వ్యవసాయ సంబంధిత బిల్లులపై.. మిత్రపక్షం నుంచే వ్యతిరేకతను ఎదుర్కొంటున్న మోదీ సర్కారు!
ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో అధికార ఎన్డీయేకు మిత్రపక్షం నుంచి ఊహించని షాక్ ఎదురైంది. నరేంద్ర మోదీ సర్కారు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న వ్యవసాయ రంగాల సంస్కరణ బిల్లులకు మద్దతిచ్చే సమస్యే లేదని, బీజేపీకి ప్రధాన మిత్రపక్షంగా ఉన్న శిరోమణి అకాలీదళ్ తేల్చి చెప్పింది. పార్లమెంట్ లో ఈ మేరకు వచ్చే బిల్లులకు వ్యతిరేకంగా ఓటు వేయాలని శిరోమణి అకాలీదళ్ విప్ ను జారీ చేసింది. వ్యవసాయ రంగాల బిల్లుల సంస్కరణలకు తాము పూర్తిగా వ్యతిరేకమని ఆ పార్టీ కరాఖండీగా చెబుతోంది.
కాగా, దేశంలో వ్యవసాయ రంగాన్ని కార్పొరేటీకరణ చేసే దిశగా, కేంద్రం ఇటీవల మూడు ఆర్డినెన్స్ లను తీసుకుని వచ్చిన సంగతి తెలిసిందే. రైతులకు సాధికారత కల్పించడంతో పాటు నిత్యావసర సరుకులపైనా, గిట్టుబాటు ధరలు కల్పించే ఉద్దేశంతో పాటు, వ్యవసాయ ఉత్పత్తులకు వాణిజ్య పరమైన ప్రోత్సాహాన్ని కల్పించే ఉద్దేశంతో ఆర్డినెన్స్ లను తీసుకుని వచ్చింది.
ఈ బిల్లులన్నింటికీ, పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనే ఆమోదం పొందాలని కేంద్రం వీటిని మంగళవారం నాడు లోక్ సభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లులపై స్వపక్షం నుంచే తీవ్ర వ్యతిరేకత రావడం గమనార్హం. ఈ బిల్లులను వెంటనే వెనక్కు తీసుకోవాలని ఇప్పటికే పంజాబ్, ఛత్తీస్ గఢ్, యూపీల్లో రైతులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. ఈ వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా తమ ఎంపీలంతా ఓటు వేయాలని అకాలీదళ్ అధిష్ఠానం ఆదేశించింది.
ఇక, ప్రస్తుతానికి ఉత్తర భారతావనికే ఈ బిల్లుల వ్యతిరేక నిరసనలు పరిమితం కాగా, దక్షిణాదికి కూడా తీసుకుని వెళతామని రైతు సంఘాల నేతలు వ్యాఖ్యానించారు. ఇక ఎన్నో ఏళ్లుగా బీజేపీకి నమ్మకమైన భాగస్వామిగా ఉన్న అకాలీదళ్ నుంచి వచ్చిన నిరసనలతో బీజేపీ నేతలు పునరాలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. ఇదిలావుండగా, కేంద్రం మాత్రం ఈ బిల్లులు రైతులకు స్నేహపూర్వకమని స్పష్టం చేస్తుండటం గమనార్హం