Fashion

అమ్మాయిలు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలో మేము చెప్తాం

అమ్మాయిలు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలో మేము చెప్తాం

అమ్మాయిల పెళ్లికి కనీస వయస్సుపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి స్పష్టం చేశారు. దీనిపై ఇప్పటికే కమిటీ వేశామని, నిపుణులు నివేదిక ఇచ్చిన వెంటనే ప్రభుత్వ నిర్ణయాన్ని వెల్లడిస్తామని పేర్కొన్నారు.

‘అమ్మాయిల పెళ్లికి సరైన వయస్సుపై ఇప్పటికే ఏర్పాటు చేసిన కమిటీ చర్చలు జరుపుతోంది. కమిటీ నిర్ణయాన్ని ఇప్పటివరకు ఎందుకు ఇవ్వలేదని దేశవ్యాప్తంగా కుమార్తెల నుంచి నాకు ప్రశ్నలు వస్తున్నాయి. అయితే, నివేదిక వచ్చిన తర్వాత సాధ్యమైనంత తొందరగా దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది’ అని ప్రధానమంత్రి హామీ ఇచ్చారు. ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్ (ఎఫ్‌ఏవో) 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రూ.75 స్మారక నాణేన్ని విడుదల చేసిన సమయంలో ప్రధాని మోదీ ఈ విధంగా స్పందించారు.

దేశవ్యాప్తంగా విద్యాసంస్థల్లో నమోదు చేసుకుంటున్న వారిశాతం బాలురతో పోలిస్తే బాలికలదే అధికంగా ఉందని, ఇలా పెరగడం దేశంలో ఇదే తొలిసారని అన్నారు. గడిచిన ఆరు సంవత్సరాలుగా తమ ప్రభుత్వం చేస్తోన్న కృషి ఫలితంగానే ఇది సాధ్యమైందని తెలిపారు. కేవలం ఒక్క రూపాయికే శానిటరీ ప్యాడ్‌లను అమ్మాయిలకు అందిస్తున్నామని ప్రధానమంత్రి గుర్తుచేశారు. ఈ సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవం రోజున దేశ ప్రజలనుద్దేశించి చేసిన ప్రసంగంలో అమ్మాయిల పెళ్లికి కనీస వయస్సును ప్రధానమంత్రి ప్రస్తావించారు. దీనిపై చర్చించి నివేదించేందుకు ఓ ప్రత్యేక కమిటీ నియమించామని తెలిపారు.

ప్రస్తుతం దేశంలో అమ్మాయిల పెళ్లికి కనీస వయస్సు 18 సంవత్సరాలు ఉండగా, అబ్బాయిలకు 21సంవత్సరాలుగా ఉంది.