కరోనా వైరస్‌ను అత్యంత వేగంగా గుర్తించగలిగే సాంకేతికతను బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. కేవలం ఐదు నిమిషాల్లోపే వైరస్‌ను నిర్ధారించే ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టును రూపొందించినట్లు వెల్లడించారు. రద్దీ ఎక్కువగా ఉండే ఎయిర్‌పోర్ట్, వాణిజ్య కార్యకలాపాలు జరిగే ప్రాంతాల్లో భారీ స్థాయిలో కొవిడ్ టెస్టులు జరిపేందుకు ఇది ఎంతో దోహదపడుతుందని తెలిపారు. అయితే, ఈ పరికరాన్ని 2021 ప్రారంభంలో తయారు చేస్తామని, దీన్ని ఆమోదించిన అనంతరం ఆరు నెలల తర్వాత విస్తృతంగా అందుబాటులోకి తీసుకొస్తామని ఆక్స్‌ఫర్డ్ పరిశోధకులు పేర్కొన్నారు. ఈ విధానంలో ఇతర వైరస్‌లను వేరుచేస్తూ కరోనా వైరస్‌ను అత్యంత కచ్చితంగా గుర్తించగలదని శాస్త్రవేత్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీంతో అత్యంత తేలికగా, వేగంగా, తక్కువ ఖర్చుతో కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయవచ్చని ఆక్స్‌ఫర్డ్‌లో భౌతికశాస్త్ర విభాగానికి చెందిన ప్రొఫెసర్ అచిల్లెస్ కపనిడీస్ స్పష్టంచేశారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో కొవిడ్ నిర్ధారణ పరీక్షలు ఎంతో కీలకమనే విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆర్‌టీ-పీసీఆర్ విధానంలో కచ్చితంగా గుర్తిస్తున్నప్పటికీ, పరీక్షలకు సమయంతోపాటు ఖర్చుకూడా ఎక్కువగా ఉంటోంది. దీంతో ఇప్పటికే కొన్ని ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులు చేసే పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. అయితే, వీటిలో కరోనావైరస్‌ను గుర్తించే కచ్చితత్వంలో తేడాలుంటున్నాయి. దీంతో అత్యంత వేగంగా, కచ్చితమైన ఫలితమిచ్చే ర్యాపిడ్ టెస్టు కోసం ప్రపంచవ్యాప్తంగా ముమ్మర పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే, వచ్చే ఏడాది నాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినప్పటికీ వైరస్‌తోనే కలిసి జీవించాల్సి ఉంటుందని అంతర్జాతీయ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ సమయంలో కరోనా వైరస్ వేగంగా గుర్తించడంలో ర్యాపిడ్ టెస్టులు ఎంతో కీలకమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలాఉంటే, కరోనా వైరస్‌ను వేగంగా గుర్తించే సాంకేతికతను అభివృద్ధి చేయడం కోసం భారత్, ఇజ్రాయిల్‌లు కలిసి పనిచేస్తున్నాయి. భారత్‌లోని డీఆర్‌డీఓ, సీఎస్‌ఐఆర్‌తో ఇజ్రాయిల్ రక్షణశాఖకు చెందిన డీఆర్‌డీడీ కలిసి సంయుక్తంగా ర్యాపిడ్ టెస్టింగ్ పరిశోధన చేపట్టాయి. మరికొన్ని వారాల్లోనే ఈ నూతన టెస్టు ప్రయోగ ఫలితాలు రానున్నాయి. దీనిపై ఇజ్రాయిల్ విదేశాంగశాఖ ఈ మధ్యే అధికారిక ప్రకటన చేసింది.
5నిముషాల్లో కరోనా ఫలితం
Related tags :