కుంబ్లే విజృంభించిన రోజు నేడే

భారత క్రికెట్‌ జట్టు మాజీ సారథి, స్పిన్‌ మాంత్రికుడు అనిల్‌ కుంబ్లే గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తన స్పిన్‌ మాయాజాలంతో ఒంటిచేత్తో జట్టుకు ఎన్నో మరపురాని విజయాలు అందించాడు. 503 మ్యాచ్‌లాడిన కుంబ్లే తన అంతర్జాతీయ క్రికెట్‌ కెరీర్‌లో ఒకే ఒక్క శతకాన్ని నమోదు చేసుకున్నాడు. అది కూడా ఆషామాషీ జట్టుపై కాదు. సొంతగడ్డపై అసలే కాదు. ఇంతకీ ఎక్కడో తెలుసా.. ఇంగ్లిష్‌ గడ్డపై. ప్రత్యర్థి ఇంగ్లాండ్‌పై. ఇంతకీ ఇదంతా ఇప్పుడు ఎందుకంటే.. అనిల్‌ కుంబ్లే శతకం నమోదు చేసి ఈ రోజుకు సరిగ్గా పదకొండేళ్లు. 2007 ఆగస్టు 10న కుంబ్లే ఓవల్‌ మైదానంలో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టులో 110 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. సహచర ఆటగాడు ఔటవ్వకుండా మరింత సహకారం అందిస్తే కుంబ్లే మరిన్ని పరుగులు చేసేవాడే. 2007 జులైలో రాహుల్‌ ద్రవిడ్‌ నాయకత్వంలో టీమిండియా మూడు టెస్టులు ఆడేందుకు ఇంగ్లాండ్‌ పర్యటనకు వెళ్లింది. లార్డ్స్‌ వేదికగా ఇరు జట్ల మధ్య జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసింది. అనంతరం నాటింగ్‌ హామ్‌లో జరిగిన రెండో టెస్టులో భారత్‌ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఓవల్‌ వేదికగా ఆగస్టు 9న ఇరు జట్ల మధ్య సిరీస్‌లో చివరిదైన మూడో టెస్టు ప్రారంభమైంది. టాస్‌ గెలిచిన భారత్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఓపెనర్‌ దినేశ్‌ కార్తీక్‌(91), ద్రవిడ్‌(55), సచిన్‌ తెందుల్కర్‌ (82), వీవీఎస్‌ లక్ష్మణ్‌ (51), ధోనీ(92) రాణించారు. ఇదే టెస్టులో అనిల్‌కుంబ్లే కూడా బ్యాట్‌తో చెలరేగిపోయి ఆడాడు. రెండో రోజు ఆటలో(ఆగస్టు 10న) శతకం కూడా నమోదు చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో మొత్తం 193 బంతులు ఎదుర్కొన్న కుంబ్లే 16 ఫోర్లు, ఒక సిక్స్‌తో 110 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. జట్టు స్కోరు 664 పరుగుల వద్ద శ్రీశాంత్‌ ఔటవ్వడంతో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఈ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి కుంబ్లేకు 5 వికెట్లు కూడా దక్కాయి. దీంతో మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్ అవార్డును దక్కించుకున్నాడు. ఇరు జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్‌ డ్రాగా ముగియడంతో మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్‌ 1-0తో చేజెక్కించుకుంది. 1990లో భారత్‌ తరఫున అరంగేట్రం చేసిన అనిల్‌ కుంబ్లే తొలి అంతర్జాతీయ శతకం సాధించడానికి 17 ఏళ్లు పట్టింది. అంతేకాదు, అప్పటికి కుంబ్లే భారత్‌ తరఫున (టెస్టులు, వన్డేలు) మొత్తం 388 మ్యాచ్‌లు ఆడాడు. 389వ మ్యాచ్‌లో శతకం సాధించాడు. భారత్‌ తరఫున పెద్ద వయస్సులో శతకం సాధించిన రికార్డు కుంబ్లే పేరు మీదే ఉంది. 36ఏళ్ల 296 రోజుల వయస్సులో కుంబ్లే శతకం సాధించడం విశేషం. 2007లో వన్డేలకు, 2008లో టెస్టులకు కుంబ్లే వీడ్కోలు పలికాడు. టీమిండియాకు కోచ్‌గా కూడా పనిచేశాడు కుంబ్లే.
Kumble 110 not out-tnilive sports

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com