Movies

Breaking: మళ్లీ విషమించిన బాలు ఆరోగ్యం

SP Balu Condition Critical Again - Telugu Movie News

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఇటీవల కరోనా బారిన పడిన ఆయన కోలుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఇతర ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కాసేపట్లో బాలు ఆరోగ్య పరిస్థితిపై ఎంజీఎం ఆస్పత్రి వర్గాలు ప్రకటన విడుదల చేయనున్నాయి. కరోనా వైరస్‌ సోకడంతో ఆగస్టు 5న బాల సుబ్రహ్మణ్యం చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో వైద్యులు వెంటిలేటర్‌, ఎక్మో సాయంతో చికిత్స ప్రారంభించారు. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులు, అభిమానులు, శ్రేయోభిలాషులు ఎస్పీబీ త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఇటీవల ఆయనకు కరోనా నెగెటివ్‌ అని తేలడంతో అందరూ సంతోషం వ్యక్తంచేశారు. బాలు త్వరగా కోలుకొని క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు. ఇటీవల ఆయన తనయుడు ఎస్పీ చరణ్‌ మాట్లాడుతూ.. ఎక్మో/వెంటిలేటర్‌ సాయంతో తన తండ్రికి చికిత్స కొనసాగుతోందని చెప్పారు. వైద్యులు ఫిజియో థెరపీ చేస్తున్నారని అన్నారు. ప్రస్తుతం ఆయన ఆహారంగా ద్రవ పదార్థాలు తీసుకుంటున్నారని, ఆస్పత్రి నుంచి సాధ్యమైనంత త్వరగా ఇంటికి వెళ్లాలన్న ఆసక్తితో ఉన్నారంటూ చరణ్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. తాజాగా ఆయన ఆరోగ్యంపై వస్తున్న వార్తలతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.