వరంగల్ బంగ్లాకు 133 సంవత్సరాలు

వరంగల్‌లో ఎన్నో భవంతులు ఉన్నా సుబేదారిలో కొలువుదీరిన కలెక్టర్‌ బంగ్లా హంగు, ఆర్భాటాలు ఎంతో ప్రత్యేకం. మాటల్లో కంటే కళ్లతో చూస్తే ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది. నాటి చరిత్రకు సాక్ష్యంగా, నిర్మాణ కార్మికుల అద్భుత పనితనానికి నిదర్శనంగా నిలిచి ఉన్న ఈ బంగ్లాకు శంకుస్థాపన జరిగి ఈ ఆగస్టు 10తో 133 సంవత్సరాలు పూర్తవుతోంది. కుతుబ్‌షాహీ పాలన తర్వాత దక్కన్‌ ప్రాంతాన్ని చేజిక్కించుకున్న అసఫ్‌జాహీల పాలన సుమారు ఒకటిన్నర శతాబ్దం పైగా అప్రతిహతంగా కొనసాగింది. ఆనాటి వైభవాన్ని చాటి చెప్పేలా పలు భవన సముదాయాల నిర్మాణం జరిగింది. కుతుబ్‌షాహీలు తమ పరిపాలనా సౌలభ్యం కోసం తమ రాజ్యాన్ని సుబాలుగా విభజించారు. ఒక్కో సుబాకు తరఫ్‌దార్‌ లేదా సుబేదార్‌ అనేవారు అధికారిగా ఉండేవారు. తానీషా కాలంలో గోల్కొండ రాజ్యం 6 సుబాలుగా ఉండేది. అందులో ఒకటి వరంగల్‌ సుబా. వరంగల్‌ సుబా పరిధిలో 61 పరగణాలు ఉండేవి. కుతుబ్‌షాహీ కాలంలోనూ, ఆ తర్వాత పాలించిన ఆసఫ్‌జాహీ కాంలోనూ వరంగల్‌ ఒక సుబాగా వెలుగొందింది. తర్వాత 1853లో నాసిరౌద్దౌలా తన దివాన్‌ గా సాలార్జంగ్‌ని నియమించారు. ఇతను నిజాం రాజ్యాన్ని 5 సుబాలుగా, 17 జిల్లాలుగా, ప్రతి జిల్లాను కొన్ని తాలూకాలుగా విభజించారు. 1875లో వరంగల్లులో భూమి సర్వే శాఖను స్థాపించారు. రెవెన్యూ బోర్డు ఏర్పడింది. సుబేదారి కలెక్టర్‌ కార్యాలయం సమీపంలో ఒక ప్రవేశ ద్వారం కనిపిస్తుంది. దాని మీద భారీ సైజులో గడియారం ఉంటుంది. అదే కలెక్టర్‌ బంగ్లా ద్వారం. అత్యంత పటిష్ఠంగా, శతృదుర్భేద్యంగా కోటలా నిర్మించిన ఈ భవనంలోకి వెళ్లడానికి నిర్మించిన కోటను దాటిన తర్వాత మనకు అతిపెద్ద భవంతి కనిపిస్తుంది. సుమారు 13 ఎకరాల విస్తీర్ణంలో విశాలమైన ప్రాంగణంలో దీనిని నిర్మించారు. 10-8-1886 నాడు బ్రిటిష్‌ పాల్మార్‌ భార్య ఈ బంగ్లా నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత కాలంలో సుబేదారులు నివాసంగా ఉపయోగించిన ఈ బంగ్లాను ఇప్పుడు వరంగల్‌ జిల్లా కలెక్టర్‌ అధికార నివాసంగా ఉపయోగిస్తున్నారు. నిజాం కాలంలో వివిధ పట్టణాల్లో నిర్మించిన భవంతుల్లో సుబేదారి బంగ్లా అతి పెద్దది. ఇందులోని విశాల ప్రాంగణంలో పచ్చిక బయళ్లు, నీటికొలను అందులో అతిపెద్ద ఫౌంటేన్‌ ఉన్నాయి. అతిధులు కూర్చొని మాట్లాడటానికి వీలుగా విశాలమైన హాలు నిర్మించారు. ఇరవై అడుగుల ఎత్తున సీలింగ్‌, ఆ సీలింగ్‌ నుంచి వేలాడుతూ లెక్కకు మిక్కిలిగా ఉన్న భారీ షాండిలియర్స్‌ అందాలు తప్పక చూడాల్సిందే ! ఆనాటి రాచరికపు హోదాకు తీపిగుర్తుగా షాండిలియర్‌ నేటికీ చెక్కు చెదరకుండా కనిపిస్తుంది. కరెంటు లేని ఆ రోజుల్లో పొగరాని కొవ్వొత్తులను వీటిలో వాడారు. ఈ భవనం లోపలికి వెళ్లడానికి ఒక వైపు మాత్రమే మార్గం ఉంది. మొదటి అంతస్తులో విశాలమైన టెర్రస్‌ వంటి నిర్మాణం ఉంది. ప్రతి అంతస్తులోపల చెక్క మెట్ల నిర్మాణం ఉంది. అవి ఇప్పటికీ చెక్కు చెదరలేదు. మొదటి అంతస్తు నుంచి చూస్తే మొత్తం బంగ్లా ప్రాంతం స్పష్టంగా కనిపిస్తుంది. భవన ప్రాంగణంలో ఒక అశ్వశాల కనిపిస్తుంది. మంచి నీటి అవసరాలకు ఒక దిగుడుబావి తవ్వారు. బంగ్లా కమాను కింద రెండు వైపులా కాపలా సిబ్బంది కోసం విశ్రాంతి గదులు నిర్మాణం చేశారు. మొత్తం ప్రాంగణంలో సుమారు 10కి పైగా గదులు ఉన్నాయి. వాటిలో ఒకటి అతిథుల కోసం, కలెక్టర్‌ కార్యాలయ నిర్వాహణ కోసం, సమావేశాల ఏర్పాటుకు కేటాయించారు. దట్టమైన చెట్ల నీడలో ఆనాటి తీపి గుర్తుగా ఈ భవనం నిలుస్తొంది. స్వాతంత్య్రం రాక పూర్వం సుబేదారు నివాసంగా వాడిన ఈ భవనాన్ని స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత 1950 నుంచి జిల్లా కలెక్టర్‌ నివాసంగా ఉపయోగిస్తున్నారు. ఇందులో 1950 నుంచి వరంగల్‌ తొలి కలెక్టర్‌ ఎంవీ. రాజ్వేదా నుంచి నేటి ఆమ్రపాలి వరకు 39 మంది నివాసం ఉన్నారు. అందులో చాలా మంది ప్రస్తుతం ప్రభుత్వంలో వివిధ ఉన్నత స్థానాల్లో ఉన్నారు. 1982లో జవహర్‌ కలెక్టర్‌గా ఉన్నప్పుడు బావి పూడిక తీశారు. ఆ సమయంలో బావిలో నిజాం కాలంనాటి కత్తులు, ఇతర సామగ్రి లభించాయి. వాటిని రాష్ట్ర పురావస్తు శాఖకు అప్పగించారు.
Warangal COllector BUngalow-TNILIVE Specials

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com