Health

వీర్యపుష్ఠికి క్యారెట్ సాయం

Carrot For Sperm Quality - Telugu Health News

వీర్యం నాణ్యతకు క్యారెట్ మంచిదా? సంతాన సమస్యలు తొలగుతాయా?

క్యారెట్‌ను పక్కన పెడుతున్నారా? అయితే, ఈ ప్రయోజనాలు గురించి తెలిస్తే తప్పకుండా మీరు ఆశ్చర్యపోతారు. ముఖ్యంగా పురుషుల్లో సంతాన సామర్థ్యం పెంచేందుకు ఇది ఏ విధంగా దోహదం చేస్తుందనేది తప్పకుండా తెలుసుకోవాల్సిందే.

ఆరోగ్యానికి క్యారెట్ ఎంత మంచిదో తెలిసిందే. అన్ని సీజన్లలో లభించే వెజిటేబుల్ ఈ దుంపను చాలామంది పచ్చిగా తినేందుకే ఎక్కువగా ఇష్టపడతారు. కొందరు దీన్ని జ్యూస్ చేసుకుని మరీ తాగేస్తుంటారు. బిర్యానీ నుంచి సూప్స్, సలాడ్‌లు.. ఇలా ప్రతి ఒక్కదానిలో క్యారెట్ ఉంటేనే అందమూ.. రుచి ఉంటుంది. ఆరెంజ్ రంగులో కంటికి ఇంపుగా కనిపించే క్యారెట్.. చూపుకు కూడా మంచిదేనండోయ్. రోజుకో క్యారెట్ తింటే ఆరోగ్యానికి ఎన్నో పోషకాలు అందుతాయి. అన్ని ప్రయోజనాలు అందించే క్యారెట్ లైంగిక సామర్థ్యానికి కూడా మేలు చేస్తుందా? సంతాన సమస్యలతో బాధపడుతున్నవారు క్యారెట్ తినడం వల్ల ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయా? ఈ అంశాలపై ‘హర్వార్డ్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్’ పరిశోధకులు కొన్ని కీలక విషయాలను తెలుసుకున్నారు. వాటి గురించి పూర్తి వివరాలను తెలుసుకొనే ముందు.. క్యారెట్ వల్ల ప్రధానంగా శరీరానికి లభించే ప్రయోజనాలేమిటనేవి తప్పకుండా తెలుసుకోండి.

కంటి చూపుకు మంచిది

క్యారెట్‌‌లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఫైబర్‌‌లు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో విటమిన్-A అధికంగా ఉంటుంది. దీనివల్ల కంటి చూపు మెరుగవుతుంది. పిల్లలకు రోజు క్యారెట్ తినిపిస్తే భవిష్యత్తులో కంటి చూపు సమస్యలు రాకుండా జాగ్రత్తపడవచ్చు. క్యారెట్‌ను పచ్చిగా లేదా కూరగా వండి పెట్టినా మంచిదే. రోజూ ఏదైనా ఆహారంలో తప్పకుండా క్యారెట్ ఉండేలా చూసుకోండి. జ్యూస్, కూరలు ఇష్టం లేకపోతే.. క్యారెట్ హల్వా తయారు చేసైనా పెట్టండి. అయితే, తీపి తక్కువగా ఉండేలా చూసుకోండి.

ఊపిరితీత్తులకు రక్షణ

అసలే ఇది కరోనా సమయం. ఇప్పుడు మన ఊపిరి తీత్తులు ఆరోగ్యం ఉండటం ఎంతో ముఖ్యం. కాబట్టి.. రోజువారీ మీ ఆహారంలో క్యారెట్ తప్పనిసరిగా ఉండేలా చూడండి. ఎందుకంటే.. క్యారెట్‌లో విటమిన్-C కూడా ఉంటుంది. ఇందులోని ఫ్లావనాయిడ్‌ కాంపౌండ్స్‌ చర్మాన్ని, ఊపిరితిత్తులకు రక్షణ కల్పిస్తాయి. కాబట్టి.. ఇష్టం లేకపోయినా సరే. మీ ఆహారంలో తప్పకుండా క్యారెట్‌ను తినండి. ఊపిరి తీత్తులను ఆరోగ్యంగా ఉంచుకోండి.

పోషకాలు పుష్కలం.. జీర్ణక్రియ క్షేమం

క్యారెట్‌లో ఇంకా కాల్షియం, కాపర్‌, పొటాషియం, మాంగనీస్‌, ఫాస్ఫరస్‌ వంటి మినరల్స్‌ కూడా ఉంటాయి. క్యారెట్‌లో ఉండే ఫోలిక్‌ యాసిడ్‌, పిరిడాక్సిన్‌, థయామిన్‌ వంటివి విటమిన్లు జీవక్రియ క్రమంగా జరిగేందుకు సహకరిస్తాయి. అలాగే కాలయంలో చెడు కొవ్వులు పేరుకుపోకుండా క్యారెట్ ఉపయోగపడుతుంది. దంతాలు, చిగుళ్ల సంరక్షణకు కూడా క్యారెట్ ఎంతో మేలు చేస్తుందని ఆహార నిపుణులు చెబుతున్నారు.

మేను మెరవాలంటే క్యారెట్ తినండి

మీ మేను ప్రకాశవంతంగా మెరవాలంటే తప్పకుండా క్యారెట్ తీసుకోండి. ఇది చర్మాన్ని సంరక్షించి యవ్వనంగా ఉంచుతుంది. చాలామందికి విటమిన్-A లోపం వల్ల చర్మం, జుట్టు పొడిబారుతాయి. అలాంటివారు క్యారెట్ తింటే ఎలాంటి సమస్య ఉండదు. క్యారెట్‌లోని యాంటీఆక్సిడెంట్స్, విటమిన్-A శరీరంలోని విషతుల్యాలను బయటకు పంపేస్తాయి. క్యారెట్‌లో ఉండే అత్యధిక కెరోటినాయిడ్స్, ఆల్ఫా కెరోటిన్, లూటిన్‌లు గుండె వ్యాధులను నివారిస్తాయి.

క్యాన్సర్‌పై పోరాడుతుంది, బీపీ నియంత్రణ

క్యారెట్ తింటే క్యాన్సర్‌ కష్టాలు ఉండవని ఆహార నిపుణులు, వైద్యులు సూచిస్తున్నారు. ఇందులో ఉండే ఫాల్కరినల్‌ అనే యాంటీ ఆక్సిడెంట్‌ క్యాన్సర్‌పై పోరాడేందుకు ఉపయోగపడుతుంది. లివర్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, కోలన్ క్యాన్సర్ ముప్పు ఉండదు. క్యారెట్‌లో సోడియం పాళ్లు కూడా ఎక్కువే. ఇవి రక్తపోటును నియంత్రిస్తాయి. క్యారెట్ రోజూ తినేవారికి బీపీ నియంత్రణలో ఉంటుంది.

సంతాన సమస్యలకు.. క్యారెట్‌తో చెక్

క్యారెట్ స్పెర్మ్ క్వాలిటీ (వీర్యంలోని శుక్రముల నాణ్యత) పెంపొందిస్తుందని హార్వర్డ్ స్టడీలో తేలింది. ముఖ్యంగా పురుషులకు ఇది ఎంతో మేలు చేస్తుందని తెలిపారు. పురుషుల వీర్యంలోని శుక్ర కణాలు.. స్త్రీల అండంలోకి వేగంగా చొచ్చుకెళ్లేందుకు క్యారెట్ తగిన శక్తిని అందిస్తుందని ఈ స్టడీలో తేల్చారు. ఈ సందర్భంగా 200 మంది యువకులపై ఈ ప్రయోగం చేపట్టారు. వారికి కొన్ని కూరగాయలను అందించి నిత్యం వాటిని తినాలని కోరారు. వారిలో ఆరెంజ్, పసుపు రంగులో ఉన్న కూరగాయాలను తిన్నవారి స్పెర్మ్ శక్తివంతంగా ఉన్నట్లు తెలుసుకున్నారు. ముఖ్యంగా క్యారెట్లు స్పెర్మ్ సామర్థ్యాన్ని సాధారణం కంటే 6.5 నుంచి 8 శాతానికి పెంచాయన్నారు. చిలకడ దుంప, పుచ్చకాయలు కూడా మంచి ఫలితాలు చూపించాయన్నారు. క్యారెట్లో ఉండే విటమిన్ వంటి ఆరోగ్యకరమైన యాంటీఆక్సైడ్ల వల్ల వీర్యం నాణ్యత పెరుగుతోందని వెల్లడించారు.