Business

గూగుల్‌తో పోటీకి సై అంటున్న పేటీఎం-వాణిజ్యం

గూగుల్‌తో పోటీకి సై అంటున్న పేటీఎం-వాణిజ్యం

* ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ సరికొత్త రికార్డు సృష్టించారు. ఫోర్బ్స్‌ భారత అత్యంత సంపన్నుల జాబితాలో వరుసగా 13వ సారి అగ్రస్థానంలో నిలిచారు. ఫోర్బ్స్‌ 2020 సంవత్సరానికి గానూ దేశంలో అత్యంత సంపన్నులైన 100 మంది జాబితాను గురువారం విడుదల చేసింది. ఆ వివరాల ప్రకారం.. ‘కరోనా కారణంగా ఈ ఏడాది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఒడుదొడుకులను ఎదుర్కొన్నప్పటికీ భారత కుబేరులు మాత్రం తమ సంపదని రక్షించుకున్నారు. కాగా ఆ వంద మంది సంపన్నుల సంపద విలువ 14శాతం పెరిగి 517.5 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది’ అని పేర్కొంది.

* దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ మరో కంపెనీని కొనుగోలు చేసింది. డిజిటల్‌ కస్టమర్‌ ఎక్స్‌పీరియన్స్‌ సంస్థ బ్లూ అకార్న్‌ ఐసీఐను రూ.915 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. ఇన్ఫోసిస్‌ కస్టమర్‌ ఎక్స్‌పీరియన్స్‌లో పూర్తి స్థాయి సేవలు అందించేందుకు ఈ డీల్‌ సహకరించనుంది. దీంతోపాటు ఇన్ఫీ తన వినియోగదారులు డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ను ముందుకు తీసుకెళ్లడానికి ఉపయోగపడుతుంది.

* గూగుల్‌తో వివాదం నేపథ్యంలో మినీ యాప్‌స్టోర్‌ ప్రారంభించిన పేటీఎం మరో ముందడుగు వేసింది. తమ మినీ యాప్‌స్టోర్‌ వేదికగా పది లక్షల యాప్స్‌ను తీసుకురావడమే లక్ష్యమని ప్రకటించింది. ఇందుకోసం రూ.10 కోట్లు వెచ్చించనున్నట్లు వెల్లడించింది. గురువారం యాప్‌ డెవలపర్లతో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయాలను ప్రకటించింది. ఈ సందర్భంగా పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్‌ శేఖర్‌ శర్మ మాట్లాడుతూ.. గూగుల్‌ ఏకపక్షంగా వ్యవహరిస్తోందన్నారు. 30 శాతం ఫీజు వసూలు చేస్తూ టోల్‌ కలెక్టర్‌గా వ్యవహరిస్తోందని ఆరోపించారు. అందుకే యాప్‌ డెవలపర్ల కోసం మినీ యాప్‌ స్టోర్‌ తీసుకొచ్చామని చెప్పారు. దీనిలో 10 లక్షల యాప్‌లను అందుబాటులో ఉంచడమే లక్ష్యమని వివరించారు. దేశీయ టెక్నాలజీ ఎకో సిస్టమ్‌ను ఏర్పాటుకు తమ కంపెనీ కట్టుబడి ఉందని చెప్పారు. ఇప్పటికే తమ మినీ స్టోర్‌లో 300పైగా యాప్స్‌ అందుబాటులో ఉన్నాయని చెప్పారు. డెకథ్లాన్‌, డొమినోస్‌ పిజ్జా, ఫ్రెష్‌ మెనూ, నెట్‌మెడ్స్‌, నోబ్రోకర్‌, ఓలా వంటి యాప్స్‌ అందుబాటులోకి వచ్చినట్లు తెలిపారు.

* ఎంజీ మోటార్స్‌ భారత్‌లో తొలి అటానమస్‌ లెవల్‌-1 కారును మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఎంజీ గ్లోస్టెర్‌ పేరుతో విడుదల చేసిన ఈ ఎస్‌యూవీ దిల్లీ ఎక్స్‌షోరూం ధర రూ.28.98లక్షలు నుంచి రూ.35.38 లక్షల మధ్య ఉంటుంది. ప్రారంభ ఆఫర్‌ కింద తొలి రెండు వేల మంది కస్టమర్లకు మాత్రమే ఈ ధరలో లభించనుంది. ఇప్పటికే ఈ కారు బుకింగ్స్‌ మొదలయ్యాయి. రూ.1లక్ష టోకెన్‌ మొత్తం కింద చెల్లించి దీనిని ఆన్‌లైన్‌లో లేదా డీలర్‌ వద్ద బుక్‌ చేసుకోవచ్చు.

* ఇప్పటి వరకు స్వల్ప, మధ్యస్థ లక్షణాలు ఉన్న కొవిడ్‌ రోగులకు వినియోగిస్తున్న ఫావిపిరవిర్‌ యాంటీ వైరల్‌ ఔషధం ఇంజెక్షన్‌ రూపంలో వచ్చే అవకాశం ఉంది. భారత్‌లో ఇప్పటికే కొవిడ్‌ చికిత్సలో అత్యధికంగా అమ్ముడుపోతున్న ఔషధంగా ఇది నిలిచింది. ఇప్పుడు దీనిని రోగులు మరింత సౌకర్య వంతంగా తీసుకొనేలా చేసేందుకు హైదరాబాద్‌కు చెందిన హెటిరో గ్రూప్‌ కృషి చేస్తోంది. దీనిలో భాగంగా ఇంజెక్షన్‌ రూపంలో ఫావిపిరవిర్‌ ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది.