ScienceAndTech

చౌసత్ యోగిని ఆలయమే మన పార్లమెంట్‌కు స్ఫూర్తి

చౌసత్ యోగిని ఆలయమే మన పార్లమెంట్‌కు స్ఫూర్తి

చరిత్రను వీపున మోసీమోసీ అలసిపోయినట్టు కనిపించే ఆ గుట్టపైకి చేరుకోగానే.. వినీలాకాశపు గొడుగు కింద కరిగిపోతున్న కాలానికి ప్రతీకలా చక్రాకారంలో ఆ దేవాలయం దర్శనమిస్తుంది. అత్యద్భుత శిల్పకళతో అబ్బురపరుస్తుంది. చూడగానే చిరపరిచితమైన నిర్మాణంలా, ఎన్నోసార్లు చూసినట్టుగా అనిపిస్తుంది. ‘ఇంతకుముందే ఈ గుడిని ఎక్కడ చూశామా..?’ అని ఆలోచిస్తున్నంతలోనే మనస్సులో ‘భారత పార్లమెంటు భవనం’ కదలాడుతుంది. అదే మధ్యప్రదేశ్‌లోని ‘చౌసత్‌ యోగిని’ ఆలయం, భారత పార్లమెంటు భవన నిర్మాణానికి స్ఫూర్తినిచ్చిన కట్టడం.
*మారు 700 ఏండ్ల క్రితం దేవపాల్‌ రాజు పాలనలో ‘చౌసత్‌ యోగిని’ ఆలయాన్ని నిర్మించారు. మధ్యప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్‌ ప్రాంతంలో మొరీనా జిల్లా కేంద్రానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న మతౌలీ అనే మారుమూల గ్రామంలో ఈ ఆలయం ఉన్నది. కొండపైన 200 మీటర్ల ఎత్తులో వృత్తాకారంలో నిర్మించిన ఈ మందిరం, పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నది. ఈ దేవాలయానికి వంద స్తంభాలు, ఒకే ఒక ప్రవేశద్వారం ఉంటుంది. చక్రాకారంలోని ఆలయంలోపలికి అడుగుపెట్టగానే, నట్టనడుమ గర్భగుడి.. అందులో లింగరూపంలో ఉన్న ఏకాటేశ్వరనాథుడు దర్శనమిస్తాడు. ఈ వృత్తాకార ఆలయంలో 64 గదులు ఉంటాయి. ఒక్కో గదిలో ఒక్కో శివలింగం, ఆ శివలింగాన్ని అర్చిస్తున్నట్లు ఒక్కో యోగిని విగ్రహం.. మొత్తం 64 విగ్రహాలు కనిపిస్తాయి. అందుకే దీన్ని చౌసత్‌(64) యోగిని ఆలయం అని అంటారు.
**ఈ ఆలయ స్ఫూర్తితోనే
ఢిల్లీ రాజధానిగా భారతదేశాన్ని పాలించాలని నిర్ణయించిన తర్వాత బ్రిటిష్‌వాళ్లు పరిపాలనా భవనాల నిర్మాణాలను చేపట్టారు. భవనాల డిజైన్ల కోసం సర్‌ ఎడ్విన్‌ లూటియెన్స్‌, సర్‌ ఎబ్బెర్ట్‌ అనే ఇద్దరు బ్రిటిష్‌ ఆర్కిటెక్టులను నియమించారు. ఈ క్రమంలో 1910లో ఎడ్విన్‌ లూటియెన్స్‌, చౌసత్‌ యోగిని మందిరాన్ని సందర్శించాడు. ఈ ఆలయ నిర్మాణాన్ని స్ఫూర్తిగా తీసుకొనే, రెండేండ్ల తర్వాత భారత పార్లమెంట్‌ భవనాన్ని డిజైన్‌ చేశాడు. అప్పటి బ్రిటిష్‌ ఉన్నతాధికారులను ఈ నిర్మాణ శైలి ఎంతగా ఆకట్టుకున్నదంటే.. వారు ఇంకో మోడల్‌ను కూడా పరిశీలించలేదు. పార్లమెంట్‌ భవనం ఇలాగే ఉండాలనే నిర్ణయానికి వచ్చి, వెంటనే డిజైన్‌కు ఓకే చెప్పారు. కానీ, ఎడ్విన్‌ మాత్రం ఎక్కడా కూడా ఈ ఆలయ నమూనాతోనే పార్లమెంట్‌ భవనాన్ని డిజైన్‌ చేశానని చెప్పుకోలేదు.
*ఇంకా అజ్ఞాతంలోనే
భారత పార్లమెంట్‌ భవన నిర్మాణానికి స్ఫూర్తిగా నిలిచిన చౌసత్‌ యోగిని ఆలయం, పాలకుల నిర్లక్ష్యానికి గురవుతున్నది. ఒకప్పుడు విదేశీ ఆక్రమణదారుల దాడిలో నాశనం కాగా, ఇప్పుడు అక్రమ మైనింగ్‌ పేలుళ్లతో క్రమక్రమంగా శిథిలమవుతున్నది. ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న ఈ ఆలయ ప్రాధాన్యతను ఇప్పటి దాకా ఎవరూ బహిర్గతం చేయలేదు. చారిత్రక గ్రంథాల్లో గానీ, పాఠ్యపుస్తకాల్లో గానీ ఎక్కించలేదు. కనీసం ఆవైపుగా ప్రయత్నాలు కూడా చేయలేదు. తరతరాల చరిత్రను తనలో దాచుకున్న ఈ దేవాలయం, ఎన్నో ఏళ్లుగా అజ్ఞాతంలోనే మగ్గుతున్నది.