Devotional

బతుకమ్మ పూలలో ఔషధ గుణాలు

బతుకమ్మ పూలలో ఔషధ గుణాలు

మానవత్వానికి సజీవరూపాలే దైవాత్మక ధార్మిక పౌరాణిక సాంప్రదాయాలు. వీటికి తార్కాణమే వివిధ దైవ స్వరూపాలు, విభిన్న పూజా విధానాలు. ఈ శరన్నవరాత్రులలో జగన్మాతను వివిధ రూపాలలో దర్శించి, పూజించి తరిస్తారు భక్తులు. అమ్మవారి పూజా ద్రవ్యాలలో పుష్పాలదే ప్రథమస్థానం. ప్రకృతి దత్తమైన ఈ పువ్వులు వివిధ వర్ణాలతో శోభిల్లుతుంటాయి. ఈ తొమ్మిది రోజులు ఒక్కొక్క రోజున ఒక్కొక్క రంగులో గల పువ్వులతో పూజించడం సాంప్రదాయం. వీటిలో ప్రాంతీయ భేదాలుండటం సహజం. వివిధ వర్ణ పుష్పాలతోనే దైవాంశ సంభూతమైన బతుకమ్మలను రూపొందించి ఆరాధించటం తెలంగాణ తెలుగు ప్రజల విశిష్టత. ఈ పువ్వుల ఔషధ విలువలు, ఆరోగ్య ప్రయోజనాలు ఆయుర్వేద గ్రంథాలలో నిక్షిప్తమై ఉన్నాయి. వీటి ప్రాబల్యాన్ని నేటి ఆధునిక పరిశోధనలు మరింత విస్తృతం చేసాయి.
**తంగేడు, సంపంగి, బంతి, చేమంతి వంటి పసుపు పచ్చని పూలను, మందార, ఎర్రగులాబీ, గునుగు, పట్టుకుచ్చు వంటి ముదురు లే త ఎరుపురంగుపూలను, కనకాంబరాలను, నందివర్ధనం, మల్లి, జాజి, పున్నాగ, తామర వంటి తెలుపురంగు పూలను, నీలిరంగు కట్ల పూలను, ఆకుపచ్చని బిళ్ల సంపంగి పూలను మనం తరచుగా చూస్తుంటాం.
*తంగేడు:
మార్కండీ, భూమి వల్లీ, పీత పుష్పీ మొదలైనవి కొన్ని పర్యాయపదాలు. కాశ్మీర దేశపు నేలలో… తంగేడు లతలా, ఇతర ప్రాంతాలలో మొక్కలా పెరుగుతుంది. ఇది వాంతులను, విరేచనాలను కలిగించి దేహశోధనకు ఉపకరిస్తుంది. క్రిమిహరం, విషహరం. చర్మ, మూత్ర, ఉదర రోగాలు, కీళ్ల నొప్పులు, మధుమేహ, కంటి రోగాలకు ఉపశమనం కలిగిస్తుంది. మార్కండికా కుష్ఠ హారీ ఊర్ధ్వ అధః కాయశోధినీవిషదుర్గంధ కాసఘ్నీ గుల్మ ఉదర వినాశినీ ‘‘
*బంతి:
శరీర గాయాలను మాన్పుతుంది. క్రిమిహరం. మొటిమలు, చర్మరోగాలను తగ్గిస్తుంది. కళ్లకలకకు ఉపశమనం కలిగిస్తుంది.
*రుద్రాక్ష:
దీనిని చంద్రకాంత అని కూడా అంటారు. వాపులను, వ్రణాలను, సెగ గడ్డలను తగ్గిస్తుంది.
*తెల్ల చామంతి:
ఇది శీతకరం. మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. కంటి రోగాలకు మంచిది. బలకరం.
*నందివర్ధనం:
పొట్టలోని కృములను నశింపచేస్తుంది. పంటినొప్పిని, కంటిరోగాలను పోగొడుతుంది.
*కట్ల:
వాపులను, మధుమేహాన్ని, క్యాన్సరును అదుపు చేస్తుంది.
*కనకాంబరం: కృమిహరం
*బీర:
ముక్కు దిబ్బడను, పడిశాన్ని తగ్గిస్తుంది. ఛాతీ, కండరాల నొప్పులకు ఉపశమనం కలుగచేస్తుంది.
*చిట్టి చేమంతి:
జ్వరాలు, వాపులు, జలుబులను తగ్గిస్తుంది. మధుమేహం, ప్రోస్టేట్‌ క్యాన్సర్లను అదుపు చేస్తుంది.
*వాము పువ్వు:
జలుబు, ముక్కుదిబ్బడ, ఆంత్రకృతములు, పంటి నొప్పి, అతిసారం, మూత్రాశయంలో రాళ్లు, ఎసిడిటీ, వికారాలలో గుణకారి.
*సంపంగి:
చంపక, చాంపేయ, సురభి, శీతల, హేమపుష్ప మొదలైనవి పర్యాయపదాలు. ఇది చలవ చేస్తుంది. క్రిమి, విషహరం. రక్తస్రావాలను అరికడుతుంది. వాత, కఫరోగహరం. మూత్రం కష్టంగా అవ్వటాన్ని పోగొడుతుంది. (చంపకః విష క్రిమిహరః మూత్రకృచ్ఛ్ర; కఫ, వాత రక్త పిత్త జిత్‌)
*మొగలి:
కేతక, సూచి, ఇందుకలికా, జంబుల, చామర అనేవి కొన్ని పర్యాయాలు. ఇది ఉష్ణకరం, లఘువు, కఫహరం, నేత్రాలకు మంచిది. (హేమకేతకీ… చక్షుష్యా, ఉష్ణా, లఘు, చక్షుస్యా….)
*మందార:
జపా, రాగపుష్పి, అర్కప్రియా… అనేవి కొన్ని పర్యాయాలు. ఎర్ర మందారం కఫవాతహరం, కేశవర్ధకం, అతిసారహరం. (జపా సంగ్రాహిణీ కేశ్యా…. కఫవాతజిత్‌)
*మంకెన:
రక్తక, బంధుక, అర్కవల్లభ, హరిప్రియ… అనేవి కొన్ని పర్యాయాలు. ఇది లఘువు, కఫకరం, వాతపిత్తహరం, గ్రాహి (దేహం నుంచి ద్రవాంశలు బయటికి పోయి వ్యాధికారకమైనప్పుడు, వాటిని బయటకు పోనీయదు. కనుక అతిసారహరం), (బంధూకః కఫకృత్‌ గ్రాహీ వాతపిత్త హరో లఘుః)
*సిందూర పుష్పం:
రక్తబీజా, సుకోమలా, కరచ్ఛదా… మొదలైనవి పర్యాయాలు. ఇది చలువ చేస్తుంది. రక్తస్రావాన్ని అరికడుతుంది. విషహరం, దప్పిక, వాంతులను పోగొడుతుంది. (సిందూరీ విష, రక్త పిత్త తృష్ణా వమనహరీ హిమా)
*గులాబీ:
శతపత్రీ, తరుణీ అతి మంజులా, సుమనా.. కొన్ని పర్యాయాలు. ఇది లఘువు, శీతలం, గ్రాహి, త్రిదోష రక్తదోషాలను పోగొడుతుంది. హృదయానికి మంచిది. వీర్యవర్థకం. చర్మకాంతిని పెంచుతుంది. (శతపత్రీ హిమా హృద్యా గ్రాహిణీ శుక్రలా లఘుః, దోషత్రయా ర క్తజిత్, వర్ణ్యా…. పాచనీ)
*మల్లె:
శ్రీపదీ, వార్షికీ, ముక్తబంధనా మొదలైనవి పర్యాయాలు. ఇది సుగంధకరమై మనసుకి ఉత్తేజాన్ని కలిగిస్తుంది. కామోద్దీపకం, చెవి, కన్ను, ముఖ (నోరు) రోగాలకు హితకారి. శీతలం, లఘువు, శిరశ్శూలహరం. (వార్షికీ శీతలా లఘ్వీ… కర్ణ అక్షి ముఖరోగఘ్నీ, సమ్మోహకరీ… తల్తైలం తద్గుణం స్మృతమ్‌)
*జాజి:
జాతీ, సుమనా, మాలతీ, ప్రియా, రాజపుత్రికా పర్యాయాలు. ఇది లఘువు, ఉష్ణం, అక్షి, ముఖ, దంత రోగాలను తగ్గిస్తుంది. విషహరం, చర్మరోగాలలో, వాతరక్తం (గౌట్‌)లో గుణకారి.
*కలువ:
కుముదం, కువలయం, ఉత్పల, సౌగంధిక మొదలైనవి పర్యాయాలు. ఇది మధురంగా, జిడ్డుగా ఉంటుంది. శీతలం, ఆహ్లాదకరం. ఇది తెలుపు, ఎరుపు, నీలిరంగులలో లభిస్తుంది.
*తామరపువ్వు:
పద్మ, కమల, సరోజ, అరవింద, నలినీ, బిసినీ, మృణాళినీ మొదలైనవి పర్యాయాలు. ఇది గురువు, శీతలం, స్త్రీల రుతు రోగహరం. వాత, మలబంధకరం, క్యాన్సర్లలో గుణకారి.
*మెట్ట తామర:
భూమి మీద పెరుగుతుంది. మూత్రాశయంలోని రాళ్లను కరిగిస్తుంది. శూలహరం, దగ్గు, ఆయాసం, విషహరం.
*గునుగు:
ఇది గడ్డిజాతి విశేషం. రక్తస్రావహరం. స్త్రీ రోగాలలోను, రక్తపోటుకు గుణకారి.
*జమ్మి:
శమీ, శివఫలా, శుభగా, సుభద్రా పర్యాయాలు. ఇది శీతలం, లఘువు, విరేచనకారి. దగ్గు, ఆయాసం, చర్మరోగాలు, భ్రమ (తల తిరుగుడు), ఆర్శమొలలను తగ్గిస్తుంది. జమ్మి కాయ మేధ్యం, వెంట్రుకలను రాలుస్తుంది.