Food

గుంటూరు స్పెషల్ తాటిపాకం

Guntur Farmer Korlapati Mohanrao - Taatipakam Special

గుంటూరు జిల్లా మంతెనవారిపాలెం గ్రామానికి చెందిన కొర్లపాటి మోహన్‌రావు (74) ప్రకృతి వ్యవసాయం చేస్తుంటారు. ఏడాదిగా తాటి పాకం తయారీకి శ్రీకారం చుట్టారు. ప్రతిరోజూ తాటిపండ్లను సేకరించి వేడినీటిలో అరగంట సేపు ఉడకబెట్టి టికిడి ద్వారా గుజ్జును తీస్తారు. దానిలో బెల్లం కలిపి, కట్టెలపొయ్యి మీద 150 డిగ్రీల సెల్సియస్‌ వద్ద ఐదు గంటల సేపు మరిగిస్తారు. చివరికి తేనెలా జిగటగా పాత్ర అడుగు భాగంలో పాకం తయారవుతుంది. దీనిని నిల్వ ఉంచేందుకు సోడియం బెంజోయెట్‌ పౌడరుని కొంచెం కలుపుతారు. దీని వల్ల ఇది సుమారు రెండేళ్ల పాటు ఉంటుంది. దీనిని సీసాల్లో నిల్వ ఉంచి ఇప్పుడిప్పుడే సామాజిక మాధ్యమాల్లో ప్రచారాన్ని ప్రారంభించాడు. తాను లాభాపేక్ష కోసం ఇలా చేయడం లేదని, తనను చూసి నలుగురు యువత అనుసరించి ఇంకా ఆధునిక పద్ధతుల్లో తయారు చేస్తే బావుంటుందని రైతు మోహన్‌ రావు పేర్కొన్నారు. ఈ తాటిపాకంలో ఐరన్‌, జింక్‌, విటమిన్‌ ఎ పుష్కలంగా లభిస్తుందని, పీచు శాతం ఎక్కువగా ఉంటుందని గుంటూరులోని గృహవిజ్ఞాన కళాశాల అసోసియేట్‌ డీన్‌ జాగర్లమూడి లక్ష్మి తెలిపారు. ఔషధ గుణాలు కూడా మెండుగా ఉండడంతో పాటు, జీర్ణప్రక్రియ వేగంగా, సులువుగా జరగడానికి సహాయపడుతుందని పేర్కొన్నారు. తమిళనాడు రాష్ట్రంలో వీటిపై పరిశోధనలు జరుగుతున్నాయని వివరించారు.