* బెజవాడ వాసుల ట్రాఫిక్ కష్టాలు తీర్చడం కోసం నిర్మించిన కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి మరోసారి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 16న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కనకదుర్గ ఫ్లైఓవర్ ను ప్రారంభిస్తారని విజయవాడ ఎంపీ కేశినేని నాని తెలిపారు. విజయవాడ ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఈ భారీ ఫ్లైఓవర్ కొంతకాలం కిందటే నిర్మాణం పూర్తి చేసుకుంది. అయితే ఇప్పటికి రెండుసార్లు ప్రారంభోత్సవం వాయిదా పడింది.తొలుత సెప్టెంబరు 4న ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినా, చివరి నిమిషంలో వాయిదా పడింది. ఆ సమయంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణించారు. ఆపై సెప్టెంబరు 18న మరో ముహూర్తం నిర్ణయించినా, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి కరోనా సోకడంతో అది కూడా వాయిదా వేశారు.ఈ నేపథ్యంలోనే తాజా ముహూర్తం ఖరారు చేశారు. కాగా, అధికారిక ప్రారంభోత్సవం జరుపకపోయినా, ట్రాఫిక్ ను దృష్టిలో ఉంచుకుని ఫ్లైఓవర్ పై రాకపోకలను ఇప్పటికే అనుమతించారు.
* రెండు ఎమ్మెల్సీ పట్టభద్ర స్థానాల్లోనూ తెరాసదే గెలుపు అని తెలంగాణ ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఆరు జిల్లాల పార్టీ ప్రజాప్రతినిధులతో కేసీఆర్ నిర్వహించిన సమావేశం ముగిసింది. ఎల్ఆర్ఎస్పై ప్రజలు ఏమనుకుంటున్నారో నాయకుల వద్ద సీఎం కేసీఆర్ ఆరా తీశారు. ఎల్ఆర్ఎస్పై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని సీఎంకు నేతలు తెలిపారు. నిరుద్యోగులు, యువకులు తెరాసకు వ్యతిరేకమన్న ప్రచారం తిప్పికొట్టాలని కేసీఆర్ సూచించారు.
* హాథ్రస్ పర్యటనలో భాగంగా ఐదుగురు కాంగ్రెస్ నాయకుల బృందం బాధితుల స్వగ్రామమైన బూల్‌గదికి చేరుకుంది. ముందుగా కాంగ్రెస్ అగ్రనాయకులు రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలు బాధిత కుటుంబాన్ని కలిసి వారిని పరామర్శించారు. ఘటన గురించి బాధితురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడి పరిస్థితి తెలుసుకున్నారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వీరి రాక నేపథ్యంలో భారీ సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు గ్రామం వెలుపల మోహరించారు.
* కరోనా వైరస్, లాక్డౌన్ కారణంగా చిత్ర పరిశ్రమ తీవ్రంగా నష్టపోయిన సంగతి తెలిసిందే. చిత్రీకరణ పూర్తి చేసుకున్న సినిమాలు విడుదల కాకపోగా, కొత్త సినిమాల షూటింగ్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.మరోవైపు థియేటర్లను కూడా తెరిచేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సినిమాకు 5 లక్షల కంటే ఎక్కువ తీసుకునేవారి పారితోషికంలో 20శాతం తగ్గింపు విధించాలని యాక్టివ్ తెలుగు సినీ నిర్మాత గిల్డ్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా)తో ఒప్పందం చేసుకుంది.
* ఐపీఎల్ లీగ్ మ్యాచుల్లో మరో ఆసక్తికరమైన పోరు జరుగుతోంది. షార్జా వేదికగా దిల్లీ, కోల్‌కతా జట్లు పదహారో లీగ్ మ్యాచ్‌లో తలపడుతున్నాయి. టాస్ గెలిచిన కోల్‌కతా ఫీల్డింగ్ ఎంచుకుంది. దిల్లీ బ్యాట్స్ మెన్ దూకుడుగా ఆడుతున్నారు.
* దేశంలోని రైతులకు నూతన వ్యవసాయ చట్టాలు బంగారు బాటలు వేస్తాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రధాని మోదీ పనిచేస్తుంటే ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దశాబ్దాలుగా రైతుల జీవితాలు దళారుల చేతుల్లో నిర్వీర్యం అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సంక్షేమం కోసమే కేంద్రం నూతన వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చిందని తెలిపారు.
* విరాట్ కోహ్లీ (72*; 53 బంతుల్లో; 7×4, 2×6) కళాత్మక ఇన్నింగ్స్‌కు దేవదత్ పడిక్కల్ (63; 45 బంతుల్లో, 6×4, 1×6) దూకుడు తోడవ్వడంతో బెంగళూరు ఖాతాలో మరో విజయం నమోదైంది. శనివారం అబుదాబి వేదికగా జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌పై కోహ్లీసేన ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన రాజస్థాన్.. చాహల్ ధాటికి (3/24) నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 154 పరుగులు చేసింది. మహిపాల్ (47; 39 బంతుల్లో, 1×4; 3×6) రాణించాడు.
* కరోనాపై పోరాడేందుకు తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చారు. ‘ఏపీ ఫైట్స్ కరోనా’ వెబ్‌సైట్‌ను చంద్రబాబు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సమస్యల పరిష్కారమే ప్రధానోద్దేశమని చెప్పారు. వెబ్సైట్లో ప్రజలు నమోదు చేసుకుని ప్రజాగళం వినిపించాలని సూచించారు. కరోనాకు సంబంధించి ఎలాంటి కష్ట నష్టాలైనా తెలపవచ్చన్నారు. స్వచ్ఛంద కార్యకర్తలు ఎవరైనా వేదికను సద్వినియోగం చేసుకోవచ్చని తెలిపారు.
* భారత వైమానిక దళంలో సరికొత్తగా చేరిన ప్రతిష్ఠాత్మక రఫేల్ యుద్ధ విమానాలు త్వరలోనే ప్రజాసందర్శనకు రానున్నాయి. అక్టోబరు 8న వాయుసేన దినోత్సవం సందర్భంగా నిర్వహించే పరేడ్‌లో రఫేల్ విమానాలు పాల్గొననున్నాయి. ఈ మేరకు ఐఏఎఫ్ ట్విటర్ ద్వారా వెల్లడించింది. ఉత్తరప్రదేశ్‌లోని హిందాన్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో జరిగే వైమానికదళ 88వ వార్షికోత్సవ పరేడ్‌లో రఫేల్ విమానాలు విన్యాసాలు చేయనున్నట్లు ఐఏఎఫ్ తెలిపింది.
* విజయనగరం జిల్లా గంట్యాడలో 20 మంది విద్యార్థులకు కరోనాపై ఆంధ్రప్రదేశ్ వైద్య శాఖ మంత్రి ఆళ్ల నాని స్పందించారు. జిల్లా కలెక్టర్ హరి జవహర్‌లాల్‌తో మంత్రి నాని ఫోన్లో మాట్లాడారు. తక్షణమే 20 మంది విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా కరోనా పరీక్షలు చేయాలని చెప్పారు. లక్షణాలు లేకపోతే విద్యార్థులను హోంక్వారంటైన్లో ఉంచాలని పేర్కొన్నారు. విద్యార్థుల ఆరోగ్యంపై రోజూ ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని తెలిపారు.
* ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రస్లో 19 ఏళ్ల దళిత యువతిపై అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. చికిత్స పొందుతూ యువతి మృతిచెందిన అనంతరం గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భారీగా మోహరించిన పోలీసులు రెండురోజులుగా గ్రామంలోకి ఎవరినీ అనుమతించడం లేదు. బాధితురాలి వదిన మీడియాతో మాట్లాడుతూ.. ‘పోలీసులు ఎవరి మృతదేహాన్ని ఖననం చేశారో ముందుగా స్పష్టం చేయాలి. మాకు ఆమెను చూపించలేదు’ అని వెల్లడించారు.