కృష్ణమ్మ పుట్టిల్లుమహభలేశ్వర్‌-తదితర ఆద్యాత్మిక వార్తా తరంగిణి

‘‘ఏదైనా పుణ్యక్షేత్రానికైతే వస్తా’’ ఇది ఇంట్లో పెద్దవారి మాట. జలపాతాలు, సరస్సులు చూపిస్తానంటేనే వస్తామంటారు పిల్లలు. ట్రెక్కింగులు, కయాకింగులు ఉంటేనే ఓటేస్తారు యువకులు. పచ్చదనం, చల్లదనం అందరూ కోరుకుంటారు. ఇవన్నీ ఒకేచోట ఉన్నాయంటే.. భలే భలే అనాల్సిందే. అవన్నీ ఆస్వాదించాలంటే.. కృష్ణానది జన్మస్థానమైన మహాబలేశ్వర్‌ వెళ్లాల్సిందే.
ఆ తల్లి అడుగుపెట్టిన చోటల్లా పచ్చదనమే. తెలుగింట ధాన్యరాశులు కురిపించిన కృష్ణమ్మ ఒడ్డున పుణ్యక్షేత్రాలెన్నో! పర్యాటక విశేషాలెన్నెన్నో!! ఆ నది జన్మించిన మహాబలేశ్వర్‌ యాత్రాస్థలిగా, వినోద కేంద్రంగా పర్యాటకులను అలరిస్తోంది. ఆరు రుతువుల్లోనూ ఇక్కడ ఆమని తిష్టవేస్తుంది. వేసవిలో చల్లదనాన్ని, శీతాకాలంలో ఆహ్లాదాన్ని అందించే మహాబలేశ్వర్‌ వానాకాలంలో పచ్చదనంతో పలకరిస్తుంది. కొండల అంచులను ఒరుసుకుంటూ కదలిపోతున్న మేఘమాలికలు.. పరవశంతో ప్రణయగీతాన్ని ఆలపించేలా చేస్తాయి. మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఉన్న పర్వత ప్రాంతం మహాబలేశ్వర్‌. ఈ సుందర ప్రదేశం సముద్ర మట్టానికి 4,718 అడుగుల ఎత్తులో ఉంటుంది. సహ్యాద్రి పర్వత సానువుల్లో నెలకొని ఉన్న ఈ ఆధ్యాత్మిక కేంద్రానికి చారిత్రక ప్రాశస్త్యం కూడా ఉంది.
**కొండపై కోట
శతాబ్దాలకు పూర్వం సింగన్‌ అనే రాజు ఈ ప్రాంతాన్ని పాలించాడు. ఇక్కడి మహాబలేశ్వరుడి దేవాలయం కూడా ఆయన హయాంలోనే నిర్మించారు. 17వ శతాబ్దంలో మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహాబలేశ్వర్‌ను కైవసం చేసుకున్నాడు.1656లో ప్రతాప్‌గఢ్‌ కోటను కట్టించాడు. ఇది మహాబలేశ్వర్‌కు 24 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కొండపై కోటలో భవానీదేవి, మహాదేవ ఆలయాలు ఉన్నాయి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కోటలోకి అనుమతిస్తారు.
**చూడచక్కని వ్యూపాయింట్లు
హిల్‌స్టేషన్‌గా పేరున్న మహాబలేశ్వర్‌లో దాదాపు 30 వ్యూపాయింట్లు ఉన్నాయి. విల్సన్‌ పాయింట్‌ అత్యంత ఎత్తయిన ప్రదేశం. ఆ తర్వాతి స్థానం కొన్నాట్‌ శిఖరానిది. ఆర్ధర్స్‌ సీట్‌ పాయింట్‌, హెల్సెన్‌ పాయింట్‌ ఇలా రకరకాల వ్యూ పాయింట్ల నుంచి మహాబలేశ్వర్‌ సౌందర్యాన్ని 360 డిగ్రీల కోణంలో ఆస్వాదించొచ్చు. ఏనుగు తల ఆకారంలోని పర్వతాన్ని ఎలిఫెంట్‌ హెడ్‌ పాయింట్‌గా పిలుచుకుంటారు. ఈ వ్యూపాయింట్‌ నుంచి చుట్టుపక్కల ప్రాంతాలు చూడొచ్చు. సూర్యాస్తమయం సమయానికి పర్యాటకులు ఎక్కువగా ఇక్కడికి చేరుకుంటారు. ముంబయి పాయింట్‌ నుంచి కూడా మలి సంధ్య మనోహరంగా కనిపిస్తుంది. సాహసయాత్రికుల కోసం పలు వ్యూపాయింట్ల దగ్గర ట్రెక్కింగ్‌ అందుబాటులో ఉంది. స్థానికంగా ఉన్న అడ్వెంచర్‌ క్లబ్‌లు ట్రెక్కింగ్‌, ర్యాపెలింగ్‌ క్రీడలు నిర్వహిస్తుంటాయి.
**ఎలా వెళ్లాలంటే?
* పుణె నుంచి మహాబలేశ్వర్‌ 120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హైదరాబాద్‌ నుంచి పుణెకు విమాన సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్‌, విశాఖపట్టణం, విజయవాడ నుంచి రైళ్లు ఉన్నాయి. పుణె నుంచి బస్సులు, ట్యాక్సీల్లో మహాబలేశ్వర్‌ చేరుకోవచ్చు.
* సొంత వాహనంలో వెళ్తే.. హైదరాబాద్‌ నుంచి మహాబలేశ్వర్‌ సుమారు 590 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. జహీరాబాద్‌, హుమ్నాబాద్‌, సోలాపూర్‌, పండరీపూర్‌, ఫల్టణ్‌ మీదుగా మహాబలేశ్వర్‌ చేరుకోవచ్చు. పండరీపూర్‌ నుంచి పుణె మీదుగా కూడా వెళ్లొచ్చు.
**జలపాతాల సోయగాలు
ఐదునదుల పుట్టినిల్లు మహాబలేశ్వర్‌ పరిసరాల్లో అద్బుతమైన మూడు జలపాతాలున్నాయి. 600 అడుగుల ఎత్తు నుంచి దుమికే లింగమల జలపాతం ప్రధానమైనది. మహాబలేశ్వర్‌కు మూడు కిలోమీటర్ల దూరంలో ధోబీ జలపాతం ఉంటుంది. దీనిని చూసేందుకు యాత్రికులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. చైనామన్స్‌ జలపాత సోయగాలు చూపరులను కట్టిపడేస్తాయి. 18వ శతాబ్దంలో బ్రిటిష్‌ వాళ్లు.. చైనా, మలేసియాకు చెందిన ఖైదీలను ఇక్కడ బందీలుగా ఉంచేవారట. వారు స్ట్రాబెర్రీ తోటలను సాగు చేసేవారు. నేటికీ ఇక్కడ స్ట్రాబెర్రీ తోటలు ఉండటం విశేషం. ఇక వెన్నా సరస్సులో బోటింగ్‌ ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడ కయాకింగ్‌ పోటీలు జరుగుతుంటాయి.
**ఆధ్యాత్మిక సౌరభాలు
మహాబలేశ్వర్‌లో పరమశివుడు స్వయంభువుగా వెలిశాడని స్థలపురాణం. పరమేశ్వరుడికి ప్రీతిపాత్రమైన రుద్రాక్ష ఆకారంలో ఇక్కడ లింగం దర్శనమిస్తుంది. ఆలయంలో స్వామివారి కోసం పడక కూడా ఉంటుంది. ప్రతిరోజూ రాత్రి పరమేశ్వరుడు దీనిపై శయనిస్తాడని భక్తులు విశ్వసిస్తారు. అందుకు తగ్గట్టుగానే ఆలయం మూసివేసే సమయంలో ఏమాత్రం నలగకుండా ఉండే పక్క.. తెల్లారేసరికి చెదిరి కనిపించడం విశేషం. మహాబలేశ్వరుడి ఆలయ సమీపంలో కృష్ణానది జన్మస్థానంలో కృష్ణాబాయి ఆలయం ఉంటుంది
**త్రిమూర్తులే నదులుగా
సాక్ష్యాత్తు విష్ణుమూర్తే ఇక్కడ కృష్ణానదిగా ఉద్భవించాడని అంటారు. దీనికి సంబంధించి పౌరాణిక గాథ ఒకటి ప్రచారంలో ఉంది. పూర్వం మహావిష్ణువు సూచన మేరకు పరమశివుడి పర్యవేక్షణలో బ్రహ్మదేవుడు ఒక యజ్ఞాన్ని నిర్వహించాలనుకున్నాడట. యజ్ఞ సమయానికి సరస్వతీదేవి రాకపోవడంతో మరో స్త్రీమూర్తితో క్రతువు నిర్వహణకు పూనుకున్నాడట బ్రహ్మ. అదే సమయంలో అక్కడికి చేరుకున్న సరస్వతి తన స్థానంలో మరో మహిళ ఉండటాన్ని చూసింది. ఆగ్రహంతో త్రిమూర్తులను నదులుగా మారిపొమ్మని శపించిందట. అప్పుడు విష్ణుమూర్తి కృష్ణానదిగా, రుద్రుడు వెన్నా నదిగా, బ్రహ్మ కొయినా నదిగా మారారని కథ. ఈ మూడు నదులతో పాటు సావిత్రి, గాయత్రి నదులు కూడా ఇదే ప్రాంతంలో జన్మించాయి. ఐదు నదులు సంగమించే ప్రదేశం.. పంచగంగ. ఇక్కడ మహాదేవుడి ఆలయం ఉంది.
* బ్రహ్మకుమారీల అధ్యక్షురాలు దాది జానకిజీ వచ్చే నెల 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆమె వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారని బ్రహ్మకుమారీల మీడియా విభాగం ఓ ప్రకటనలో తెలిపింది. గచ్చిబౌలిలోని శాంతిసరోవర్‌లో జరిగే కార్యక్రమంలో, బీకే సర్వీసెస్‌ స్వర్ణోత్సవాల్లో జానకిజీ పాల్గొంటారు. సెప్టెంబరు 2న గచ్చిబౌలి శాంతిసరోవర్‌లో జరిగే కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులేనని డైరెక్టర్‌ బీకే సిస్టర్‌ కుల్దీప్‌ తెలిపారు.
* శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణస్వామి ఆలయ ప్రాంగణంలో ఆదివారం తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డులో నమోదు కోసం సామూహిక ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేశారు. ఆలయ అనివెట్టి మండపంలో వివిధ జిల్లాలకు చెందిన 700 మంది మహిళా భక్తులు 9 సార్లు ఈ స్తోత్రాన్ని చదివారు. దాస సాహిత్య ప్రాజెక్టు, మంత్రాలయం అసిస్టెంట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ పరాయతం నారాయణాచార్యులు ఆధ్వర్యంలో పలు కీర్తనలను పాడారు.
* తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని సినీనటి సమంత ఆదివారం దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్‌ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. తిరుమలకు కాలినడకన వచ్చిన ఆమె.. స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయం ఎదుట ఆమెను చూడటానికి యాత్రికులు పోటీపడ్డారు.
* తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగుల సమ్మెను ఓ వర్గం వ్యతిరేకిస్తోంది. ఏళ్ల తరబడి పరిష్కారం కాని సమస్యలపై 12 ఏళ్లకోసారి జరిగే మహాసంప్రోక్షణ, రెండు బ్రహ్మోత్సవాలు జరుగుతున్న తరుణంలో సమ్మెకు పిలుపునివ్వడాన్ని ఆ వర్గం తప్పుపడుతోంది. ఈ మేరకు దేవస్థానం ఉద్యోగుల సమన్వయ సమితి నేతలు విజయకుమార్‌, మదన్‌మోహన్‌ సమ్మెను వ్యతిరేకిస్తూ విధులకు హాజరవుతామని స్పష్టం చేశారు. కొందరు సమ్మె తలపెట్టినా మేమంతా విధులకు హాజరై భక్తులకు సేవ చేస్తామని స్పష్టం చేశారు. తితిదే ఈవోతో మాట్లాడి సమస్యలను సానుకూలంగా పరిష్కరించుకుంటామని, దేవస్థానంలో ఆందోళన కార్యక్రమాలను వ్యతిరేకిస్తామని తెలిపారు. భక్తులను ఇబ్బంది పెట్టడం సమంజసం కాదంటున్నారు. ఉద్యోగ సంఘాల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ సమ్మెకు ఏర్పాట్లు ముమ్మరం చేస్తోంది. ఈ నెల 8న సాయంత్రం 5 గంటలకు తిరుపతిలోని తితిదే పరిపాలన భవనంలో ఉద్యోగుల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించనుంది. సమస్యల పరిష్కారం కోసం దశల వారీగా ఆందోళన కార్యక్రమాలను చేపట్టనుంది. ఇప్పటికే 22 సమస్యలతో కూడిన నోటీసును తితిదే ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పుట్టా సుధాకర యాదవ్‌, ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌కు అందజేసిన విషయం తెలిసిందే.
* దుర్గగుడిలో చీర మాయంపై సందిగ్ధత
విజయవాడ దుర్గగుడిలో అమ్మవారికి సారె రూపంలో వచ్చిన చీర మాయమైన ఘటనలో సందిగ్ధత కొనసాగుతోంది. ఘటనపై విచారణ విషయంలో పోలీసులు, దుర్గగుడి అధికారులు సాకులతో సరిపెడుతున్నారు. భక్తులు చీర తెచ్చినట్లు రికార్డుల్లో నమోదు కానందున పోలీసులకు ఫిర్యాదు చేయలేమని దుర్గగుడి అధికారులు అంటున్నారు. అదే సమయంలో తమకు భక్తుల నుంచి గానీ, అధికారుల నుంచి గానీ ఫిర్యాదు రానందున కేసు నమోదు చేయలేదని పోలీసులు చెబుతున్నారు. విషయం తెలిసిన వెంటనే దుర్గగుడికి వచ్చిన పోలీసులు.. భక్తులు, అర్చకులు, పాలకమండలి సభ్యులను విచారించారు. ఆలయంలో ఏర్పాటు చేసిన సీసీ టీవీ దృశ్యాలను పరిశీలించారు. ఆ తర్వాత మాత్రం చర్యలకు మాత్రం వెనుకంజ వేస్తున్నారు. నిబంధనల మేరకు ఫిర్యాదు వస్తేనే కేసు నమోదు చేస్తామని చెబుతున్నారు. అయితే అమ్మవారికి ఆ చీర సమర్పించిన భక్తులు సూర్యనారాయణ, వసుంధర మాత్రం పాలకమండలి సభ్యుడు పెంచలయ్య విజ్ఞప్తి మేరకే తాము పోలీసులకు ఫిర్యాదు చేయలేదని తెలిపారు. ఆలయ ప్రాంగణంలో జరిగిన ఘటనపై ఉన్నతాధికారులకు చెప్పినా పట్టించుకోకపోవటంపై వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై నేడు పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.
* 21 నుంచి తిరుమలలో పవిత్రోత్సవాలు
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈనెల 21 నుంచి 23 వరకు తితిదే పవిత్రోత్సవాలు నిర్వహించనుంది. 20న అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే కైంకర్యాలు, ఉత్సవాల్లో యాత్రికులు, సిబ్బంది వల్ల తెలిసీ తెలియక జరిగే దోషాలు నివారణకు ఆగమ శాస్త్రోక్తంగా ఈ ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా తొలిరోజు ఉదయం 9 నుంచి 11 గంటల వరకు శ్రీమలయప్పస్వామికి స్నపన తిరుమంజనం, సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రత్యేకంగా అలంకరించిన ఆభరణాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారు తిరువీధుల్లో ఊరేగింపు ఉంటాయి. 21న పవిత్రాల సమర్పణ, 22న పవిత్ర సమర్పణ, 23న పూర్ణాహుతి జరుగుతాయి. ఈ ఉత్సవాల కారణంగా 20న వసంతోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలు, 21 నుంచి 23 వరకు అష్టదళ పాదపద్మారాధన, సహస్రకలశాభిషేకం, తిరుప్పావడ, కల్యాణోత్సవం, ఊంజలసేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను రద్దు చేసినట్లు తితిదే వెల్లడించింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com