Movies

రకుల్ పేరు నిజమే…NCB తాజా ప్రకటన

రకుల్ పేరు నిజమే…NCB తాజా ప్రకటన

బాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో మరో ట్విస్ట్‌. ఈ కేసులో నటీమణులు సారా అలీఖాన్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ పేర్లు తొలుత బయటకు వచ్చినప్పటికీ అలాంటిదేమీ లేదని తర్వాత వార్తలు వచ్చాయి. తాజాగా వారిద్దరి పేర్లను రియా చక్రవర్తి వెల్లడించినట్లు మాదక ద్రవ్యాల నిరోధక శాఖ (ఎన్‌సీబీ) తెలిపింది. ఈ విషయాన్ని సోమవారం ఆ శాఖ అధికారికంగా వెల్లడించింది. వారిద్దరితో పాటు డిజైనర్‌ సిమోనె ఖంబట్టాల పేరు కూడా చెప్పినట్లు ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్‌ కేపీఎస్‌ మల్హోత్రా తెలిపారు. అయితే, వారెవరికీ ఇప్పటివరకైతే ఎలాంటి సమన్లూ పంపలేదని తెలిపారు. మరోవైపు, 25 మంది బాలీవుడ్‌ తారలతో జాబితా తయారు చేశారా? అని ఆయన్ను విలేకర్లు ప్రశ్నించగా.. లేదు అని చెప్పినట్టు సమాచారం. ఎన్సీబీ రియాను విచారిస్తోందని ఆయన తెలిపారు. వారి పాత్ర ఎంత వరకు ఉందనేది మాత్రం వెల్లడించలేదు. మరోవైపు, అధికారులు శనివారం ముంబయి, గోవాలలో పలు చోట్ల సోదాలు నిర్వహించి మరో ఆరుగురిని అరెస్టు చేశారు. బాంద్రాకు చెందిన కరంజీత్‌ సింగ్‌ ఆనంద్‌ అలియాస్‌ కేజేని అదుపులోకి తీసుకొని దక్షిణ ముంబయిలోకి ఎన్సీబీ కార్యాలయానికి తీసుకెళ్లారు. అతడు డ్రగ్స్‌ సిండికేట్‌లో భాగస్వామిగా ఉన్నట్టు గుర్తించారు. తాజా అరెస్టులతో ఈ కేసులో ఇప్పటివరకు రియా సహా 16మందిని అరెస్టు చేశారు. ఇప్పటికే ఈ కేసులో అరెస్టయిన రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్‌కు న్యాయస్థానం శుక్రవారం ఈ నెల 22 వరకు జ్యుడీషియల్‌ రిమాండ్‌కు ఆదేశించిన విషయం తెలిసిందే.