తిరుమలలో శ్రీనివాస అభిషేకాలు తదితర ఆధ్యాత్మిక వార్తా తరంగిణి

అపవిత్రత నుంచి రక్షించేది.. పవిత్రతకు కారణమయ్యేది శుద్ధి. దీని కోసం మనం వంటిని శుభ్రం చేసుకుంటాం.. ఇంటిని శుద్ధి చేసుకుంటాం.. బాగు చేసుకుంటాం! మనుషులకే కాదు.. పురుషోత్తముడైన వేంకటనాథుడి అర్చామూర్తికీ శుద్ధి ఉంటుంది. ఆయన కొలువును బాగు చేసే అద్భుత ప్రక్రియలుంటాయి. నిత్యాభిషేకాల నుంచి పుష్కరానికోసారి జరిగే మహా సంప్రోక్షణం వరకు ఆగమోక్తంగా జరిగే ఈ క్రతువులన్నీ.. ఆశ్చర్యానందాల్ని కలిగిస్తాయి. ఆధ్యాత్మిక వైభవానికి అద్దం పడతాయి. ఆనందనిలయాన్ని అమృతమయం చేసే ఆ విశేషాలు..
***నిత్యాభిషేకం
స్వామిని వెండి స్నాన పీఠంపై ఉంచి తిరుమల నంబి వంశీకులు ఆకాశగంగ నుంచి తెచ్చిన నీటితో, ఆవుపాలతో అభిషేకిస్తారు. అదే సమయంలో మూలమూర్తి పాదాలకు ఉన్న బంగారు కవచాలను, స్వామివారి సమీపంలో ఉన్న సాలగ్రామాలను స్నానపీఠంపై ఉంచి అభిషేకిస్తారు. తర్వాత మూలమూర్తి, వక్షస్థల లక్ష్మి, శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి, ఉగ్ర శ్రీనివాసమూర్తి, కొలువు శ్రీనివాసమూర్తులపై ఆకాశగంగా జలాన్ని సంప్రోక్షణ చేస్తారు. ఇలా రోజూ స్వామివారికి సేవ జరుగుతుంది.రోజూ తెల్లవారుజామున సుప్రభాత సేవ అనంతరం తోమాల సేవ ముందు ఎవరికి: ఈ సేవలో శ్రీవారి ప్రతినిధిగా స్వామివారి ఉత్సవ మూర్తుల్లో ఒకరైన భోగ శ్రీనివాసమూర్తికి నిర్వహిస్తారు.
**పవిత్రోత్సవాలు
ఆలయంలోని పవిత్రోత్సవ మండపంలో ఏడు హోమ గుండాలను, మధ్యలో వేదికపై నవ కలశాన్ని, మరో వేదికపై ప్రాయశ్చిత కలశాన్ని ఏర్పాటుచేసి స్నాన పీఠంపై మలయప్ప స్వామిని అభిషేకిస్తారు. హోమం చేస్తారు. రెండో రోజూస్వామివారికి సేవల్లో, ఉత్సవాల్లో జరిగే లోపాలు… భక్తులు, ఆలయ సిబ్బంది తెలిసీ తెలియకుండా శౌచం సమయంలో రావడం వల్ల ఆలయ పవిత్రత తగ్గకుండా జరిపే ఉత్సవాలే పవిత్రోత్సవాలు. ఎప్పుడు: ఏటా శ్రావణ మాసంలో శుక్లపక్ష దశమి, ఏకాదశి, ద్వాదశి రోజుల్లో వీటిని నిర్వహిస్తారు.
అలాగే జరుగుతుంది. రెండో రోజు మూలమూర్తితో సహా ఉత్సవ మూర్తులు, పరివార మూర్తులు, ఆలయ ప్రాంగణంలోని ఉపాలయాల్లోని మూర్తులందరికీ పట్టు పవిత్రాలను సమర్పిస్తారు. ఆరోజు సాయంత్రం స్వామి వారి మాడ వీధుల్లో ఊరేగుతారు. మూడో రోజు కూడా యాగాలు, అభిషేకాలు నిర్వహిస్తారు. ఈ మూడు రోజులూ స్వామి వారు యాగశాలలో ఉండి చివరి రోజు ఆలయంలో ప్రవేశిస్తారు.
* తిరుమల క్షేత్రంలో అత్యంత పవిత్రమైన పుష్కరిణిని ఏటా బ్రహ్మోత్సవాలకు ముందు నెల రోజుల పాటు మూసివేసి అందులోని నీటిని తోడి మరమ్మతులు చేస్తారు.
***శుక్రవారాభిషేకం
శుక్రవారం సుప్రభాత సేవ అయిన తర్వాత అర్చకస్వాములు అభిషేకం చేసేందుకు అనుమతినివ్వమని స్వామివారిని ప్రార్థిస్తారు. స్వామివారి నుదుట నున్న నామాన్ని తగ్గిస్తారు. ఆభరణాలు పట్టువస్త్రాలను సడలింపుజేసి తెల్లని వస్త్రాన్ని కడతారు. ఈ వస్త్రానికి గోణం అని పేరు. ముందుగా ఆకాశగంగా తీర్థంతో, తర్వాత ఆవుపాలతో స్వామివారిని అభిషేకిస్తారు. దీనికోసం ఆవు పాలు, ఆకాశ గంగా జలాలు రెండు గంగాళాల వంతున ఉపయోగిస్తారు. అనంతరం స్వామి వారి వక్ష స్థలం మీద కొలువుదీరి ఉన్న లక్ష్మీదేవిపై పసుపు ముద్దను ఉంచి, అమ్మవారి రూపం పడిన ముద్దలను అర్చకులు స్వీకరిస్తారు. తర్వాత పరిమళాన్ని స్వామివారి మూర్తికి శిరస్సు నుంచి పాదాల వరకు అద్దుతారు. అంటే నలుగుపెట్టడం. దీనినే ఉద్వర్తనం అంటారు. పచ్చకర్పూరం, చందనం, కుంకుమ పువ్వులను కలిపి ఈ పరిమళాన్ని తయారు చేస్తారు. అనంతరం హారతినిచ్చి ఆ తర్వాత శుద్ధజలంతో అభిషేకిస్తారు. స్వామివారి మూర్తి నుంచి జాలువారే ఈ నీటికే శ్రీపాద తీర్థం అని పేరు. తర్వాత స్వామివారి వక్ష స్థలంపై ఉన్న లక్ష్మీదేవిని పసుపు నీటితో అభిషేకిస్తారు. అనంతరం తిరిగి బంగారు బావి నుంచి శుద్ధ జలంతో, ఆకాశగంగా తీర్థంతో స్వామివారిని అభిషేకిస్తారు. 84 తులాల పచ్చ కర్పూరం, 36 తులాల కుంకుమ పువ్వు, ఒక్క తుల కస్తూరి, ఒకటిన్నర తులాల పునుగు తైలం, 24 తులాల పసుపు పొడి వాడతారు.ప్రతి శుక్రవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు జరుగుతుంది. దీన్ని పూరాభిషేకం అని కూడా పిలుస్తారు. క్రీ.శ.614 నుంచి ఈ అభిషేకం ఇప్పుడు జరుగుతున్న తీరులో జరుగుతున్నట్లు తెలుస్తోంది. ****సహస్ర కలశాభిషేకం
ఇందులో భాగంగా గంటా మండపంలో తూర్పు, ఉత్తర, దక్షిణ ముఖాలుగా మూడు స్నాన పీఠాలను ఏర్పాటు చేస్తారు. ఉత్తర ముఖంగా ఉన్న పీఠంపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి.. దక్షిణ పీఠంపై విష్వక్సేనుల వారిని, తూర్పున భోగ శ్రీనివాసమూర్తిని కొలువుదీరుస్తారు. బంగారు వాకిలి ముందున్న భోగ శ్రీనివాసమూర్తికి, గర్భాలయంలో ఉన్న మూలమూర్తిని కలుపుతూ బంగారు తీగను కడతారు. 1008 కలశాలలోని సుగంధ జలంతో అభిషేకం చేస్తారు.ఈ సేవను ప్రతి బుధవారం ఉదయం ప్రధాన ఆలయంలోని బంగారు వాకిలి ముందున్న గంటా మండపంలో నిర్వహిస్తారు.
****వసంతోత్సవం
శ్రీసూక్తం, పురుషసూక్తం పఠిస్తుండగా శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి వారికి అర్చక స్వాములు ముందుగా శుద్ధ జలంతో అభిషేకం నిర్వహిస్తారు. అనంతరం పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీటితో అభిషేకిస్తారు. అనంతరం స్వామి వార్లకు చందనాన్ని అద్ది, తులసి మాలలను ధరింపజేసి, బంగారు జల్లెడ స్వామివార్లపై పెట్టి అందులో నీరు పోస్తూ సహస్రధార అభిషేకం చేస్తారు. అనంతరం కలశంలోని జలాలతో అభిషేకించి హారతులిచ్చి వసంతోత్సవం ముగిస్తారు.ప్రతి రోజూ వైభవోత్సవ మండపంలో మధ్యాహ్నం మూడు గంటలకు ఈ ఉత్సవం జరుగుతుంది. ఎవరికి: శ్రీవారి ప్రతినిధిగా సేవలన్నిటిలో పాల్గొనే శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి వారికి ఈ సేవ జరుగుతుంది.
*****వార్షిక వసంతోత్సవాలు
తిరుమల మాడ వీధుల్లో ఆలయం వెనక నైరుతి మూలలో ఉన్న వసంత మండపంలో ఉత్సవాలు జరుగుతాయి. తొలి రెండు రోజులూ శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామికి, మూడో రోజు వీరితో పాటు సీతారామలక్ష్మణ హనుమంతులకు, రుక్మిణీ శ్రీకృష్ణులకు అభిషేకం జరుగుతుంది. ఇంకా బ్రహ్మోత్సవాలలో, ప్రతి సోమవారం విశేష పూజ సమయంలో, స్నపన తిరుమంజనం, వసంతోత్సవం రూపంలో స్వామివారి స్నాన శుద్ధి కార్యక్రమాలు జరుగుతాయి.ఏటా చైత్రశుద్ధ త్రయోదశి నుంచి పౌర్ణమి వరకు మూడు రోజుల పాటు వార్షిక వసంత్సోవాలు జరుగుతాయి.
***కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం మహా సంప్రోక్షణ
తిరుమలలో ఆలయానికి జరిగే అభిషేకం లేదా ఆలయ శుద్ధి కార్యక్రమానికి కోయిల్‌ ఆళ్వారు తిరుమంజనం అని పేరు. ఈ సేవ ఏటా నాలుగు సార్లు జరుగుతుంది. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశికి ముందు వచ్చే మంగళవారాల్లో జరుగుతుంది. ఈ సేవలో గర్భాలయం మొదలుకుని ప్రధాన ఆలయం, ఉత్సవ మూర్తులు, స్వామి సేవకు ఉపయోగించే అన్ని పాత్రలు, వస్తువులన్నిటినీ శుభ్రం చేస్తారు. సుమారు నాలుగు గంటల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఉత్సవ మూర్తులకు అభిషేకం చేస్తారు. గర్భాలయం శుద్ధి చేసే సమయంలో మూలమూర్తి శిరస్సు నుంచి పాదాల వరకు మలై గుడారం అనే వస్త్రాన్ని కప్పుతారు. ఆలయాన్ని శుద్ధి చేసి, కడిగి, నామం కోపు, శ్రీచూర్ణం, గడ్డ కర్పూరం, కుంకుమ ఖిచిలీ గడ్డ, గంధం పొడి వంటివి నీటిలో కలిపి తయారు చేసిన పరిమళాన్ని గోడలకు పూస్తారు. ఈ సమయంలోనే గర్భాలయంలోని స్వామివారి పై భాగంలో పై కప్పునకు కురాళం అనే మఖమల్‌ గుడ్డను, వాకిళ్ల పరదాలను కొత్త వాటిని కడతారు. భృగు మహర్షి రాసిన ప్రకీర్ణాధికారంలో సంప్రోక్షణ గురించి వివరించారు. ఇవి జల సంప్రోక్షణ, లఘు సంప్రోక్షణ, మహా సంప్రోక్షణ అని మూడు రకాలు. గ్రహణ సమయంలో ఆలయం మూసివేత వంటి సమయాల్లో లఘు, జల సంప్రోక్షణలు చేస్తారు. ఆలయంలో మరమ్మతులు, మూలమూర్తి, గర్భగుడి గోపురానికి మరమ్మతులు చేసే సమయంలో మహా సంప్రోక్షణ చేస్తారు. ఇది తిరుమలలో పన్నెండేళ్లకోసారి జరుగుతుంది. ఇందులో భాగంగా మూలమూర్తి అనుమతి తీసుకుని ఆ మూర్తి కళలను ఓ కుంభంలోకి ఆవాహన చేసి పరకామణి వద్ద ఏర్పాటు చేసిన బాలాలయంలో ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తారు. తేనె మైనం, ఎర్రమట్టి, చక్కెర, నెయ్యి, పత్తిగింజలు, నల్ల బెల్లం, అరటి పండు, శంఖం పొడి కలిపిన పాకాన్ని మూలమూర్తికి, పీఠానికి మధ్య ఉంచడం ద్వారా అష్టబంధనం చేసి స్వామివారిని కదలకుండా చేస్తారు. ఆ తర్వాత ఆలయంలో మరమ్మతులు ఉంటే చేస్తారు. అన్నీ పూర్తయ్యాక యజ్ఞయాగాలు నిర్వహించి కుంభంలోని కళలను తిరిగి స్వామి వారిలోకి ఆవాహనం చేసి నిత్యపూజలు నిర్వహిస్తారు.

2.వినాయకుడికి తులసిదళం సమర్పించకూడదని అంటారు ఎందుకు?
నాక్షతైహి అర్చయేత్‌ విష్ణుః నకేతక్యా శివం నతులస్యా గణాధిపం అని చెబుతోంది ధర్మ శాస్త్రం. దేవతా పూజలన్నీ ఆగమశాస్త్రం ప్రకారం నిర్వహించాల్సి ఉంటుంది. విష్ణుమూర్తిని అక్షతలతో, పరమేశ్వరుణ్ని మొగలిపూలతో, వినాయకుడిని తులసిదళాలతో అర్చించరాదని ఆగమ శాస్త్రం చెబుతోంది. ప్రమథగణ అధ్యక్ష పదవి పొందిన వినాయకచవితి రోజు నిషేధాన్ని సడలించింది. మిగిలిన రోజుల్లో సమర్పించకూడదు. తులసి రూపంలో ఉన్న లక్ష్మీదేవికి, గణపతికి విరోధం ఏర్పడి శాపప్రతిశాపాలు ఇచ్చుకున్నారట. ఈ క్రమంలో వినాయకుడి పూజలో తులసి వినియోగించరాదని పురాణ కథనం.

3. జీయరు స్వామీ ఆద్వర్యంలో అంతర్జాతీయ సదస్సు.
భగవద్రామానుజాచార్యుల జీవిత చరిత్ర, విశేషాలను ప్రపంచానికి చాటి చెప్పి భవిష్యత్తుతరాలకు మార్గ నిర్దేశం చేయడంలో భాగంగా శుక్రవారం నుంచి నాలుగురోజులపాటు (ఈ నెల 3నుంచి 6వరకు) సదస్సు నిర్వహిస్తున్నట్లు త్రిదండి రామానుజ చినజీయర్‌ స్వామి తెలిపారు. బుధవారం శ్రీరామనగరంలోని కుటీరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో.. అహోబిల జీయర్‌ స్వామి, దేవనాధ జీయర్‌ స్వామి, సముద్రాల రంగరామానుజాచార్యులతో కలిసి ఆయన సదస్సు వివరాలను వెల్లడించారు. ప్రతి ప్రాణి దేవుడి సంతానమే అయినపుడు.. హరిజన, గిరిజన తేడా లేకుండా మానవులంతా సమానులే అంటూ వెయ్యేళ్ల క్రితమే ప్రపంచానికి చాటి చెప్పిన భగవద్రామానుజాచార్యుల సామాజిక సేవలను నేటి సమాజంలో వెలకట్టలేమన్నారు. దేశానికే మణిహారంగా జీవా ప్రాంగణంలో 45ఎకరాల స్థలంలో 216 అడుగుల ఎత్తుండే శ్రీ రామానుజుల లోహమయమూర్తి స్ఫూర్తి కేంద్రం పనులు తుది దశకు చేరుకున్నాయన్నారు. జిమ్స్‌ వైద్య కళాశాలలో ఏర్పాటు చేయనున్న సదస్సుకు అన్ని రాష్ట్రాలతోపాటు అమెరికా, నేపాల్‌ తదితర దేశాలకు చెందిన మేధావులు, వేద పండితులు హాజరవుతున్నట్లు ఆయన వివరించారు.

4. శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లు విడుదల
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లను తితిదే విడుదల చేసింది. నవంబర్‌ నెలకు సంబంధించిన 67,567 టిక్కెట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఇందులో 10,767 సేవా టిక్కెట్లను ఆన్‌లైన్‌ డిప్‌ విధానంలో కేటాయించారు. సుప్రభాత సేవకు 7,512, తోమాల సేవ 100, అర్చన 100, అష్టాదళ పాదపద్మారాధన సేవకు 180, నిజపాద దర్శనం 2,875 టిక్కెట్లను కేటాయించారు. సాధారణ పద్ధతిలో కల్యాణోత్సవానికి 12,825, ఊంజల్‌ సేవకు 4,050, వసంతోత్సవానికి 14,300, సహస్త్రదీపాలంకరణ సేవ 16,200, విశేష పూజకు 2 వేల టిక్కెట్లను అందుబాటులో ఉంచారు. డిప్‌ పద్ధతిలో టిక్కెట్ల నమోదుకు నాలుగురోజులపాటు అవకాశం కల్పించారు. అనంతరం లాటరీ పద్ధతిలో సేవా టిక్కెట్లను కేటాయిస్తారు. అద్దె గదులు, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లను తితిదే విడుదల చేసింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com