ఫిబ్రవరిలో రామానుజాచార్యుల విగ్రహావిష్కరణ-తదితర ఆద్యాత్మిక వార్తా తరంగిణి.

దివ్యసాకేతంలో 216 అడుగుల భగవద్రామానుజాచార్యుల పంచలోహ విగ్రహాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఆవిష్కరించనున్నట్లు త్రిదండి చినజీయర్‌ స్వామి తెలిపారు. జిమ్స్‌ హోమియోపతిక్‌ వైద్యకళాశాలలో రామానుజాచార్యుల దర్శనంపై 3రోజులుగా జరుగుతున్న అంతర్జాతీయ సదస్సు సోమవారం ముగిసింది. చివరిరోజు శంషాబాద్‌లోని దివ్యసాకేతం ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో చినజీయర్‌ మాట్లాడుతూ వివిధ దేశాలకు చెందిన 38 మంది ఆచార్యులు, మేధావులు, పండితులు రామానుజాచార్యులు రచించిన గ్రంథాలపై చర్చించడం హర్షణీయమన్నారు. అహోబిల జీయర్‌స్వామి, దేవనాథజీయర్‌ స్వామి, రంగరామానుజాచార్యులు, రామకృష్ణమాచార్యులు, మధుసూదనాచార్యులు, పరవస్తు వరదరాజన్‌, కృష్ణమాచార్యులు (నేపాల్‌), లక్ష్మణ్‌మూర్తి ప్రసంగించారు.
**తిరుమలలో దివ్యదర్శనం టికెట్ల విక్రయం ప్రారంభం
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్ల (రూ.300)కు సంబంధించి నవంబరు మాసం కోటాను తితిదే మంగళవారం విడుదల చేయనుంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి టిక్కెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. ఈ-దర్శన్‌, తపాలా కార్యాలయాల్లోనూ బుక్‌ చేసుకోవచ్చు. 2000 అద్దె గదులను కూడా ముందస్తు బుకింగ్‌కు వీలుగా ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
*తిరుమల శ్రీవారిని రాష్ట్ర డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ సోమవారం దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో ఆయనకు వేద పండితులు ఆశీర్వచనం చేశారు. అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందచేసి సత్కరించారు. డీజీపీ వెంట డీఐజీ ప్రభాకరరావు, ఎస్పీ అభిషేక్‌ మహంతి ఉన్నారు.
*35 టన్నుల చిల్లర నాణేల కరిగింపు! -చెల్లని పావలా తదితరాలపై నిర్ణయం
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారికి కానుకల రూపంలో వచ్చిన చిల్లర నాణేల్లో చలామణి కాకుండా నిలిచిపోయిన వాటిని కరిగించాలని తితిదే నిర్ణయించింది. దేవస్థానం వద్ద టన్నుల కొద్దీ ఉన్న నాణేలను స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాకు అప్పగించనుంది. చెల్లని పావలా(25 పైసలు), అంతకంటే తక్కువ విలువైన నాణేలను 2014 ఫిబ్రవరి వరకు వివిధ బ్యాంకులు తితిదే నుంచి తీసుకున్నాయి. తర్వాత నుంచి వాటిని స్వీకరించడం లేదు. తిరుపతి పరకామణిలో ఇలాంటి నాణేలు 35 టన్నుల వరకు పోగయ్యాయి. వీటిని వదిలించుకునేందుకు తితిదే రిజర్వు బ్యాంకును సంప్రదించగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అభిప్రాయం తీసుకోవాల్సిందిగా సూచించింది. దాన్ని సంప్రదించినా స్పందన లేదు. ఈ తరుణంలో తితిదే ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ప్రత్యేకంగా చొరవ తీసుకుని రిజర్వు బ్యాంకుతో పలుమార్లు సంప్రదించారు. చలామణిలేని నాణేలను కేంద్ర ప్రభుత్వ టంకశాలకు పంపడానికి విధివిధానాలను తెలుసుకున్నారు. వివిధ బ్యాంకుల ద్వారా కూడా వాడుకలో లేని నాణేలను సేలంకు చెందిన స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాకు తరలిస్తున్నట్లు, ఆ మేరకు తితిదే వద్ద ఉన్నవాటిని తరలించాలని టంకశాల జనరల్‌ మేనేజరు ద్వారా సమాచారం వచ్చింది. నాణేల్లో రాగి, ఇత్తడి, స్టీల్‌గా విభజించి సేలం స్టీల్‌ ప్లాంటుకు తరలించాలని సంకల్పించారు. ట్రక్కు ద్వారా దేవస్థానం సిబ్బంది పర్యవేక్షణలో సేలంకు చేర్చనున్నారు. తితిదే లడ్డూ ప్రసాదం ట్రేలను స్టీల్‌ అథారిటీ నుంచే కొనుగోలు చేస్తోంది. నాణేలకు, ట్రేలకు లింకుపెట్టి వ్యాపార లావాదేవీలు నిర్వహించాలని కూడా సంకల్పిస్తోంది. త్వరలోనే 35 టన్నుల నాణేలను తిరుపతి పరకామణి నుంచి తరలించనున్నారు.
*అన్నవరంలో అభివృద్ధి పనులు
అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానంలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రభుత్వం నాలుగు ఉత్తర్వులు జారీచేసింది. ఇందులో భాగంగా సత్యగిరిపై కొత్తగా 138 గదులతో నాలుగు అంతస్తుల భవనం, సామూహిక వివాహాలకు వీలుగా రేకులతో రెండు షెడ్లను నిర్మించనున్నారు. ప్రసాద తయారీ కేంద్రాన్ని(పోటు) పునర్నిర్మించనున్నారు. నాలుగు అంతస్తుల భవనానికి అవసరమైన రూ.16 కోట్లను దేవాలయ నిధులు, విరాళాల ద్వారా సేకరించి ఈ-ప్రొక్యూర్‌మెంట్‌ విధానంలో టెండర్లు పిలవనున్నారు. పోటు, కల్యాణ షెడ్ల నిర్మాణానికి నిర్దేశిత దాతల నుంచి మాత్రమే విరాళాలు సేకరించి నిధులు సమకూర్చుకోవాలని నిబంధనలు ఖరారు చేశారు.
*రిషికేశ్‌ శారదాపీఠంలో ఘనంగా అడైకృత్తిక వేడుకలు
రిషికేశ్‌లోని శారదా పీఠంలో సోమవారం పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వీయ పర్యవేక్షణలో అడైకృత్తిక (ఆషాఢమాసంలో వచ్చిన కృత్తిక) ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యస్వామికి నమక, చమక, మన్యసూక్తం, పురుషసూక్తం, వేదమంత్రోచ్ఛారణల నడుమ పంచామృతాభిషేకాలను నిర్వహించారు. అనంతరం పీఠాధిపతి అనుగ్రహ భాషణ చేస్తూ సుబ్రహ్మణ్యస్వామి ఆరాధనతో జాతకరీత్యా కలిగే దోషాలు పోతాయన్నారు. అలాగే చినముషిడివాడలో గల శారదా పీఠంలో అడైకృత్తిక ఘనంగా నిర్వహించారు. వల్లి,దేవసేన సహిత సుబ్రహ్మణ్యస్వామికి పంచమృతాభిషేకాలు నిర్వహించారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com