కొవిడ్-19 ప్రభావంతో ఆన్లైన్ వినియోగం బాగా పెరిగిపోయింది. విద్యార్థుల పాఠాల నుంచి ఆఫీస్ సమావేశాల వరకు అన్ని ఆన్లైన్లోనే. దీంతో ఆన్లైన్ క్లాసులు, సమావేశాలు నిర్వహించుకునేందుకు ఎన్నో రకాల యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా జూమ్ యాప్ తర్వాత ఎక్కువ మంది ఉపయోగిస్తుంది గూగుల్ మీట్. ఇందులో 100 మందితో సమావేశం నిర్వహించుకోవచ్చు. అలానే ఒకే సారి 49 మందిని చూడొచ్చు. తాజాగా గూగుల్ మీట్ ఫీచర్ ఆన్లైన్ క్లాసుల కోసం మరింత సౌకర్యవంతంగా మారుస్తూ కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. బ్రేక్అవుట్ రూమ్స్ (Breakout Rooms)గా పిలిచే ఈ ఫీచర్ ద్వారా ఆన్లైన్లో క్లాసులు చెప్పేవారు విద్యార్థులను గ్రూపులుగా విభిజించవచ్చు.
ఇందులో ముందుగా గూగుల్ కొంత మందిని కొన్ని గ్రూపులుగా విభజిస్తుంది. తర్వాత నిర్వాహకులు తమకు నచ్చిన వారిని ఆ గ్రూపులలో యాడ్ చేసుకోవచ్చు. దీని ద్వారా టీచర్స్, ఎడ్యుకేటర్స్ ఎక్కువ మంది విద్యార్థులతో ప్రాజెక్ట్ వర్క్, చర్చలు వంటి వాటి నిర్వహణ సమయంలో సులభంగా కమ్యూనికేట్ చేయ్యొచ్చు.
అలానే ఒకే కాల్లో పాల్గొనే విద్యార్థులను 100 గ్రూపులుగా విభజించుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ జీ సూట్ ఎంటర్ప్రైజ్ కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే అందరికీ అందబాటులోకి రానుంది. అలానే రాబోయే రోజుల్లో ఇందులో టైమర్ (Timer), సహాయం కోరడం (Ask For Help) వంటి ఆప్షన్స్‌ని తీసురానున్నట్లు గూగుల్ తెలిపింది. ఇప్పటికే గూగుల్ మీట్ యాప్‌ను ఆన్లైన్ క్లాసులు, సమావేశాలు నిర్వహించేందుకు మరింత సమర్థంగా మారుస్తూ డిజిటల్ వైట్ బోర్డ్, అటెండెన్స్ షీట్, క్వశ్చన్&ఆన్సర్, పోలింగ్ వంటి ఫీచర్స్‌ని తీసుకొచ్చింది. తాజా ఫీచర్‌తో మరింత మంది ఆన్లైన్ క్లాసులో పాల్గొనేలా ప్రోత్సహించవచ్చని టెక్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.