* ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో మరో సంచలనానికి సిద్ధమవుతోంది. రూ.5వేల లోపే 5జీ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. వీలైతే రూ.2,500 నుంచి రూ.3వేలకే విక్రయించాలని యోచిస్తోందని సమాచారం. ‘‘జియో రూ.5వేలలోపే ఓ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురావాలని చూస్తోంది. సేల్స్‌ను బట్టి రూ.2,500 నుంచి రూ.3వేల లోపే దాన్ని విక్రయించాలనుకుంటోంది’’ అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఆ కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. దీనిపై జియో అధికారికంగా ఎలాంటి ప్రకటనా వెలువడలేదు.
* గత ఏప్రిల్ 4న తొలిసారిగా ఐసీఐసీఐ వాట్సాప్ బ్యాంకింగ్‌ను ప్రవేశపెట్టింది. ఆ తర్వాత ఆదరణ విశేషంగా పెరిగింది. ఆరు నెలల వ్యవధిలోనే 20 లక్షల మందికి పైగా వినియోగదారులు ఈ సేవలను వినియోగించుకుంటున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఐసీఐసీఐ డిజిటల్ ఛానల్స్ అత్యున్నత అధికారి బిజిత్ భాస్కర్ చెబుతున్నారు. రిటైల్, ఎన్‌ఆర్‌ఐ, కార్పోరేట్, ఎంఎస్‌ఎమ్‌ఈ వినియోగదారులకు కూడా ప్రస్తుతం వాట్సాప్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉన్నట్లు చెప్పారు.
* ఎయిరిండియా మరింత ఆకర్షణీయం: ఎయిరిండియా ప్రైవేటీకరణకు మరింత బలం ఇచ్చేలా ప్రభుత్వం రూ.23,286 కోట్ల రుణాలను తగ్గించాలని భావిస్తోంది. విజయవంతమైన బిడ్డరుకు ఈ రుణాలతో సంబంధం ఉండదన్నమాట. ప్రతిపాదిత కోతకు మంత్రివర్గ సంఘం వచ్చే వారం ఆమోదం తెలిపే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం.
* పేటీఎమ్ టాప్‌అప్‌పై 2% ఛార్జీ: క్రెడిట్ కార్డు ఉపయోగించి పేటీఎమ్ వినియోగదార్లు ఇ-వాలెట్‌లో నగదు మొత్తాన్ని జత చేసిన పక్షంలో 2 శాతాన్ని ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటిదాకా ఒక నెల రోజుల్లో క్రెడిట్ కార్డు ద్వారా రూ.10,000 కంటే పైన నగదును టాప్‌అప్ చేసినపుడే 2 శాతం ఫీజు ఉండేది. యూపీఐ లేదా డెబిట్ కార్డు ఉపయోగిస్తే మాత్రం ఎటువంటి ఫీజు ఉండదు.
* ప్రెస్టేజ్ ఎస్టేట్ ఆస్తుల విక్రయం: స్థిరాస్తి సంస్థ ప్రెస్టేజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్ కొన్ని కార్యాలయ, రిటైల్, హోటల్ ఆస్తులను అంతర్జాతీయ పెట్టుబడుల కంపెనీ బ్లాక్‌స్టోన్‌కు విక్రయించడానికి అంగీకరించింది. కంపెనీ వాటి విలువ వెల్లడించకపోయినప్పటికీ ఈ ఆస్తుల విలువ రూ.12,000 కోట్ల వరకు ఉండొచ్చని విశ్వసనీయ వర్గాల సమాచారం.
* షాపర్స్ స్టాప్‌కు కొత్త ఎండీ, సీఈఓ: షాపర్స్ స్టాప్ తమ మేనేజింగ్ డైరెక్టర్(ఎండీ), చీఫ్ ఎగ్జిక్యూటివ్(సీఈఓ)గా వేణుగోపాల్ జి నాయర్‌ను నియమించుకుంది. రాజీనామా చేసిన రాజీవ్ సురి స్థానంలో నవంబరు 6, 2020 నుంచి మూడేళ్ల పాటు ఈయన బాధ్యత స్వీకరిస్తారు. ప్రస్తుతం ఈయన టాటా గ్రూప్‌నకు చెందిన ట్రెంట్‌కు సీఈఓగా ఉన్నారు.
* జైడస్‌కు యూఎస్‌ఎఫ్‌డీఏ అనుమతి: జైడస్ కేడిలాకు చెందిన యురోసోడియోల్ క్యాప్సూళ్లను అమెరికాలో మార్కెటింగ్ చేయడానికి యూఎస్‌ఫ్‌డీఏ అనుమతి లభించింది. 300 ఎంజీ పరిమాణంలో లభించే వీటిని కాలేయ వ్యాధి చికిత్సలో ఉపయోగిస్తారు.
* ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే లక్ష్యంగా ఉద్యోగులకు దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ కొత్త ఆఫర్ ప్రకటించింది. ఈ పండగ సీజన్‌లో మారుతీ కార్ల కొనుగోలుపై వారికి రూ.11 వేలకు వరకు ప్రయోజనాలను అందించనున్నట్లు ప్రకటించింది. కేంద్ర/ రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేసే ఉద్యోగులు.. పోలీసు, పారామిలటరీ సిబ్బంది కొత్త కారు కొనేటప్పుడు ఈ ప్రయోజనాలను అందిస్తామని పేర్కొంది. ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ పెంచేందుకు ప్రభుత్వం ఇటీవల పలు చర్యలు చేపట్టిందని, తమవంతు బాధ్యతగా వీటిని అందిస్తున్నామని కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెట్ అండ్ సేల్స్) శశాంక్ శ్రీవాస్తవ పేర్కొన్నారు.