నాలుకకు రుచి కావాలి. మనసు వెరైటీలు ఆశిస్తుంటుంది. అలాగని పుర్రెకు బుద్ధి పుట్టిన ప్రతిసారీ జిహ్వకో కొత్త రుచి చూపిస్తూ వెళ్లిపోతే.. అనారోగ్య సమస్యలు పలకరించడానికి ఎక్కువ సమయం పట్టదు. అసలే కరోనాతో కంగారు పడుతున్న వేళ అలవాటులో పొరపాట్లకు తావిస్తే అసలుకే ఎసరు రావొచ్చు. అందుకే ఆహారం విషయంలో ఎంత శ్రద్ధ వహిస్తే అంత మంచిది. తక్షణ రక్షణ కోసం జీవక్రియలను గాడినపెట్టే ఆహారం తప్పనిసరి. వ్యాధినిరోధక శక్తి పెంపు కోసం పోషకాలతో జట్టుకట్టడం మరచిపోవద్దు. మనం తినే తిండే మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. అందుకే ఈ తరుణంలో ఆహారం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో సూచిస్తున్నారు నిపుణులు. ఆరోగ్యకరమైన ఆహారమే కాదు.. అది ఎంత పరిశుభ్రంగా ఉందన్నది కూడా ముఖ్యం. కాబట్టి కూరగాయలను ఉప్పునీటితో కడగండి. వంట చేసేటప్పుడు చేతులు శుభ్రంగా ఉండేలా చూసుకోండి.
*ఆల్కహాల్ తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ లాంటి చిన్న సమస్య నుంచి క్యాన్సర్ దాకా అనేక అనర్థాలున్నాయి. ఇది ఇమ్యూనిటీని కూడా తగ్గిస్తుంది. వ్యాధినిరోధక వ్యవస్థను నిర్వీర్యం చేస్తుంది. ఇప్పుడు మనం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాం. ఒకపక్క ఆదాయం తగ్గిపోయి, మరోపక్క పండ్లు, కూరగాయల ధరలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో నిత్యావసరాలు పొదుపుగా వాడుకోవడం అనివార్యం. ఆహార పదార్థాల విషయంలో ఉన్నంతలో ఉన్నతంగా వినియోగించుకోవాలి. ప్రాసెస్ చేసిన ఆహారం జోలికి అస్సలు వెళ్లొద్దు. ఇంట్లో వెరైటీలు ప్రయత్నించినా.. ఆరోగ్యాన్ని కాపాడే, రోగనిరోధక శక్తిని పెంచే సమతుల ఆహారం తీసుకోవడం తప్పనిసరి.
*ప్రణాళిక అవసరం
కొవిడ్ నుంచి కాపాడేది పోషకాహారమే. వంటకాల్లో పోషక విలువలు ఉండేలా జాగ్రత్తపడండి. వృథాను అరికట్టడం కూడా చాలా అవసరం. పదార్థాలు మిగిలిపోకుండా ప్రణాళిక ప్రకారం వండుకోండి. ఇంట్లో ఉన్న కూరగాయలు, ఇతర పదార్థాలు అయిపోయిన తరువాతే మళ్లీ కొనండి. తొందరగా పాడైపోతాయనుకున్నవి, తాజాగా ఉన్నవి ముందుగా వాడండి. ప్రత్యేకించి పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తుల వంటి వాటి వినియోగం ముందుగా పూర్తయ్యేట్టు చూసుకోండి. పనీర్ లాంటివి ఉంటే ఎక్కువ రోజులు నిలవ చేయకండి.
*ఇంటి వంటే మేలు
పనుల ఒత్తిడి కారణంగా వంటకాల విషయంలో ఏదో చేశామా.. తిన్నామా.. అనుకోవద్దు. రెస్టారెంట్లు తెరిచారు కదా అని వారాంతాల్లో బయట తినేద్దామన్న ఆలోచన వస్తే ప్రమాదమే! ఇంకొన్నాళ్లు మనసును కట్టడి చేసుకోండి. పోషకాలతో కూడిన కొత్త రెసిపీలు ఇంట్లోనే ప్రయత్నించండి. ఆరోగ్యాన్ని పెంచే చాలా రకాల వంటకాల తయారీ పద్ధతులు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. విటమిన్లు, మినరల్స్, ఇతర పోషకాలను సమతులంగా అందించే రకరకాల పదార్థాలను స్వయంగా వండి వడ్డించుకోండి. అదే సమయంలో ఇంటి పట్టునే ఎక్కువ సమయం ఉంటున్నాం. ఈ పరిస్థితుల్లో ఆహారం కాస్త ఎక్కువ పరిమాణంలో తీసుకునే అవకాశం ఉంటుంది. ఒకేసారి ఎక్కువ మొత్తంలో కాకుండా.. నాలుగైదు గంటల విరామంలో కొద్ది కొద్దిగా తింటే ఏ ఇబ్బందీ ఉండదు. దీంతో పాటు కనీసం గంట పాటు యోగా, ఏరోబిక్ ఎక్సర్‌సైజుల వంటి వర్కవుట్స్ చేయడం అలవాటు చేసుకోండి.
*ఉప్పు.. ముప్పు
సోడియం ఎక్కువ తీసుకోకండి. పెరుగన్నంలో ఉప్పు వేసుకోవడం లాంటివి వద్దు. ఊరగాయల్లో ఉప్పు అధికంగా ఉంటుంది. కాబట్టి వాటిని ఎక్కువగా తినకండి. 50 నుంచి 75 శాతం ఉప్పు మనం తినే ఆహారం నుంచే వస్తుందని అధ్యయనాలు చెప్తున్నాయి. కాబట్టి అదనంగా టేబుల్ సాల్ట్ వాడవద్దు. కొందరు అన్నం వండేటప్పుడు కూడా ఉప్పు వేస్తుంటారు. ఇలా చేయవద్దు.
*చక్కెరతో జాగ్రత్త!
మితిమీరిన తీపి ఎప్పుడూ చేదే. మీకు స్వీటు తినాలని అనిపించినప్పుడు పండ్లు తీసుకోండి. లేదా పండ్లరసం తాగండి. అదనంగా చక్కెర కలపని డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చు. ఇతరత్రా తీపి వంటకాలు తినాలనుకుంటే చాలా తక్కువ మొత్తంలో తీసుకోండి. వాటిలో తీపి కూడా తక్కువగా ఉండేలా చూసుకోండి.
*కొవ్వు అతిగా వద్దు
రోజుకు తీసుకునే కేలరీలలో 30 శాతం మాత్రమే కొవ్వు ఉండాలి. వీటిలో 10 శాతం మాత్రమే సంతృప్త కొవ్వు ఉండేలా చూసుకోవాలి. ఇందుకోసం నూనె వినియోగం తగ్గించండి. వేపుళ్ల జోలికి వెళ్లకండి. ఉడికించిన కూరలను ఎక్కువ మోతాదులో తీసుకోండి. స్టీమ్ కుక్, గ్రిల్ చేయడం కూడా మంచిదే.
*నీళ్లు తప్పనిసరి
ఆరోగ్యంగా ఉండటానికి నీళ్లు ఎక్కువగా తాగడం చాలా ముఖ్యం. తగినన్ని నీళ్లు తాగకుంటే జీర్ణవ్యవస్థ మందగించి, పరోక్షంగా ఇమ్యూనిటీ కూడా ప్రభావితం అవుతుంది. మంచినీళ్లను ఫిల్టర్ చేసి తాగాలి. నీటిని కాచి, చల్లార్చి తాగడం మరింత మేలు చేస్తుంది. ఈ సీజన్‌లో గోరువెచ్చని నీళ్లు తాగితే మంచిది. దాహం వేసినప్పుడు కూల్‌డ్రింక్స్ జోలికి వెళ్లకుండా మంచినీళ్లే తాగడం వల్ల అటు చక్కెర మితిమీరకుండా ఉంటుంది. ఇటు కేలరీలు ఎక్కువ కాకుండా ఉంటాయి. నీళ్లలో నిమ్మ రసం, పుదీనా రసం కలిపి తాగొచ్చు.
నాలుకకు రుచి కావాలి. మనస్సుకి వెరైటీ కావాలి.

Related tags :