* దేశంలో నానాటికీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పరీక్షల సంఖ్య కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వ్యాపార దిగ్గజం రిలయన్స్‌కు చెందిన రిలయన్స్ లైఫ్ సైన్సెస్ ఆర్టీ-పీసీఆర్ కిట్‌ను అభివృద్ధి చేసింది. దీని ద్వారా కేవలం 2గంటల్లోనే ఫలితాలను పొందవచ్చని కంపెనీ వర్గాలు తెలిపాయి.
* ప్రముఖ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా తన రెండోతరం స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ (ఎస్యూవీ) థార్‌ను శుక్రవారం విడుదల చేసింది. దీని ప్రారంభ ధరను రూ.9.8 లక్షలుగా, గరిష్ఠ ధరను రూ.13.75 లక్షలుగా (ఎక్స్‌షోరూం) నిర్ణయించింది. బీఎస్-6 ప్రమాణాలు కలిగిన సరికొత్త థార్ ఏఎక్స్, ఎల్ఎక్స్ మోడళ్లలో పెట్రోల్, డీజిల్ సదుపాయాలతో వస్తోంది.
* ఉద్యోగంలో చేరిన తొలినాళ్లలో 60 శాతం మంది మహిళలకు అధిక నిర్ణయాత్మక శక్తి, సృజనాత్మక ఆలోచనలు ఉంటున్నాయి. అయితే పై స్థాయిలకు వెళ్లే కొలదీ ఆ గణాంకాలు 30 శాతానికి తగ్గిపోతున్నాయని ఓ నివేదిక తెలిపింది. ‘వృత్తిగత జీవితం మొదలైన సమయంలో 60% మంది మహిళలు; 40% పురుషులకు నిర్ణయాత్మక శక్తి, సృజనశీలత ఉంటోంది. అయితే పైకెళ్లేకొద్దీ 30 శాతం మహిళలు, 70 శాతం పురుషులుగా ఆ గణాంకాలు మారుతున్నాయి. కీలక హోదాల్లో మహిళల సంఖ్య భారీగా తగ్గడమే ఇందుకు కారణమని’ స్కికీ రూపొందించిన నివేదికలో తేలింది. 22-47 ఏళ్ల వయసులోని 5,388 మంది ఐటీ వృత్తినిపుణులపై నిర్వహించిన సర్వేలో ఈ అంశాలు తేలాయి. అటు వ్యక్తులు, ఇటు కార్పొరేట్లు కలిసి ఈ లింగ అసమానతలను తగ్గించాల్సిన అవసరం ఉందని ఆ సంస్థ అభిప్రాయపడింది. ప్రతి కంపెనీ మరింత మంది మహిళలను నియమించుకుని, అంతరాలను తగ్గించడం ద్వారా సమానతను సాధించవచ్చని వివరించింది. పురుషులతో సమానంలో మహిళలు దాదాపు అన్ని విభాగాల్లోనూ(డేటా ఆధారిత బాధ్యతలు; డిజైన్, సృజనాత్మక హోదాలు, సాంకేతిక పనులు) సామర్థ్యాన్ని కలిగి ఉన్నారు. విక్రయాలు, కస్టమర్ ఆధారిత బాధ్యతలు, రిలేషన్షిప్ మేనేజ్మెంట్ వంటి వాటిలో పురుషులతో పోలిస్తే మహిళలే మిన్నగా కనిపించారని వివరించింది.
* మారుతీ సుజుకీ తమ తేలికపాటి వాణిజ్య వాహనమైన సూపర్ క్యారీ ధరల్ని సుమారు రూ.11 వేల వరకు పెంచింది. బీఎస్-6 రకం సూపర్ క్యారీ ధరల్ని గురువారం నుంచి సవరించినట్లు ఎక్స్ఛేంజీలకు సమాచారమిచ్చింది. సవరించిన ధరల ప్రకారం, దిల్లీ-ఎన్సీఆర్ రీజియన్‌లో ఎక్స్‌షోరూమ్ ధరలు రూ.4.25-5.18 లక్షల మధ్య ఉంటాయని మారుతీ వెల్లడించింది.
* జర్మన్ విలాస కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ వచ్చే నెల నుంచి భారత్‌లో తమ కార్ల ధరల్ని మోడల్ ఆధారంగా 3 శాతం వరకు పెంచేందుకు నిర్ణయించింది. ‘బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా, వినియోగదార్లు కోరుకుంటున్న మంచి ఉత్పత్తుల్ని అందిస్తూ వస్తోంది. నవంబరు 1 నుంచి బీఎండబ్ల్యూ, మినీ ఉత్పత్తుల పోర్ట్‌పోలియో ధరల్ని పెంచుతామ’ని బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా అధ్యక్షుడు విక్రమ్ వెల్లడించారు.
* దేశంలో పెట్రోల్ విక్రయాలు కొవిడ్ముందు స్థాయికి చేరాయి. 2019 సెప్టెంబరుతో పోలిస్తే గత నెలలో 2 శాతం పెరిగాయి కూడా. అదే ఈ ఏడాది ఆగస్టుతో పోలిస్తే 10.5 శాతం వృద్ధి నమోదైంది. డీజిల్ విక్రయాలు కూడా క్రమంగా పెరుగుతున్నట్లు ప్రభుత్వ రంగ ఇంధన రిటైలర్ల గణాంకాలు వెల్లడిస్తున్నారు. గత సెప్టెంబరులో పెట్రోల్ విక్రయాలు వార్షిక ప్రాతిపదికన 2 శాతం పెరిగితే గత ఆగస్టుతో పోలిస్తే ఏకంగా 10.5 శాతం పెరిగాయి. డీజిల్ విక్రయాలు మాత్రం 2019 సెప్టెంబరుతో పోలిస్తే 7 శాతం తగ్గాయి. అయితే, ఈ ఏడాది ఆగస్టుతో పోలిస్తే గిరాకీ 22 శాతం పెరగడం విశేషం. వ్యక్తిగత వాహనాలు ఎక్కువగా రోడ్లపైకి రావడంతో పెట్రోల్ వినియోగం పెరిగింది. ఇదే సమయంలో పాఠశాల బస్సులు, ప్రజా రవాణా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాకపోవడంతో డీజిల్‌కు గిరాకీ తక్కువగా ఉందని బీపీసీఎల్ డైరెక్టర్ (మార్కెటింగ్) అరుణ్ కుమార్ సింగ్ అభిప్రాయపడ్డారు. ‘ఈ ఏడాది చివరికల్లా కరోనా వైరస్ పూర్వపు స్థితికి ఇంధన వినియోగం చేరుకునే అవకాశం కనిపిస్తోంది. పండుగల సీజన్ కావడంతో అక్టోబరులో ఇంధనానికి గిరాకీ మరింత పెరిగొచ్చ’ని ఐఓసీ ఛైర్మన్ శ్రీకాంత్ మాధవ్ వైద్య అభిప్రాయపడ్డారు.