గిరిజన ప్రాంత పాఠశాలల్లో డిజిటల్ తరగతుల ఏర్పాటును ముమ్మరం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. ప్రవాసాంధ్రుల సహకారంతో ఏపీ జన్మభూమి గిరిజన ప్రాంతాల్లో సేవలు విస్తరించడాన్ని అభిననందించారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలో భాగంగా పాడేరు మండలం ఆడారిమెట్ట గ్రామంలోని మండల పరిషత్ ప్రాధమిక పాఠశాలలో ప్రవాసాంధ్రుడు రావాడ సుభాష్ ఆర్ధిక సహకారంతో ఏర్పాటు చేసిన డిజిటల్ తరగతులను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, నక్కా ఆనంద్ బాబు, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి (ఉత్తర అమెరికా) జయరాం కోమటి, ఏపీ జన్మభూమి సమన్వయకర్త, మాడుగుల తెలుగుదేశం నాయకులు పైలా ప్రసాదరావు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాడేరు గిరిజన ప్రాంతంలో డిజిటల్ తరగతులు ఏర్పాటు, అంగన్వాడీ కేంద్రాల ఆధునీకరణకు సహకరిస్తున్న ప్రవాసాంధ్రులను చంద్రబాబు ప్రశంసించారు. ప్రవాసాంధ్రులకు పుట్టిన రాష్ట్రం మీద చూపిస్తున్న మమకారం మూలంగా ఎందరో చిన్నారులకు లబ్ది చేకూరడం హర్షణీయం ఆన్నారు. జయరాం కోమటితో కలిసి ఆడారిమెట్ట ప్రాధమిక పాఠశాల చిన్నారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సంభాషించారు. వారు విద్యా బుద్దులు అలవార్చుకుంటున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఐదో తరగతి ఇంగ్లీషు పాఠాలలో ప్రశ్నలను చదివించి మిగతా పిల్లల చేత జవాబులు అడిగి తెలుసుకున్నారు. తమ పాటశాలలో కంప్యూటర్, స్క్రీన్ లతో కొత్తగా డిజిటల్ తరగతులను ఏర్పాటు చేయడం పట్ల చిన్నారులు సంతోషం వ్యక్తం చేసారు. ఏపీ జన్మభూమి ద్వారా ప్రవాసాంధ్రుల సహకారంతో రాష్రంలో ఐదు వేల పాటశాలలలో డిజిటల్ తరగతులు ఏర్పాటు చేయాలనే లక్ష్యాన్ని త్వరలోనే అందుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాక్షించారు.
Chandrababu appreciates ap janmabhoomi activities-tnilive nri news