* దేశీయ మార్కెట్లను కరోనా భయాలు ఇప్పుడప్పుడే వీడే పరిస్థితి కనిపించడం లేదు. కేసుల విజృంభణతో సోమవారం భారీ నష్టాలను చూవి చూసిన సూచీలు మంగళవారం కూడా అదే బాటలో పయనించాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 300 పాయింట్లు నష్టపోగా, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 97 పాయింట్ల నష్టంతో ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 73.58 వద్ద ట్రేడ్ అవుతోంది.
* ప్రముఖ గేమింగ్, ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ స్మాష్ మూతపడినట్లు ఆంగ్లవార్త సంస్థ మింట్ కథనంలో పేర్కొంది. దేశంలోని మొత్తం 19 నగరాల్లో 40చోట్ల ఇది వ్యాపారం నిర్వహిస్తోంది. ఈ కంపెనీకి కొన్నేళ్లుగా ప్రముఖ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ కంపెనీ ప్రధానంగా నగర యువతను దృష్టిలో ఉంచుకొని వ్యాపారం నిర్వహిస్తుంది. కానీ, ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా వ్యాపారం పడిపోవడంతో మూసివేయాల్సి వచ్చింది.
* కొవిడ్ నిరోధానికి విధించిన దేశవ్యాప్త లాక్‌డౌన్‌కు తోడు అంతర్జాతీయ విమాన సర్వీసులు పూర్తిగా నిలిచిపోవడం వల్ల బంగారం స్మగ్లింగ్ గణనీయంగా తగ్గింది. గతేడాది దేశంలోకి 120 టన్నుల బంగారం దొంగచాటుగా దిగుమతి కాగా, ఈ ఏడాది నెలకు 2 టన్నుల చొప్పున ఏడాది మొత్తంమీద 25 టన్నులకే పరిమితం అవుతుందనే అంచనా ఉందని ఆలిండియా జెమ్ అండ్ జువెలరీ దేశీయ మండలి ఛైర్మన్ ఎన్.అనంత పద్మనాభన్ పేర్కొన్నారు మార్చి ఆఖరు నుంచి జూన్ వరకు అంతర్జాతీయ విమానాలు నిలిచిపోవడంతో పసిడి అక్రమార్కులకు మార్గాలు స్తంభించాయి. ఇక ఆభరణాల దుకాణాలు కూడా మూసివేయడంతో, దేశీయంగా గిరాకీ లేదు. ఇక నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ నుంచి కొద్దిమొత్తాల్లో మాత్రమే నేల, నీటి మార్గాల్లో బంగారం దొంగచాటుగా దేశంలోకి వస్తోందని భావిస్తున్నారు. అయితే బంగారంపై దిగుమతి సుంకాన్ని శ్రీలంక తాజాగా రద్దుచేయడం వల్ల, అక్కడినుంచి భారత్‌కు బంగారం స్మగ్లింగ్ పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
* అంతకంతకూ పెరుగుతూ పోతున్న బంగారం ధర మంగళవారం భారీగా తగ్గింది. గత సెషన్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.52,000లకు పైగా ఉండగా, మంగళవారం నాటి ట్రేడింగ్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.672 తగ్గి, రూ.51,328కు చేరింది. బలహీన అంతర్జాతీయ పరిణామాలు బంగారం తగ్గుదలకు కారణమయ్యాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యురిటీస్ అభిప్రాయడింది.
* టిక్‌టాక్ కొనుగోలుకు అమెరికా సంస్థలైన ఒరాకిల్ కార్పొరేషన్, వాల్‌మార్ట్‌ల ఒప్పందాన్ని చైనా ఒప్పుకోకపోవచ్చని అధికారిక పత్రిక గ్లోబల్ ట్వీట్ చేసింది. ఈ ఒప్పందం అన్యాయమని అభిప్రాయపడింది. కొత్త ఒప్పందం ప్రకారం అమెరికా కంపెనీలతో కలిసి ‘టిక్‌టాక్’ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్ ఓ సంస్థను ఏర్పాటు చేయనుంది. దీనిని టిక్‌టాక్ గ్లోబల్‌గా వ్యవహరించనున్నారు. దీని బోర్డులో మెజార్టీ వ్యక్తులు అమెరికాకు చెందిన వారే ఉంటారు. దీనిపై గ్లోబల్‌టైమ్స్ అభ్యంతరం వ్యక్తం చేసింది.
* ఖాతాలను ఫోరెన్సిక్ ఆడిట్ జరిపినపుడు అందులోని లోపాల గురించి ఖాతాదారు వివరణ తీసుకుంటామని, మోసపూరితంగా రుణం తీసుకున్నట్లు రుజువైన నేపథ్యంలో మోసపూరిత ఖాతాగా ప్రకటించేముందు తాజాగా నోటీసు జారీ చేయాల్సిన అవసరంలేదని స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తరఫున అడ్వొకేట్ జనరల్ బి.ఎస్.ప్రసాద్ సోమవారం హైకోర్టుకు నివేదించారు. ఆర్‌బీఐ జారీ చేసిన మాస్టర్ సర్క్యులర్ మేరకు మోసపూరిత ఖాతాగా ప్రకటించి, ఇతర బ్యాంకులు మోసపోకుండా ఉండటానికి సమాచారం ఇస్తామన్నారు. ఎస్‌బీఐ తమ ఖాతాలను మోసపూరిత ఖాతాలుగా ప్రకటించడాన్ని సవాలు చేస్తూ బీఎస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ రాజేశ్ అగర్వాల్ తదితరులు దాఖలు చేసిన పిటిషన్‌లపై సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎస్.చౌహాన్, జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. ఖాతాలను మోసపూరితమైనవని ప్రకటించే ముందు ఖాతాదారు వివరణ తీసుకోవాల్సిన అవసరంలేదంటూ ఆర్‌బీఐ జారీ చేసిన సర్క్యులర్ సహజ న్యాయసూత్రాలకు విరుద్ధం కాదా అన్ని ప్రశ్నించింది. దీనిపై ఏజీ సమాధానమిస్తూ బ్యాంకులను మోసం చేసి రుణాలు పొందారని, అలాంటివారి వ్యవహారంలో సహజ న్యాయసూత్రాలను పాటించాల్సిన అవసరం లేదన్నారు. నోటీసులు ఇవ్వాలని ఆర్‌బీఐ సర్క్యులర్ కూడా పేర్కొనలేదన్నారు. మోసపూరిత ఖాతాగా ప్రకటించాక అంతర్గతంగా బ్యాంకులకు సమాచారం ఇస్తామని, అంతేగానీ దీని ఆధారంగా ఇతర క్రిమినల్ చర్యలుండవన్నారు. ఎస్‌బీఐ కన్సార్టియం నుంచి ఈ బీఎస్ లిమిటెడ్ మోసపూరిత విధానాలతో రూ.1500 కోట్ల దాకా రుణం తీసుకుందన్నారు. బీఎస్ లిమిటెడ్ తరఫున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తూ తమ వాదన వినకుండా సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా ఎస్‌బీఐ నిర్ణయం తీసుకుందన్నారు. ఆర్‌బీఐ సర్క్యులర్ జారీ చేసిన ఉద్దేశం, లక్ష్యాలపై వివరణ ఇస్తానని చెప్పడంతో ధర్మాసనం విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.