Business

SBI రుణాలపై తీపికబురు-వాణిజ్యం

SBI రుణాలపై తీపికబురు-వాణిజ్యం

* పండుగల సమయంలో శుభవార్త చెప్పింది దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకిగ్ సంస్థ ఎస్బీఐ… దసరా, దీపావళి సందర్భంగా తమ కస్టమర్లను ఆకట్టుకునేందుకు పండుగ ఆఫర్లను ప్రకటించింది.  తమ కస్టమర్లకు గోల్డ్ లోన్, పర్సనల్ లోన్, కారు లోన్ వంటి రుణాలను అతి తక్కువ వడ్డీకే అందిస్తామని తెలిపింది. దీంతోపాటు ఈ రుణాలపై గతంలో ఉన్న ప్రాసెసింగ్ ఫీజును కూడా తగ్గించింది. ఎస్బీఐ యోనో యాప్ ద్వారా లోన్ అప్లై చేసుకుంటే ఎలాంటి ప్రాసెసింగ్ చెల్లించాల్సిన అవసరం లేదన్నది ఎస్బీఐ. గోల్డ్ లోన్‌పై వడ్డీ రేట్లను కూడా బ్యాంకు తగ్గించింది. ఇప్పుడు గోల్డ్ లోన్ వడ్డీ రేట్లు 7.5 శాతం నుంచి ప్రారంభమవుతాయి. ఆఫర్ కింద తీసుకున్న రుణాన్ని మూడేళ్లలోపు తిరిగి చెల్లించాలి. దీంతో పాటు పర్సనల్ లోన్‌పై కూడా తగ్గింపులను ప్రకటించింది. 

* దేశీయ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా అందిస్తున్న వాహన సబ్‌స్క్రిప్షన్ ప్రోగ్రాంను ఇప్పుడు హైదరాబాద్‌, పుణె నగరాలకూ విస్తరించింది. ఇప్పటి వరకు ఈ స్కీమ్‌ దిల్లీ, బెంగళూరులో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ స్కీమ్‌లో కారును నేరుగా కొనుగోలు చేయకుండానే ఉపయోగించుకోవచ్చు. ప్రతి నెలా నిర్వహణ ఛార్జీల కింద కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఈ స్కీమ్‌ అమలు కోసం జపాన్‌కు చెందిన ఒరిక్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ ఇండియా కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

* కొవిడ్‌ నివారణకు అమెరికాకు చెందిన మోడెర్నా అభివృద్ధి చేస్తున్న టీకా ప్రయోగాల మధ్యంతర ఫలితాలు నవంబర్‌లో వెలువడవచ్చని ఆ సంస్థ సీఈవో స్టెఫానీ బన్సెల్‌ పేర్కొన్నారు. ఇవి సానుకూలంగా ఉంటే దీని అత్యవసర వినియోగానికి డిసెంబర్‌లో ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. అమెరికాకు చెందిన వాల్‌స్ట్రీట్‌జర్నల్‌తో మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు. ఒక వేళ ఆశించిన ఫలితాలు రాకపోతే వచ్చే ఏడాది ప్రారంభం వరకు ఎటువంటి అనుమతులూ వచ్చే అవకాశం లేదని వివరించారు. ప్రయోగ ఫలితాల విశ్లేషణ నవంబర్‌లో ఏ వారంలో జరుగుతుందో కచ్చితంగా చెప్పలేమన్నారు.

* దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి. ఉదయం 9.45 సమయంలో సెన్సెక్స్‌ 152 పాయింట్లు లాభపడి 40,583 వద్ద, నిఫ్టీ 35 పాయింట్ల లాభంతో 11,905 వద్ద ట్రేడవుతున్నాయి. ఇండియాబుల్స్‌ ఇంటిగ్రేట్‌, హింద్‌కాపర్‌, శంకర బిల్డింగ్‌ ప్రొడక్ట్స్‌, ఒబెరాయ్‌ రియాల్టీ, టాటా మెటాలిక్‌ షేర్లు లాభాల్లో ఉండగా.. బ్రిటానియా ఇండియా, ర్యాలీస్‌ ఇండియా, లక్ష్మీవిలాస్‌ బ్యాంక్‌, అంబర్‌ ఎంటర్‌ప్రైజెస్‌, అక్‌జో నోబెల్‌ ఇండియా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

* దేశవ్యాప్తంగా 5జీ సేవలను మధ్య, తక్కువ స్థాయి బాండ్‌ స్పెక్ట్రమ్‌పై తీసుకురావాలంటే ఆయా కీలక నెట్‌వర్క్‌ భాగాలపై రూ.1.3-2.3 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టాల్సి రావొచ్చని మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ తన నివేదికలో పేర్కొంది. 5జీ సేవలకు ఒక్క ముంబయిలోనే రూ.10,000 కోట్ల మూలధన వ్యయాలు అవసరమవుతాయని.. దిల్లీ విషయంలో ఇవి రూ.8,700 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా కట్టింది. ట్రాయ్‌ తాజా రిజర్వ్‌ ధర ప్రకారం..100 మెగాహెర్ట్జ్‌ మిడ్‌ బాండ్‌ స్పెక్ట్రమ్‌ను ముంబయిలో కొనుగోలు చేయడానికి రూ.8400 కోట్ల వరకు అవుతుంది. ఒక వేళ బిడ్డింగ్‌ ధర ప్రాథమిక ధర కంటే పెరిగితే ఈ వ్యయం మరింత అవవచ్చు. 9000 సైట్ల వరకు కవరేజీ ఉండాలనుకుంటే.. ఆ సైట్లకు మొత్తం మూలధన వ్యయం రూ.1800 కోట్లు అవుతుంది. ఆ లెక్కన రూ.10,000 కోట్ల వరకు పెట్టుబడులవ్వొచ్చు.

* దేశ రాజధాని దిల్లీలో నూతన పార్లమెంటు భవన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న పార్లమెంటు భవనానికి సమీపంలోనే నూతన భవన నిర్మాణం సాగుతోంది. దాదాపు 1,400 మంది ఎంపీలు కూర్చునేందుకు వీలుగా నూతన భవనం విశాలంగా ఉండనుంది. దాదాపు రూ.860 కోట్లతో సెంట్రల్‌ విస్తా రీడెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా 22 నెలల వ్యవధిలో పార్లమెంట్ భవనం పూర్తి చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ భవన నిర్మాణ కాంట్రాక్టును ప్రముఖ సంస్థ టాటా ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌ దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే, పార్లమెంట్ బిడ్‌ను పొందే క్రమంలో టాటా సంస్థ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందని షాపూర్‌జీ పల్లోంజీ (ఎస్‌పీ) గ్రూప్ గతంలో‌ ఆరోపించింది. అయితే, ప్రాజెక్టు బిడ్డింగ్ ప్రక్రియ‌లో ఎటువంటి అవకతవకలు జరగలేదని కేంద్రం స్పష్టం చేయడంతో షాపూర్‌జీ పల్లోంజీ తన ఆరోపణలను వెనక్కి తీసుకుంది. ఈ మేరకు కేంద్ర ప్రజా పనుల విభాగం (సీపీడబ్ల్యూడీ)కు ఎస్‌పీ లేఖ రాసింది. ఇకపై పార్లమెంట్‌ భవన కాంట్రాక్ట్‌కు సంబంధించిన విషయాలపై ఎటువంటి ఆరోపణలను చేయబోమని స్పష్టం చేసింది.