Fashion

సిగరెట్ మానేయడానికి ఇది సరైన సమయం

సిగరెట్ మానేయడానికి ఇది సరైన సమయం

ధూమపానానికి దూరం కావాలనుకునే వారు ఎప్పుడూ ఉంటారు. అయితే వారిలో కొద్ది మందే అందులో విజయం సాధిస్తారు. ప్రపంచ ప్రజలకు వణికిస్తోన్న కోవిడ్‌ మహమ్మారి బారిన పడిన వారిలో తీవ్ర అస్వస్థతకు గురవుతోన్నది, బాధ పడుతోన్నది ధూమపాన ప్రియులని తేలడంతో ఇప్పుడు వారిలో ఎక్కువ మంది ధూమపానానికి స్వస్తి చెప్పాలనుకుంటున్నారు. అలాంటి వారు విజయం సాధించాలంటే ఇంతకంటే మంచి తరుణం మరోటి ఉండదని వైద్య నిపుణులే చెబుతున్నారు. కోవిడ్‌ దండయాత్రకు ముందు ధూమపానానికి దూరం కావాలనుకున్న వారి సంఖ్య అమెరికా, ఆస్ట్రేలియా స్మోకర్లలో పది శాతం మందికాగా, ఇప్పుడు వారి సంఖ్య 19 నుంచి 29 శాతానికి చేరుకున్నట్లు ‘అడిక్షన్‌ మెడిసిన్‌’ జర్నల్‌ తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో తేలింది. ధూమపానానికి స్వస్తి చెప్పడం ద్వారా కోవిడ్‌ ముప్పుకు దూరం కావాలనుకుంటున్న వారి సంఖ్య కూడా గణనీయంగానే ఉందని, ధూమపానం వల్ల కలిగే నష్టాల గురించి ఎప్పటికప్పుడు తెలసుకోవాలనుకుంటున్నవారు కూడా తాము అభిప్రాయలు కోరిన స్మోకర్లలో 45 శాతం మంది ఉన్నారని ఆ సర్వే తెలిపింది. ఇలాంటి సమాచారం తెలసుకోవాలనుకుంటోన్న వారిలో ఎక్కువ మంది, అంటే 61 శాతం మంది టీవీ మీడియంనే కోరుకుంటున్నారు. ఇక ఆన్‌లైన్‌ మీడియా ద్వారా 36 శాతం మంది, సోషల్‌ మీడియా ద్వారా 31 శాతం, ఈ మెయిల్‌ ద్వారా 31 శాతం మంది కోరుకుంటున్నారు. ధూమపానానికి స్వస్తి చెప్పేందుకు తమకు సహకరించాలని, ఈ విషయంలో నికోటిన్‌ ప్రత్యామ్నాయ థెరపిని సూచించాలని 61 శాతం స్మోకర్లు కోరుతున్నారని సర్వేలో తేలింది. ధూమపాన వ్యతిరేక ప్రచారం, పొగాకు ఉత్పత్తులపై అధిక పన్నుల విధింపు, పరిమిత ప్రాంతాలకే ధూమపానాన్ని కట్టడి చేసే చట్టాల వల్ల ఆస్ట్రేలియాలో ధూమపాన ప్రియుల సంఖ్య 11 శాతానికి పడిపోంది. ఈ దురలవాటు వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా 80 లక్షల మంది మత్యువాత పడుతున్నారు.