Food

ఇండియాలో ఆహారం చాలా ఖరీదు వ్యవహారం

పేద దేశాల్లోని ప్రజలు తమ సంపాదనలో అధిక భాగం క్షుద్బాధను తీర్చుకునేందుకే వెచ్చించాల్సి వస్తోందని ప్రపంచ ఆహార కార్యక్రమ(డబ్ల్యూఎఫ్‌పీ) నివేదిక వెల్లడించింది. దక్షిణ సుడాన్‌ ప్రజలు తమ దినసరి సంపాదనలో సగటున 186శాతాన్ని భోజనం కోసమే ఖర్చు చేస్తున్నారని, అమెరికాలోని న్యూయార్క్‌ నివాసుల వ్యయం మాత్రం 0.6శాతంగానే ఉంటుందని వివరించింది. భారత్‌లో ఈ వ్యయం 3.5శాతమని పేర్కొంది. ఆదాయం (వేతనాలు/జీతాలు) తక్కువగా ఉన్న వారిలో కుటుంబ సభ్యుల ఆహార ఖర్చులే అధికంగా ఉంటున్నాయని డబ్ల్యూఎఫ్‌పీ తెలిపింది. ప్రజల ఆదాయం, ఆహారంపై ఖర్చులకు సంబంధించి ప్రపంచంలోని 36 దేశాలతో రూపొందించిన జాబితాలో మన దేశం 28వ స్థానంలో నిలిచింది. ఆహార వ్యయం అధికంగా ఉండే 20 దేశాల్లో …17సబ్‌ సహారా ఆఫ్రికాకు చెందినవే. ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లో ఒడుదొడుకులు, ఆహార దిగుమతులపై ఆధారపడాల్సిరావటం, ఆకస్మికంగా ఉపాధి కోల్పోవటంతో ఆదాయాలు తగ్గిపోవటం వంటి కారణాల వల్ల ఆఫ్రికా దేశాల్లో ప్రజల సంపాదన వారి కుటుంబ సభ్యుల భోజన ఖర్చులకు కూడా సరిపోవటంలేదని నివేదిక తెలిపింది. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల ప్రజల మధ్య అంతరాలు పెరగటానికి కూడా ఇవే పరిస్థితులు దోహదపడుతున్నాయని తెలిపింది. ఘర్షణలు, వాతావరణ మార్పులకు తోడు ఇప్పుడు కరోనా వైరస్‌ కూడా నిరుద్యోగం అధికమవటానికి కారణమైంది.