WorldWonders

అక్కడ హై హీల్స్ వేసుకుంటే జైలులో పెడతారు

Strange Rules Across Globe - High Heels Ban

***మనది ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ చాలా విషయాల్లో స్వేచ్ఛ ఉంటుంది. కానీ, మన దేశంలో సర్వసాధారణమైన కొన్ని విషయాలను ప్రపంచంలోని పలు దేశాల్లో నేరంగా భావిస్తారు. వాటిపై చట్టాలు తీసుకొచ్చి ఉల్లంఘించిన వారిపై జరిమానాలు విధిస్తున్నారు. విస్తుపోయే ఆ చట్టాలేవో ఓ సారి చూద్దాం పదండి..
**లావెక్కారో.. ఇక అంతే.
జపాన్‌లో ప్రజలు వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎంతో నియమనిబద్ధతతో ఉంటారు. సమయపాలన పాటిస్తూ.. ఆరోగ్యకరమైన భోజనం చేస్తుంటారు. నిత్యం వ్యాయామం చేస్తూ చాలా ఫిట్‌గా ఉంటారు. కానీ, పాశ్చత్యదేశాల ఫాస్ట్‌ఫుడ్‌ సంస్కృతి జపాన్‌లోనూ విస్తరించడంతో తమ దేశ ప్రజలు కూడా లావెక్కుతున్నారని భావించిన జపాన్‌ ప్రభుత్వం.. 2008లో ‘మెటబో లా’ పేరుతో ఓ చట్టం తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం దేశంలోని 40-75ఏళ్ల వయసున్న ప్రజలు లావెక్కుండా జాగ్రత్త పడాలి. ఏటా వారికి ప్రభుత్వ అనుమతితో కొన్ని ప్రైవేటు సంస్థలు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తాయి. ఈ సందర్భంగా పొట్టభాగంలో కొలతలు తీసుకుంటారు. పురుషుల పొట్ట 33.5 అంగుళాలు, మహిళల పొట్ట 35.5 అంగుళాలు మించకుండా ఉండాలి. ఎవరైనా ఆ కొలతలు మించి ఉన్నారంటే వారిని బరువు తగ్గించుకునే ప్రత్యేక కార్యక్రమాల్లో చేరుస్తారు. శరీర బరువు, వాటి ప్రభావాలపై కౌన్సెలింగ్‌ ఇస్తారు. ప్రజలకు జరిమానా ఉండదు. కానీ, నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోలేకపోతే సంస్థలకు ప్రభుత్వం జరిమానా విధిస్తుంది.
**బయట ఆరేస్తే ఫైన్‌ కట్టాల్సిందే.
మన దేశంలో దుస్తులు ఉతికేసి ఇంటి బయట, ఖాళీ స్థలంలో ఆరేస్తుంటాం. మనం ఆరేసిన దుస్తులు బయటవాళ్లకు కనిపిస్తుంటాయి. ఇక్కడ ఇదేం పెద్ద విషయం కాకపోవచ్చు. కానీ, కరేబియన్‌ ప్రాంతంలోని ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో ఐలాండ్‌లో మాత్రం ఆరు బయట ఇలా దుస్తులు ఆరేయడం నిషేధం. బయట వ్యక్తులకు కనిపించేలా వీధుల్లో వస్త్రాలు ఆరేస్తే అక్కడి చట్టాల ప్రకారం నేరంగా పరిగణిస్తారు. ఈ నేరానికి 200 డాలర్లు జరిమానా కట్టాల్సి ఉంటుంది. లేదా నెల రోజులు జైలు శిక్ష అనుభవించాలి.
**అలాంటి హోర్డింగ్స్‌ ఉండవు..
ఉన్నా ఏ సంస్థ అయినా అభివృద్ధి చెందాలంటే ప్రచారం అవసరం. అందుకే ఎక్కడపడితే అక్కడ రోడ్ల పక్కన భారీ హోర్డింగ్స్‌పై ప్రచార చిత్రాలు దర్శనిమిస్తుంటాయి. అదే యూఎస్‌లోని అలస్కా, హవాయి, మైనే, వెర్మోంట్‌ రాష్ట్రాల్లో హోర్డింగ్‌లను నిషేధించారు. కేవలం దారి చూపించే మ్యాప్‌లు, ల్యాండ్‌ మార్క్‌లు, రియల్‌ ఎస్టేట్‌కి సంబంధించిన చిత్రాలు మాత్రమే హోర్డింగ్స్‌పై కనిపిస్తాయి. మరే ఇతర సంస్థలకు చెందిన హోర్డింగ్స్‌ను ప్రదర్శించకూడదు. అయితే సొంత స్థలం ఉంటే అందులో హోర్డింగ్స్‌ పెట్టుకోవచ్చట.
**జ్యోతిషం చెప్పకూడదు
జ్యోతిషాన్ని కొందరు నమ్ముతారు.. మరికొందరికి పెద్దగా దానిపై పట్టింపులు ఉండవు. నమ్మకం ఉన్నవారు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టే జ్యోతిష కేంద్రాలు మన దేశంలో విరివిగా కనిపిస్తుంటాయి. వివిధ దేశాల్లో వివిధ రూపాల్లో జ్యోతిషం చెబుతుంటారు. అయితే యూఎస్‌లోని మేరీలాండ్‌లో మాత్రం జ్యోతిషం చెప్పడం నిషేధమట. అది ఎంత వరకు అమలువుతుందో తెలియదు గానీ, ఎవరైనా జ్యోతిషం చెబుతూ పట్టుబడితే కనీసం 500 డాలర్లు జరిమానా లేదా ఏడాదిపాటు జైలు శిక్ష విధిస్తారట.
**గేటు తెరిచే వాళ్లే మూయాలి
మనలో చాలామందికి గేట్లు తెరవడమే గానీ మూసేసే అలవాటు ఏమాత్రం ఉండదు. అందుకే ఇంటి గేట్లపై చాలామంది ‘ప్లీజ్‌ క్లోజ్‌ ది గేట్‌’ అని బోర్డులు పెడుతుంటారు. అయినా ఆలసత్వం వహిస్తుంటారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉండేదే. అయితే, యూస్‌లోని నెవాడా రాష్ట్రంలో గేటు తెరిచి మూసివేయకపోతే నేరం. ఇది నగరాల్లో ఉండే ఇళ్లకు, ఆఫీసులకు వర్తించదు. పొలాలు, కంచెలు వేసిన ఖాళీ స్థలాలు వంటి ప్రాంతాల్లో గేట్లను తెరిచి మూసివేయకపోతే నేరం చేసినట్లే. దీనికి న్యాయమూర్తి నిర్ణయం ఆధారంగా జరిమానా లేదా జైలు శిక్ష విధిస్తారు.
**వాళ్లకు ఒక్క గ్లాస్‌ మాత్రమే
పాశ్చాత్య దేశాల్లో పురుషులతో సమానంగా కొందరు మహిళలు మద్యం తాగుతుంటారు. అయితే దక్షిణ అమెరికాలోని బొలివియా దేశ రాజధాని లా పజ్‌ నగరంలో వివాహిత మహిళలు కేవలం ఒక్క గ్లాస్‌ మద్యం మాత్రమే తాగాలని చట్టం తీసుకొచ్చారు. ఎక్కువ మద్యం తాగడం వల్ల మహిళలు హద్దులు దాటి ప్రవర్తించే అవకాశం ఉందని ఈ చట్టాన్ని తీసుకొచ్చారట. మహిళలు ఎవరైనా ఒక్క గ్లాస్‌ కన్నా ఎక్కువ తాగితే ఈ కారణం చూపించి భర్త ఆమెకు విడాకులు ఇవ్వొచ్చని చట్టంలో పేర్కొన్నారు. అయితే ఈ చట్టంపై అక్కడ తీవ్ర వ్యతిరేకత ఉంది. ప్రస్తుతం ఈ చట్టం సరిగా అమలు కావట్లేదనే చెప్పాలి.
**మనం గాలిపటాలు ఎగరేస్తే సరదా.. వాళ్లు ఎగరేస్తే నేరం
సంక్రాంతి పండగంటేనే గాలిపటాల వేడుక. పండగకు నెల రోజుల ముందు నుంచే పిల్లలు, పెద్దలు గాలిపటాలు ఎగరేస్తుంటారు. ఇంటి మేడ మీద, ఇంటి ముందు, పార్కులు, పాఠశాల గ్రౌండ్స్‌ ఇలా ఎక్కడ వీలు ఉంటే అక్కడ గాలిపటాలు ఎగరేసి సంబరాలు చేసుకుంటాం. వివిధ దేశాల్లోనూ ఈ గాలిపటాలు ఎగరేసే సంస్కృతి ఉంది. అయితే ఆస్ట్రేలియాలోని విక్టోరియా ప్రాంతంలో గాలిపటాలు ఎగరవేయడం నిషేధం. 1966లోనే ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. ఎవరైనా పార్కులు, గ్రౌండ్స్‌, మార్కెట్‌ తదితర ప్రాంతాల్లో గాలిపటాలు ఎగరేస్తే వారికి జరిమానా విధిస్తారు. ఆ జరిమానా 165 డాలర్ల నుంచి 826 డాలర్ల వరకు ఉంటుంది.
**శునకాన్ని నడకకు తీసుకెళ్లాల్సిందే
పెంపుడు జంతువుల్లో మనుషులకు బాగా దగ్గరయ్యేవి శునకాలే. అలాంటప్పుడు మన ఆరోగ్యంతోపాటు వాటి ఆరోగ్యం గురించి కూడా ఆలోచించాలి. అందుకే శునకాల్ని పెంచుకునేవాళ్లు.. వాటిని ఉదయం లేదా సాయంత్రపు నడకకు తీసుకెళ్తుంటారు. అయితే దీన్ని ఇటలీలో చట్టంగా మార్చారు. ముఖ్యంగా రోమ్‌ నగరంలోని శునకాల యజమానులు వాటిని కనీసం రోజులో ఒక్కసారైనా బయట నడకకు తీసుకెళ్లాలని స్పష్టం చేశారు. ఎవరైనా అలా చేయని పక్షంలో కనీసం 625 డాలర్ల జరిమానా విధిస్తారు. ఇలాంటి చట్టాన్నే జర్మనీ ప్రభుత్వం కూడా అమలు చేయాలని యోచిస్తోంది. రోమ్‌లోని చారిత్రక కట్టాలను సందర్శించినప్పుడు అక్కడ మెట్లపై కూర్చోవడం కూడా నిషేధమట.
**అక్కడ హై హీల్స్‌కు నో..
అమ్మాయిలు బయటకు వెళ్లినప్పుడు ఎక్కువగా హైహీల్స్‌ వేసుకొని వెళ్తుంటారు. కానీ, గ్రీస్‌లో ఆక్రోపొలిస్‌ కోట ప్రాంతంలో హైహీల్స్‌ వేసుకోవడం నిషేధం. అక్కడ హైహీల్స్‌ వేసుకొని నడిస్తే కట్టాడాలు దెబ్బతినే అవకాశముందని, నేలపై మట్టి హై హీల్స్‌కు అంటుకొని ఇతర ప్రాంతాలు అపరిశుభ్రం అయ్యే అవకాశం ఉందని ఈ చట్టం తీసుకొచ్చారట.
**పావురాలకు ఆహారం ఇవ్వొద్దు
ఎక్కడైనా పావురాల గుంపు కనిపిస్తే ధాన్యాలను ఆహారంగా అందిస్తుంటాం. కొన్ని సందర్శక ప్రాంతాల్లో పావురాలకు ఆహారం ఇవ్వడానికి ప్రత్యేక చోటు, ధాన్యాలు అమ్మే దుకాణాలు ఉంటాయి. కానీ పర్యాటక ప్రాంతాల్లో మొదట వరసలో ఉండే వెనిస్‌లో మాత్రం పావురాలకు ఆహారం ఇవ్వడం నిషేధం. ఎవరైనా అలా పావురాలకు ఆహారం పెడుతూ పట్టుబడితే 700 డాలర్లు జరిమానా విధిస్తారట.
**రేడియోల్లో కెనడా సంగీతానికి రిజర్వేషన్‌
రేడియో స్టేషన్‌ నిర్వాహకులు నిత్యం శ్రోతలకు నచ్చే ఎన్నో పాటలు వినిపిస్తుంటారు. అయితే, కెనడాలోని రేడియోల్లో వినిపించే పాటల్లో రిజర్వేషన్‌ ఉంటుంది. అక్కడి రేడియోల్లో కనీసం 40శాతం కెనడా సంగీతకళాకారులు రూపొందించిన పాటల్ని మాత్రమే వినిపించాల్సి ఉంటుంది.
**చూయింగ్‌ గమ్‌ నమిలినా నేరమే.. ఇప్పుడు కాదులెండి.
సింగపూర్‌లో 1992లో ప్రజలు చూయింగ్‌ గమ్‌ను నమలడం నిషేధించారు. చికిత్సలో భాగంగా ఎవరికైనా అవసరమైతే వైద్యులు సూచించిన వారికే వాటిని అమ్మేవారు. ప్రస్తుతం చూయింగ్‌ గమ్‌ నమలడం నేరమేం కాదు. అయితే వీటిని కేవలం దిగుమతి చేసుకునే విక్రయించాల్సి ఉంటుంది.