Politics

హైదరాబాద్ సీబీఐ కోర్టులో అత్యధిక కేసులు జగన్‌వే !

హైదరాబాద్ సీబీఐ కోర్టులో అత్యధిక కేసులు జగన్‌వే !

హైదరాబాద్‌లోని సీబీఐ ప్రిన్సిపల్‌ స్పెషల్‌ జడ్జి కోర్టులో ప్రజాప్రతినిధులపై 23 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. సిట్టింగ్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న ఈ కేసుల్లో అవినీతి నిరోధక చట్టం కింద 18, మనీలాండరింగ్‌ నిరోధక చట్టం కింద 5 కేసులు అపరిష్కృతంగా ఉన్నాయి. సీబీఐ కోర్టుల్లో అపరిష్కృతంగా ఉన్న పలు కేసులు ఏపీ సీఎం జగన్‌పై ఆరోపణలకు సంబంధించినవే కావడం గమనార్హం. ఈ వివరాలను సుప్రీంకోర్టు నియమించిన అమికస్‌ క్యూరీ తాజాగా సమర్పించిన నివేదికలో వెల్లడించారు. ప్రజాప్రతినిధులపై ప్రత్యేక చట్టాల కింద పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలను హైకోర్టులు రెండురోజుల్లో సమర్పించాలని ఈ నెల 10న సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
*హైదరాబాద్‌ సీబీఐ కోర్టులో పెండింగ్‌లో ఉన్న 23 కేసుల వివరాలు తెలంగాణ హైకోర్టు సమర్పించినట్లు అమికస్‌ క్యూరీ విజయ్‌ హన్సారియా తన నివేదికలో తెలిపారు. పలు కేసులు 2012-13 నుంచి అపరిష్కృతంగా ఉన్నాయని, ఆరు కేసులపై హైకోర్టు స్టే విధించిందన్నారు. వీటిలో నాలుగు కేసులు డిశ్చార్జి పిటిషన్‌పై విచారణ దశలో ఉన్నాయన్నారు. హైదరాబాద్‌లోని ప్రత్యేక కోర్టు ఎదుట 10 జిల్లాల ఎంపీలు, ఎమ్మెల్యేలకు సంబంధించిన 118 కేసులు ఉన్నాయని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో హైకోర్టుల నుంచి వచ్చిన వివరాల ప్రకారం ఎమ్మెల్యేలు, ఎంపీలపై క్రిమినల్‌ నేరాలు కాకుండా 175 అవినీతి నిరోధక చట్టం కేసులు, 14 మనీలాండరింగ్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వివిధ రాష్ట్రాల నుంచి వివరాలు రాగా, ఏపీ నుంచి వివరాలు అందలేదు. తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలపై 45 క్రిమినల్‌ కేసులు హైదరాబాద్‌లో నమోదయ్యాయి. ఇతర రాష్ట్రాల్లో..
*మధ్యప్రదేశ్‌లో 184 కేసులు, తమిళనాడులో 324, ఢిల్లీలో 87, ఉత్తరప్రదేశ్‌లో 1217, జార్ఖండ్‌లో 142, ఒడిసాలో 331, అసోంలో 35, మహారాష్ట్రలో 330, కర్ణాటలో 26, గోవాలో 6, బిహార్‌లో 6 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని అమికస్‌ క్యూరీ తన నివేదికలో తెలిపారు. ఆయన చేసిన సూచనలు ఏమిటంటే.. ఎంపీలు, ఎమ్మెల్యేలపై క్రిమినల్‌ కేసుల విచారణకు జిల్లాకొక ప్రత్యేక కోర్టు ఏర్పరచాలి. ప్రతి జిల్లాకూ హైకోర్టు ఒక న్యాయాధికారికి ఈ క్రిమినల్‌ కేసులను కేటాయించాలి. ఏడాదిలోపు ఈ కేసులను తేల్చేందుకు హైకోర్టు బ్లూప్రింట్‌ రూపొందించాలి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ విషయాన్ని పర్యవేక్షించి అవసరమైన కార్యాచరణను రూపొందించాలి. ఎంపీలు, ఎమ్మెల్యేలపై వేగంగా కేసులను విచారించేందుకు యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. మరణ, జీవిత శిక్ష విధించే కేసులకు ప్రత్యేక కోర్టులు ప్రాధాన్యమివ్వాలి.