నా సలహాలు ఎందుకు తీసుకోవట్లేదు?

ప్రస్తుత క్రికెటర్లలో రహానె తప్ప మిగతా ఆటగాళ్లెవరూ సలహాలు తీసుకునేందుకు తనను సంప్రదించడం లేదని అన్నాడు మాజీ క్రికెటర్‌ సునీల్‌ గావస్కర్‌. గతంలో సచిన్‌ తెందుల్కర్‌, రాహుల్‌ ద్రవిడ్‌తో పాటు పలువురు ఆటగాళ్లు తనను స్వయంగా కలిసి లేదంటే ఫోన్‌ ద్వారా సలహాలు తీసుకునేవారు. కానీ, ఈ తరం క్రికెటర్లు ఎవరూ అలా చేయడం లేదని చెప్పాడు గావస్కర్‌. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న గావస్కర్‌ భారత్‌-ఇంగ్లాండ్‌ టెస్టు సిరీస్‌, ప్రస్తుత భారత జట్టు ఆటగాళ్ల గురించి మాట్లాడాడు. ‘ఏ బ్యాట్స్‌మెన్‌ సలహాల కోసం నా వద్దకు రావడం లేదు. ఇంతకుముందు సచిన్‌, ద్రవిడ్‌, సెహ్వాగ్‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌లు ఏదైనా విదేశీ పర్యటనలకు వెళ్లే ముందు నాతో మాట్లాడేవారు. నా నుంచి సలహాలు తీసుకునేవారు. కానీ, ఈ తరం క్రికెటర్లు ఎవరూ నన్ను సంప్రదించడంలేదు. ఒక్క రహానె మాత్రం అప్పుడప్పుడూ నాతో మాట్లాడుతూ ఉంటాడు’ అని చెప్పాడు. ‘లార్డ్స్‌లో జరగబోయే టెస్టులో భారత్‌ మరో బ్యాట్స్‌మెన్‌తో బరిలోకి దిగాలి. పుజారాకు తుది జట్టులో చోటు కల్పించాలి. అతడో టెక్నికల్‌ ప్లేయర్‌. అంతేకాదు మైదానంలో ఓపికగా వీలైనంత ఎక్కువ సమయాన్ని గడుపుతాడు. పిచ్‌ పరిస్థితులను పరిశీలించిన తర్వాత ఎవరి స్థానంలో అతడ్ని తీసుకోవాలో నిర్ణయం తీసుకోవాలి. రెండో టెస్టులో భారత్‌ విజయం సాధించాలంటే ముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకోవాలి. ఈ ఏడాది ఆరంభంలో దక్షిణాఫ్రికాతో జొహన్నెస్‌బర్గ్‌ టెస్టులో ఏం జరిగిందో అందరూ గుర్తుంచుకోవాలి. చివరి ఇన్నింగ్స్‌ ఆడే ఏ జట్టు అయినా రెండు వందలకు పైగా పరుగులు సాధించాలంటే తీవ్ర ఒత్తిడికి గురవుతుంది. ఎడ్జ్‌బాస్టన్‌ టెస్టులోనూ అదే జరిగింది’ అని గావస్కర్‌ అన్నాడు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com