ScienceAndTech

కరోనాను చదివేందుకు నానో రేణువుల తోడ్పాటు

కరోనాను చదివేందుకు నానో రేణువుల తోడ్పాటు

కరోనా వైరస్‌.. మానవ కణాల్లోకి ప్రవేశించి, ఇన్‌ఫెక్షన్‌ను కలిగించే తీరును కళ్లకు కట్టే ఒక బుల్లి సాధనాన్ని అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. అమెరికాలోని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ అడ్వాన్సింగ్‌ ట్రాన్స్‌లేషనల్‌ సైన్సెస్‌ (ఎన్‌సీఏటీఎస్‌) శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. కరోనా వైరస్‌పై కొమ్ము ఆకృతిలో స్పైక్‌ ప్రొటీన్లు ఉంటాయి. మానవ కణంలోని ఏసీఈ2 అనే భాగానికి అతుక్కొని, ఆ తర్వాత కణంలోకి ప్రవేశించి ఇన్‌ఫెక్షన్‌ను కలిగించడానికి వైరస్‌కు ఇవి సాయపడుతుంటాయి. ఈ ప్రక్రియ మొత్తాన్నీ పరిశీలించడానికి శాస్త్రవేత్తలు క్వాంటమ్‌ డాట్‌ అనే ఫ్లోరోసెంట్‌ నానో రేణువును రూపొందించారు. పరిశోధనల కోసం వాస్తవ వైరస్‌ను ఉపయోగించడం చాలా కష్టం. అందుకు ప్రత్యేక మౌలిక వసతులు అవసరం. క్వాంటమ్‌ డాట్‌తో ఈ ఇబ్బంది తొలగిపోతుంది. మానవ కణానికి అతుక్కోవడం నుంచి అందులోకి చొరబడటం వరకూ.. వైరస్‌ చేసే అనేక పనులను ఇది నిర్వహిస్తుంది. పైగా ఈ సాధనానికి వెలుగులీనే సామర్థ్యం ఉన్నందువల్ల వాటి తీరుతెన్నులను మైక్రోస్కోపు కింద శాస్త్రవేత్తలు క్షుణ్నంగా పరిశీలించవచ్చు.