన్న జగన్నాథుడి నల్లరాతి విగ్రహాలు ఈ ఆలయంలో కొలువుతీరాయి. ఒడిశా రాష్ట్రంలోని పూరి ఆలయం మాదిరిగానే ఈ ఆలయం పైన కూడా పవిత్రమైన చక్రం ఉంటుంది. కాషాయ ధ్వజం రెపరెపలాడుతూ ఉంటుంది. వర్షాలు బాగా పడేలా అనుగ్రహించాలని కోరుతూ వానాకాలం రావడానికి ముందు ఈ జగన్నాథుడికి రైతులు పూజలు చేయడం ఆనవాయితీ.
వర్షం ఎప్పుడు పడుతుందో చెప్పే జగన్నాథుడు
Related tags :