Health

నాడీ సమస్యల వలన ఆస్ట్రాజెనెకా టీకా నిలుపుదల

నాడీ సమస్యల వలన ఆస్ట్రాజెనెకా టీకా నిలుపుదల

నాడీ సమస్య వల్లే టీకా ప్రయోగాలు నిలిపివేశాం.. కారణం వెల్లడించిన ఆస్ట్రాజెన్‌కా

కరోనా వైరస్ మహమ్మారిని అంతంచేసే వ్యాక్సిన్ కోసం ప్రపంచవ్యాప్తంగా ముమ్మర పరిశోధనలు కొనసాగుతున్నాయి. తాజాగా, ఆక్స్‌ఫర్డ్ టీకా ప్రయోగాలు నిలిచిపోయిన విషయం తెలిసిందే.

ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ- ఆస్ట్రాజెన్‌కా సంయుక్త వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ అర్ధాంతరంగా నిలిచిపోయిన విషయం తెలిసిందే. వ్యాక్సిన్ తీసుకున్న ఓ వాలంటీర్ అనారోగ్యానికి గురికావడంతో ఈ ప్రయోగాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ ప్రయోగాన్ని నిలిపివేయడానికి గల కారణాలపై మీడియాలో పెద్ద ఎత్తున్న ప్రచారం జరగడంతో ఆ సంస్థ స్పందించింది. ఓ మహిళా వాలంటీర్‌కు తీవ్రమైన నాడీ (న్యూరోలాజికల్‌)సమస్య తలెత్తడంతోనే ట్రయల్స్‌ను నిలిపివేశామని ఆ ఆస్ట్రాజెన్‌కా అధికార ప్రతినిధి మాథ్యూ కెంట్ స్పష్టం చేశారు.

మెదడు, వెన్నెముక కణాలపై ఉండే మైలీన్‌ తొడుగుకు వైరల్‌ ఇన్ఫెక్షన్‌ సోకి ‘ట్రాన్స్‌వర్స్‌ మైఎలిటిస్‌’ సమస్యతో వాలంటీర్ బాధపడుతోందంటూ మీడియాలో వచ్చిన కథనాలను ఆయన తోసిపుచ్చారు. ‘ది ట్రాన్స్‌వర్స్‌ మైఎలిటిసో.. కాదో మాకు తెలియదు.. పూర్తి వివరాలు తెలియాలంటే మరిన్ని పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది’ అని మాథ్యూ వ్యాఖ్యానించారు. ఆమెకు తలెత్తిన సమస్యను ఇంకా గుర్తించలేదు.. కానీ ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారని, ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశామన్నారు.

ఇదిలా ఉండగా.. ఈ ఏడాది చివరినాటికి లేదా వచ్చే ఏడాది ఆరంభం నాటికి వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని ఆస్ట్రాజెన్‌కా సీఈఓ పాస్కల్ సోరియట్ పునరుద్ఘాటించారు. వ్యాక్సిన్ భద్రతపై అధ్యయనానికి ఓ స్వతంత్ర కమిటీని ఏర్పాటుచేశారు.. అయితే ఇది ట్రయల్స్ సమగ్రతను కాపాడటానికి రూపొందించిన “సాధారణ చర్య” అని కంపెనీ పేర్కొంది. ఈ కమిటీ క్లినికల్ ట్రయల్స్‌ ఎప్పుడు సురక్షితమో తెలియజేస్తుంది.

‘ట్రయల్స్ ఎప్పుడు పునః ప్రారంభించవచ్చనే దానిపై మాకు ఈ కమిటీ మార్గనిర్దేశం చేస్తుంది.. తద్వారా మేము మా పనిని ప్రారంభించే అవకాశం కొనసాగించగలం’ అని సోరియట్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆస్ట్రాజెన్‌కా వ్యాక్సిన్ ప్రయోగాలు నిలిపివేయడం ఇదే తొలిసారి కాదు. క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొన్న వాలంటీర్లకు నాడీసంబంధ సమస్యలు తలెత్తడంతో జులైలో కొద్ది రోజులు నిలిపివేశారు.