కేంద్ర ప్రభుత్వం రుణాలు జూన్ చివరినాటికి రూ.101.3 లక్షల కోట్లకు పెరిగాయి..మార్చినాటికి రూ.94.6 లక్షల కోట్ల అప్పు ఉండగా, మూడు నెలల వ్యవధిలోనే రూ.6.7 లక్షల కోట్ల రుణం తీసుకోవాల్సి వచ్చింది.
ప్రభుత్వ రుణ నిర్వహణపై శుక్రవారం విడుదలైన త్రైమాసిక నివేదికలో ఈ విషయం వెల్లడయింది..ఈ మూడు నెలల కాలంలో కేంద్ర ప్రభుత్వం రూ.3.46 లక్షల కోట్లకు సెక్యూరిటీ బాండ్లను విడుదల చేసింది.
వీటి సగటు మెచ్యూరిటీ కాలపరిమితి 14.61 సంవత్సరాలుగా నమోదయింది.
ఈ సెక్యూరిటీలను 39శాతం మేర వాణిజ్య బ్యాంకులు, 26.2 శాతం మేర బీమా కంపెనీలు కొనుగోలు చేశాయి.
ఇదే సమయంలో స్వల్పకాలిక సెక్యూరిటీ బాండ్లు లాంటి క్యాష్ మేనేజ్‌మెంట్ బిల్స్ జారీ చేయడం ద్వారా మరో రూ.80వేల కోట్లు సేకరించగలిగింది.
బహిరంగ మార్కెట్‌లో సెక్యూరిటీల విక్రయం ద్వారా ఇంకో రూ.10వేల కోట్లు సమకూర్చుకొంది..ప్రభుత్వ బాండ్ల ద్వారా ఈ త్రైమాసికంలో సగటున 5.85 శాతం ఆదాయం సమకూరింది.
అంతకు ముందు త్రైమాసికంలో 6.70 శాతం ఆదాయం రాగా ప్రస్తుతం తగ్గడం గమనార్హం..మొత్తంమ్మీద ఈ త్రైమాసికంలో ద్రవ్యలోటు రూ.6,62,363 కోట్లకు చేరుకుంది.