Fashion

షాంపూ మూలాలు మనవే

షాంపూ మూలాలు మనవే

షాంపూ భారత్‌లోనే పుట్టి విదేశాలకు పాకింది. మెల్లిమెల్లిగా షాంపూ గురించి యావత్ ప్రపంచానికి తెలియడం ప్రారంభమైంది. 1900ల్లో షాంపూ వాడకం ఎక్కువైంది…
** వెంట్రుకలకు జిడ్డు అంటిందా?
వెంటనే షాంపూ పెట్టి రుద్దేస్తాం. అది చూసిన పెద్దలు.. షాంపూ గట్రా ఎందుకురా? కుంకుడుకాయతో తలంటి స్నానం చేయు.. అని చెబుతుంటారు. పైగా, వాటితో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని వారి వాదన. షాంపూ అనేది పాశ్చాత్య సంస్కృతి వల్ల భారత్‌లోకి చేరిందని వారి భావన. ఎందుకంటే మార్కెట్‌లో లభించే అన్ని బ్రాండ్ల షాంపూలు విదేశీ కంపెనీలవే. పాశ్చాత్య ముద్ర పడిన షాంపూకు మూలాలు ఎక్కడివో తెలుసా? తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే.. షాంపూ పుట్టిందే భారత్‌లోనే. షాంపూ విదేశాల నుంచి భారత్‌లోకి పాకిందని మనం అనుకుంటున్నా.. మన దేశంలో పుట్టి విదేశాలకు పాకింది.
**అసలు.. షాంపూ అనే పదం ఎలా వచ్చిందో తెలుసా? చంపు అనే హిందీ పదం నుంచి వచ్చిందే షాంపూ. సంస్కృత పదం ‘చప్యాతి’ నుంచి ఇది ఉద్భవించింది. దీనికి ‘మసాజ్’ అని అర్థం. క్రీస్తు శకం 1500 సంవత్సరంలోనే భారత్‌లో షాంపూ వాడకం ప్రారంభమైంది. అప్పటికి ప్రపంచానికి షాంపూ అంటే ఏంటో తెలీదు. ఉడకబెట్టిన కుంకుడుకాయలు, ఉసిరి, మందారం, శికకాయ్, తదితర మూలకాలతో తయారు చేసిన పేస్టును మన దేశంలో షాంపూలా వాడేవారు. కుదుళ్లు ఆరోగ్యంగా ఉండేందుకు, మాడు నొప్పి నుంచి ఉపశమనానికి వీటిని ఉపయోగించేవాళ్లు. ఇప్పటికీ అమ్మమ్మ, నానమ్మ వయసున్న చాలా మంది ఇలాంటి పద్ధతినే వాడుతున్నారు.
***మరి షాంపూ ఎప్పుడు దేశం దాటింది?
షేక్ డీన్ మహ్మద్.. ఇతడు పట్నా(బిహార్)లోని క్షురకుల వర్గానికి చెందినవాడు. 1759లో జన్మించాడు. చిన్నపటి నుంచే హెర్బల్ షాంపూల తయారీ పద్ధతులను నేర్చుకున్నాడు. సెలూన్‌కు వచ్చినవాళ్లకు హెడ్ మసాజ్ చేయడం, షాంపూతో కుదుళ్లకు స్నానం చేయించడం లాంటివి చేసేవాడు. 1800 సంవత్సరంలో పొట్టకూటికి కుటుంబంతో సహా ఇంగ్లండ్‌కు వలస వెళ్లాడు. అక్కడి బ్రైటన్‌లో ‘మహ్మద్ బాత్స్’ పేరుతో స్పా తెరిచి హెడ్ మసాజ్‌లు చేయడం మొదలు పెట్టాడు. అనతి కాలంలోనే అతడి పేరు మార్మోగిపోయింది. అలా.. అలా.. ఇతడి పేరు కింగ్ జార్జ్-4 చెవిన పడింది. దీంతో అతడ్ని తన వ్యక్తిగత షాంపూ సర్జన్‌గా నియమించుకున్నాడు. కింగ్ విలియం-4కు కూడా షాంపూ సర్జన్‌గా పనిచేశాడు. హెడ్ మసాజ్‌లకు పెట్టింది పేరుగా మనోడిని అక్కడి పత్రికలు, జర్నల్స్‌లో వేనోళ్ల పొగిడారు. ‘సన్ రూమ్’ పేరుతో ఎండలో మసాజ్ చేయడం ప్రారంభించాడు.
*తన పాపులారిటీ ఎంతలా పెరిగిందంటే.. ఆస్పత్రుల్లో రోగులకు తన షాంపూను, దాని తయారీ పద్ధతులను నేర్పించాడు. అతడు ‘షాంపూయింగ్, ఆర్ బెనిఫిట్స్ రిజల్టింగ్ ఫ్రమ్ ద యూజ్ ఆఫ్ ఇండియన్ మెడికేటెడ్ వేపర్ బాత్’ పేరుతో ఒక పుస్తకాన్ని కూడా రాశాడు. మెల్లిమెల్లిగా షాంపూ గురించి ప్రపంచానికి తెలియడం ప్రారంభమైంది. 1900ల్లో షాంపూ వాడకం ఎక్కువైంది.
*భారత్‌లో చిన్న ప్యాక్ షాంపూలను తయారు చేసిన కంపెనీగా ‘చిక్’ నిలిచింది. ఆ కంపెనీ ప్రారంభించిన ఉత్పత్తులతో షాంపూ.. దేశ నలుమూలలా వ్యాపించింది. ప్రస్తుతం ప్రపంచం షాంపూను విరివిగా ఉపయోగిస్తుందంటే దానికి కారణం.. మహ్మద్ ఆవిష్కరణలే.