వెదురు బియ్యం గురించి విన్నారా?

వరి ఎలా పండుతుందో మనందరికీ తెలుసు. కంకులు వచ్చి వడ్లు తయారవగానే మొక్క దాదాపు ఎండిపోయే స్థితికి వచ్చేస్తుంది. ఒక్క వరే కాదు, గోధుమ, జొన్న, సజ్జ… ఇలా ధాన్యానికి సంబంధించిన వేవయినాగానీ గింజ కట్టగానే మొక్క ఎండిపోతుంది. గడ్డి మొక్కలేవయినా అంతే. కంకి వచ్చిందంటే మొక్క జీవితకాలం అయిపోయినట్లే. వెదురు కూడా గడ్డి జాతి మొక్కేగా. అందుకే అది పూసిందీ, కంకి వేసిందీ అంటే మొక్క చనిపోయినట్లే. అయితే అది సాధారణంగా పూయదు. పూసినా దాదాపు వందేళ్లకు పూస్తుంది.
**పోషకాల పంట… వెదురు!
అడవుల్లో బతికే గిరిజనులు కూడా తమ జీవిత కాలంలో వెదురుపూతను చూడటం చాలా అరుదు. అది ఎప్పుడు పూస్తుందనేది వాళ్లకీ తెలీదు మరి. కొన్ని వెదురు జాతులు మాత్రం 40- 60 సంవత్సరాలకోసారి పూస్తుంటాయి. అప్పుడు పండిన ధాన్యాన్ని ఎంతో జాగ్రత్తగా సేకరించి, వండుకుని తింటుంటారు గిరిజనులు. అవి ఎప్పుడో ఒకసారి తప్ప దొరకనివి. పైగా బలమైన ఆహారం అని వాళ్లకీ తెలుసు. అందుకే వాళ్లు దాచుకుని మరీ తింటుంటారు. కొందరు అధిక ధరకోసం చుట్టుపక్కల వర్తకులకి విక్రయిస్తారు. ఆ విధంగా ఆ వెదురు బియ్యం రహస్యం ఎలాగో బయటి ప్రపంచానికీ తెలిసింది. దాంతో కన్యాకుమారి అడవుల్లోని కణి గిరిజన జాతి వాళ్లమీద అధ్యయనం చేయగా – సంతాన సాఫల్యత కోసమూ పోషకాహారంగానూ వెదురు బియ్యాన్ని తింటారని తెలిసింది. ఇవి ఒకలాంటి రుచితో తియ్యగా ఉంటాయట.
* వరి, గోధుమల్లో కన్నా వెదురు బియ్యంలో ప్రొటీన్లూ, పీచూ ఎక్కువ.
* పొటాషియం, కాల్షియం… వంటి ఖనిజాలూ పుష్కలమే. విటమిన్‌-బి6 సమృద్ధిగా ఉంటుంది. దాంతో కీళ్ల నొప్పులూ, వెన్నెముక నొప్పులూ తగ్గుతాయని గుర్తించారు.
* వెదురు బియ్యం తినేవాళ్లలో కొలెస్ట్రాల్‌ శాతం తగ్గినట్లూ తేలింది.
* అన్నింటికన్నా వీటికి మధుమేహాన్నీ, బీపీనీ నిరోధించే శక్తి ఉందని గుర్తించారు.
* ఆయుర్వేద రీత్యా ఇవి పిత్త, కఫ దోషాలను నివారిస్తాయట. శరీరంలోని టాక్సిన్లు బయటికి పోయేలానూ చేస్తాయి.
ఇన్ని మంచి లక్షణాలు ఉన్న వెదురు బియ్యాన్ని భారీగా పండించాలంటే… అది ఎవరి చేతుల్లోనూ లేదు. అందుకే సహజంగా పండే వెదురు బియ్యంలోని పోషకాలూ ఔషధగుణాలూ ఉండేలా వెదురు బియ్యాన్ని తయారుచేసేందుకు ఓ పద్ధతిని కనిపెట్టారు. లేత వెదురు ఆకులనుంచి దాని ఎక్స్‌ట్రాక్ట్‌ను సేకరించి, దాన్ని ముత్యాల్లా గుండ్రంగా ఉండే పొట్టి రకం ముడిధాన్యానికి పట్టేలా చేశారు. దాంతో ఆకుపచ్చని రంగుతో జాస్మిన్‌ గ్రీన్‌ టీ సువాసనతో ఉండే అందమైన రుచికరమైన బియ్యం తయారయ్యాయి. వండాక అన్నం కూడా ఆకుపచ్చ రంగులో అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. సహజంగా పండే వెదురు బియ్యంలోని పోషకాలన్నీ వీటిల్లోనూ ఉంటున్నాయి. దాంతో జపాన్‌, ఆస్ట్రేలియా… వంటి దేశాలతోబాటు కేరళలో కూడా ఈ వెదురు బియ్యాన్ని పనిగట్టుకుని మరీ పండిస్తున్నారు/తయారుచేస్తున్నారు. మరోపక్క సహజ వెదురు బియ్యాన్ని మధ్యప్రదేశ్‌తోపాటు, మంగళూరు, వయనాడ్‌ తీరాల్లోని దట్టమైన అడవుల్లో నుంచి గిరిజనుల ద్వారా సేకరించి కొన్ని కంపెనీలు విక్రయిస్తున్నాయి. వీటితో అన్నమే కాదు, పాయసం, పొంగలి… వంటి వంటలతో బాటు సలాడ్లూ చేసుకోవచ్చు. అదే ఆకుపచ్చని వెదురు బియ్యం అయితే పారాబాయిల్డ్‌ కాబట్టి నానబెట్టకుండానే వండుకోవచ్చు. వంద గ్రా. పచ్చని వెదురు బియ్యం నుంచి 265 క్యాలరీలు వస్తే, సహజ వెదురు బియ్యం నుంచి 350 క్యాలరీలు లభిస్తాయి. కాబట్టి ఏవి తిన్నా క్యాలరీలనీ దృష్టిలో పెట్టుకోవాలి. సో, వెదురు పండేది నూరేళ్లకోసారే కావచ్చుగాక… కానీ ఆ బియ్యంతో వందేళ్లూ బతకొచ్చు పచ్చగా ఆరోగ్యంగా..!

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com